కక్షిదారులు వీరే!

Sun,November 10, 2019 01:23 AM

న్యూఢిల్లీ, నవంబర్‌ 9: అయోధ్యలో బాబ్రీ మసీదు-రామ జన్మభూమి భూ వివాదం కేసుపై ఇంతకుముందు విచారణ జరిపిన అలహాబాద్‌ హైకోర్టు 2010 సెప్టెంబర్‌ 30న నిర్మోహి అఖాడా, రామ్‌లల్లా విరాజ్మాన్‌, సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌బోర్డులకు సమానంగా కేటాయిస్తూ అలహాబాద్‌ హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పలువురు వ్యక్తులు, సంస్థలు పిటిషన్లు దాఖలు చేశాయి. ఆయా పిటిషన్లపై 40 రోజులు వరుసగా ఛీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. అక్టోబర్‌ 16న తీర్పు రిజర్వు చేసి, శనివారం తీర్పు వెలువరించింది. పిటిషన్లు దాఖలు చేసిన కక్షిదారుల గురించి తెలుసుకుందాం..


రామ్‌లల్లా విరాజ్మాన్‌

భారత చట్ట పరిధిలో శ్రీరాముడికి ప్రతినిధిగా ‘రామ్‌లల్లా విరాజ్మాన్‌' తరఫున విశ్వహిందూపరిషత్‌ (వీహెచ్‌పీ) సీనియర్‌ సభ్యుడు ట్రికోలీనాథ్‌ పాండే పిటిషన్‌ దాఖలు చేశారు. 1989లో తొలిసారి ఈ కేసు దిగువ న్యాయస్థానం ముందుకు విచారణకు వచ్చింది. తదుపరి అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ అయింది. రామ్‌లల్లా విరాజ్మాన్‌ శాఖ తరఫున అలహాబాద్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, అప్పట్లో వీహెచ్‌పీ ఉపాధ్యక్షుడిగా పిటిషన్‌ దాఖలు చేసిన వారిలో ఒకరు.

నిర్మోహి అఖాడా

బాబ్రీ మసీదులో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత మసీదును మూసేసిన 10 ఏండ్లకు దానిపై తమకు హక్కులు ఉన్నాయని 1959లో దేశంలోని సాధువుల అధ్యాత్మిక వేదిక నిర్మోహి అఖాడా తొలిసారి పిటిషన్‌ దాఖలు చేసింది. వివాదాస్పద స్థలంలో ఏర్పాటు చేసిన దేవాలయంలో పూజలు చేశామని పేర్కొన్నది.

సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌బోర్డు

ఈ కేసులో ముస్లింల పక్షాల పిటిషన్‌ దాఖలు చేసిన ప్రాథమిక కక్షిదారు సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌బోర్డు. మసీదుపై తమకే యాజమాన్య హక్కులు చెందుతాయని పేర్కొంటూ 1961లో పిటిషన్‌ దాఖలు చేసింది.

మహ్మద్‌ ఇక్బాల్‌ అన్సారీ

పాత కక్షిదారుల్లో ఒకరైన మహ్మద్‌ హషిం అన్సారీ కొడుకు మహ్మద్‌ ఇక్బాల్‌ అన్సారీ. 2016లో మహ్మద్‌ హషీం అన్సారీ మృతి చెందిన తర్వాత తండ్రి స్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. బాబ్రీ మసీదు సమీపాన టైలర్‌గా పని చేస్తూ జీవనం సాగించిన హషీం అన్సారీ ఈ కేసు తొలి పిటిషనర్లలో ఒకరు.

ఎం సిద్ధిఖీ

ఉత్తరప్రదేశ్‌లోని జమాయిత్‌ ఉల్‌ ఉలేమా ఏ హింద్‌ ప్రధాన కార్యదర్శి. ఈ స్థలం తమదేనని తమ సంస్థ తరఫున సిద్ధిఖీ పిటిషన్‌ దాఖలు చేశారు.

షియా సెంట్రల్‌ వక్ఫ్‌బోర్డు

బాబ్రీ మసీదు సున్నీల ఆస్తి అంటూ 1946లోనే దిగువ న్యాయస్థానంలో సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌బోర్డు పిటిషన్‌ దాఖలు చేసింది. సున్నీ మతస్థుడిగా బాబర్‌ ఈ మసీదును నిర్మించలేదని, ఆయన సైన్యంలోని షియా సామాజిక వర్గానికి చెందిన కమాండర్‌ ఈ మసీదును నిర్మించారని వాదించింది. అలహాబాద్‌ హైకోర్టు ముందు పిటిషన్‌ దాఖలు చేసిన కక్షిదారుల్లో ఇది ఒకటి. అలహాబాద్‌ హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులోనూ పిటిషన్‌ దాఖలు చేసింది.

139
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles