చరిత్రాత్మక తీర్పరులు

Sun,November 10, 2019 02:16 AM

న్యూఢిల్లీ, నవంబర్‌ 9: దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు శనివారం తుది తీర్పును వెలువరించింది. ఈ తీర్పునిచ్చిన చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ ఏడాది జనవరి 8న ఏర్పాటయింది. ఆగస్టు నుంచి అక్టోబర్‌ వరకు 40 రోజులకుపైగా ఈ కేసును విచారించి చరిత్రాత్మక తీర్పునిచ్చిన ఈ ధర్మాసనంలోని ఐదుగురు సభ్యుల పూర్వాపరాలేమిటంటే..


చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌

అసోం రాష్ర్టానికి చెందిన జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ 1978లో బార్‌ కౌన్సిల్‌లో చేరారు. న్యాయవాదిగా గౌహతి హైకోర్టులో ప్రాక్టీస్‌ చేసిన ఆయన 2001 ఫిబ్రవరి 28న శాశ్వత న్యాయమూర్తిగా నియితులయ్యారు. ఆ తర్వాత పంజాబ్‌-హర్యానా హైకోర్టుకు బదిలీ అయి కొద్దికాలానికి ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ గొగోయ్‌.. 2012 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. గతేడాది అక్టోబర్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్‌ గొగోయ్‌.. ఆ పదవిని చేపట్టిన తొలి ఈశాన్య భారతీయుడిగా రికార్డులకెక్కారు. ప్రస్తుతం భారత 46వ ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్‌ గొగోయ్‌ ఈ నెల 17 పదవీ విరమణ చేయనున్నారు. జాతీయ పౌర రిజిస్టర్‌ (నేషనల్‌ సిటిజన్‌ రిజిస్టర్‌) కేసు సహా తన కెరీర్‌లో అనేక విశిష్ట కేసులను విచారించారు. గతేడాది జనవరిలో ఆయన సుప్రీంకోర్టులోని మరో ముగ్గురు న్యాయమూర్తులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించి కేసుల కేటాయింపులో అప్పటి సీజేఐ జస్టిస్‌ దీపక్‌మిశ్రా వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం పెను సంచలనం సృష్టించింది.

జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే

మహారాష్ట్రకు చెందిన జస్టిస్‌ శరద్‌ అర్వింద్‌ బోబ్డే (63) ఈ నెల 17న చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ స్థానంలో భారత సర్వోన్నత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 19 ఏండ్ల క్రితం అదనపు న్యాయమూర్తిగా బాంబే హైకోర్టులో చేరిన జస్టిస్‌ బోబ్డే.. ఆ తర్వాత రెండేండ్లకు మధ్యప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2013 ఏప్రిల్‌ 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. దేశంలో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్‌ బోబ్డే పదవీకాలం 18 నెలల్లో ముగియనున్నది. జస్టిస్‌ బోబ్డే తన కెరీర్‌లో విచారణ జరిపిన కీలక కేసుల్లో అయోధ్య కేసుతోపాటు ఆధార్‌ ఆర్డినెన్స్‌ కేసు, పౌరుల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన కేసు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూస్‌) రిజర్వేషన్‌ కేసు,ఆర్టికల్‌ 370 కేసు ముఖ్యమైనవి.

జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌

భారత సర్వోన్నత న్యాయమూర్తిగా అత్యంత సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వర్తించిన జస్టిస్‌ వైవీ చంద్రచూడ్‌కు స్వయానా కుమారుడైన జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ 2016 మే నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అంతకుముందు బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా, అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో లా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌.. దేశంలో కాలం చెల్లిపోయిన పలు తీర్పులను తోసిపుచ్చారు. ఈ తీర్పుల్లో కల్తీ చట్టం, వ్యక్తిగత గోప్యత చట్టం కింద జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తండ్రి వైవీ చంద్రచూడ్‌ ఇచ్చిన తీర్పులు కూడా ఉన్నాయి.

జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌

ఉత్తర్‌ప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌లో చేరి న్యాయవాదిగా 1979 ఏప్రిల్‌ 6న కెరీర్‌ ప్రారంభించిన జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ అలహాబాద్‌ హైకోర్టులో ప్రాక్టీస్‌చేసి 2001లో న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2014 జూలైలో కేరళ హైకోర్టుకు బదిలీన ఆయన.. కొద్దినెలల తర్వాత తాత్కాలిక ప్రధాన బాధ్యతలు చేపట్టడంతోపాటు 2015 మార్చిలో కేరళ హైకోర్టుకు 31వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ పలు కీలక కేసులను విచారించారు.

జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌

న్యాయవాదిగా 1983లో ప్రస్థానాన్ని మొదలుపెట్టి 20 ఏండ్లపాటు కర్ణాటక హైకోర్టులో ప్రాక్టీస్‌ చేసిన జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌.. 2003 ఫిబ్రవరిలో ఆ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, ఆ మరుసటి ఏడాది శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2017 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్‌ నజీర్‌.. గోప్యతను పౌరుల ప్రాథమిక్కుగా ప్రకటిస్తూ అదే ఏడాది తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో సభ్యునిగా ఉన్నారు.
TUSHAR
మహాత్మాగాంధీ హత్యకేసు ఈరోజు విచారణకు వచ్చి ఉంటే.. ‘నాథూరామ్‌గాడ్సే హంతకుడు.. అదేసమయంలో దేశభక్తుడు కూడా’ అని తీర్పు వచ్చేది. అంతా న్యాయం కాదు.. మొత్తం రాజకీయమే. అయోధ్య కేసులో తీర్పును చదివిన తర్వాత దయచేసి వెనక్కి వచ్చి మన దేశం ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలపై దృష్టిసారిద్దాం.
- తుషార్‌ గాంధీ

522
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles