రాజస్థాన్‌లో బీఎస్పీకి షాక్!

Wed,September 18, 2019 03:04 AM

-కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఆ పార్టీ ఎమ్మెల్యేలు
-మత శక్తులకు వ్యతిరేకంగా పోరాడటానికేనని వెల్లడి
-కాంగ్రెస్ విశ్వాసఘాతక పార్టీ అని మళ్లీ రుజువైంది: మాయావతి

జైపూర్/లక్నో, సెప్టెంబర్ 17: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతికి రాజస్థాన్‌లో ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ర్టానికి చెందిన ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు సోమవారం రాత్రి కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఎమ్మెల్యేలు రాజేంద్ర సింగ్ గుడా, జోగేంద్రసింగ్ అవనా, వాజిబ్ అలీ, లఖన్ సింగ్ మీనా, సందీప్ యాదవ్, దీప్ చంద్.. అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషిని కలిసి తాము కాంగ్రెస్‌లో చేరడానికి నిర్ణయించుకున్నట్టు తెలుపుతూ ఓ లేఖను అందించారు. మత శక్తులకు(బీజేపీకి) వ్యతిరేకంగా పోరాడటానికి, రాష్ర్ట ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ సర్కారుకు మరింత బలాన్ని చేకూర్చేందుకే మేము ఆ పార్టీలో చేరాం.

ఈ విషయాన్ని చెప్పడానికి మేము మొదట సీఎం గెహ్లాట్‌ను కలిశాం. తర్వాత మా నిర్ణయాన్ని లేఖ రూపంలో స్పీకర్‌కు అందజేశాం అని ఎమ్మెల్యే రాజేంద్రసింగ్ గుడా మంగళవారం మీడియాకు తెలిపారు. రాజస్థాన్ అసెంబ్లీలో 200 స్థానాలున్నాయి. కాంగ్రెస్‌కు 100 సభ్యుల బలం ఉండగా, రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్డీ)కు చెందిన ఒక ఎమ్మెల్యే మద్దతిస్తున్నారు. అలాగే, 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేల్లో 12 మంది మద్దతు కూడా కాంగ్రెస్‌కు ఉన్నది. తాజాగా ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేల చేరికతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 119కి చేరింది. ఇక, అసెంబ్లీలో ఖాళీగా ఉన్న మరో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగాల్సి ఉన్నది.

కాంగ్రెస్ ద్రోహం: మాయావతి

తమ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని మాయావతి తీవ్రంగా ఆక్షేపించారు. కాంగ్రెస్ తమకు మరోసారి నమ్మకద్రోహం చేసిందని విరుచుకుపడ్డారు. అదో విశ్వాస ఘాతక పార్టీ అని అభివర్ణించారు. రాజస్థాన్‌లోని కాంగ్రెస్ సర్కారు మరోసారి బీఎస్పీ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకున్నది. కాంగ్రెస్ తననుతాను నమ్మడానికి వీలులేని, విశ్వాస ఘాతక పార్టీ అని మరోసారి రుజువు చేసుకున్నది అని అన్నారు. ప్రత్యర్థి పార్టీలతో పోరాడాల్సింది పోయి కాంగ్రెస్ తనకు మద్దతునిచ్చే పార్టీలకే నష్టం చేకూరుస్తూ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ వ్యతిరేకం. ఆయా వర్గాల హక్కుల కోసం పోరాడే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేదు అని ధ్వజమెత్తారు. అంబేద్కర్ సిద్ధాంతాలకు కాంగ్రెస్ వ్యతిరేకమని, అందుకే నెహ్రూ హయాంలో దేశ తొలి న్యాయశాఖ మంత్రి పదవికి అంబేద్కర్ రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు.

279
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles