తీరం దాటిన బుల్‌బుల్

Sun,November 10, 2019 02:46 AM

-బెంగాల్, ఒడిశాలో తుఫాన్ బీభత్సం
-భారీ వర్షాల కారణంగా ఇద్దరు మృతి
-కోల్‌కతా ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు నిలిపివేత
-బెంగాల్, ఒడిశాలో తుఫాన్ బీభత్సం
-భారీ వర్షాల కారణంగా ఇద్దరు మృతి
-కోల్‌కతా ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు నిలిపివేత

భువనేశ్వర్, నవంబర్ 9: బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్‌బుల్ తుఫాన్ శనివారం రాత్రి 8 గంటలకు పశ్చిమబెంగాల్‌లోని సాగర్ ద్వీపం దగ్గర తీరం దాటింది. అనంతరం ఇది సుందరబన్ డెల్టా మీదుగా బంగ్లాదేశ్ వాయవ్య దిశగా కదిలి క్రమంగా బలహీనపడుతుందని కోల్‌కతాలోని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. మరోవైపు తుఫాన్ ప్రభావంవల్ల బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో గంటకు 120-130 కి.మీ వేగంతో గాలులు వీయవచ్చని పేర్కొంది. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావద్దని, మత్య్సకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. కోల్‌కతాతోపాటు ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, హుగ్ల్లీ, హౌరా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 60-70 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. మరోవైపు బుల్‌బుల్ తుఫాన్ ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ర్టాల్లో బీభత్సం సృష్టించింది. రెండు రాష్ర్టాల్లో భారీ వర్షాల కారణంగా ఇద్దరు మరణించారు.

కోల్‌కతాలో చెట్టుకూలి ఒకరు, ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో గోడ కూలి మరొకరు చనిపోయారు. ఒడిశాలోని భద్రక్ జిల్లాలోని ధర్మాలో రికార్డుస్థాయిలో గంటలకు 110 కి.మీ వేగంతో గాలులు వీచాయని, కేంద్రపార, జగత్‌సింగ్‌పూర్, భద్రక్ జిల్లాల్లో భారీగా చెట్లు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు ప్రత్యేక సహాయ కమిషనర్ ప్రదీప్ జీనా తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని, కొన్ని పడవలు దెబ్బతిన్నాయన్నారు. సుమారు 4 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లోని సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. సీఎం మమతా బెనర్జీ రాత్రంతా అక్కడే ఉండి తుఫాన్ పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని, ప్రజలు భయాందోళన చెందవద్దని ట్విట్టర్ ద్వారా కోరారు. లక్షా 24 మంది ప్రజలను ప్రత్యేక శిబిరాలకు తరలించినట్లు తెలిపారు.
bul-bul1
మరోవైపు ఢిల్లీలో క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ నేతృత్వంలో జాతీయ సంక్షోభ నివారణ కమిటీ (ఎన్సీఎంసీ) తుఫాన్ ప్రభావం, సహాయక కార్యక్రమాలపై సమీక్షించింది. సహాయక చర్యల కోసం జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందాలతోపాటు తీర ప్రాంత గస్తీ సిబ్బందిని సిద్ధం చేసింది. పలు నౌకలు పారాదీప్, ధర్మా, సాగర్ ద్వీప తీరాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లినట్లు కోస్ట్ గార్డ్ ఐజీ రాజన్ తెలిపారు. విశాఖపట్నంలో మూడు నౌకలు సహాయక సామగ్రితో సిద్ధంగా ఉన్నట్లు రక్షణశాఖ వర్గాలు పేర్కొన్నాయి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎరియల్ సర్వే, సహాయక సామగ్రి చేరవేతకు ఐఎన్‌ఎస్ డేగా ఎయిర్ స్టేషన్ వద్ద నౌకాదళనికి చెందిన హెలీకాప్టర్లను సిద్ధం చేసినట్లు వెల్లడించాయి. మరోవైపు తుఫాన్ నేపథ్యంలో రైల్వే శాఖ కూడా అప్రమత్తమైంది. తూర్పు, ఆగ్నేయ రైల్వే సెక్షన్లపై ప్రభావాన్ని అంచనా వేసింది. భారీ గాలుల నేపథ్యంలో కోల్‌కతా విమానాశ్రయంలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు విమాన రాకపోకలను నిలిపివేయడంతోపాటు 8 సర్వీసులను రద్దు చేసినట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ తెలిపింది.

బంగ్లాదేశ్‌లో భారీగా ప్రజల తరలింపు

బుల్‌బుల్ తుఫాన్ పట్ల బంగ్లాదేశ్ అప్రమత్తమైంది. తీర ప్రాంతాలపై ప్రభావం చూపే అవకాశముండటంతో ముందు జాగ్రత్తగా 18 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. శుక్రవారం నాటికి 3 లక్షల మందిని సహాయక శిబిరాలకు తరలించినట్లు విపత్తు మంత్రిత్వ శాఖ కార్యదర్శి షా కమల్ తెలిపారు. తుఫాన్ తీరం దాటిన అనంతరం సహాయక చర్యల కోసం ఆర్మీ సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు ఆయన వివరించారు.

1116
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles