అయోధ్య రాముడిదే

Sun,November 10, 2019 03:19 AM

-వివాదాస్పద స్థలం మందిర్‌కే..సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు
-మందిర నిర్మాణానికి మూడునెలల్లోగా కేంద్రం కార్యాచరణ పథకాన్ని రూపొందించాలి
-ట్రస్టును ఏర్పాటుచేసి ఆలయ నిర్మాణ బాధ్యత అప్పగించాలి
-కావాలనుకుంటే మొత్తం 68 ఎకరాల భూమినీ ట్రస్టుకు కేంద్రం అప్పగించవచ్చు
- అయోధ్యలోనే మసీదు నిర్మాణం
-సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఐదెకరాల భూమిని అందజేయాలి
-ఖాళీస్థలంలో బాబ్రీమసీదు నిర్మాణం జరుగలేదు
-దానికింద ఆలయం ఉందని ఏఎస్‌ఐ నిర్ధారించింది
-ఆ ప్రదేశం రాముడి జన్మస్థలమేనని హిందువుల నమ్మకం
-విశ్వాసాలు, ఆధారాల ప్రాతిపదికనే తీర్పునిస్తున్నాం
-సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు.. అలహాబాద్ హైకోర్టు తీర్పు కొట్టివేత
-బాబ్రీమసీదు కూల్చివేత ముమ్మాటికీ తప్పిదమేనని వ్యాఖ్య
-ఆ తప్పును సరిదిద్దే క్రమంలోనే మసీదు నిర్మాణానికి ఐదెకరాలని వెల్లడి

అది 135 ఏండ్లనాటి వివాదం.. సంస్థానాల ఏలికను చూసింది.. బ్రిటిషర్ల రాజ్యాన్ని చూసింది.. దేశ స్వాతం త్య్రానంతరం వివిధ పార్టీల ప్రభుత్వాల పాలనను చూ సింది.. 27 ఏండ్ల క్రితం అక్కడ జరిగిన ఘటన (బాబ్రీ మసీదు విధ్వంసం) దేశాన్ని నిట్టనిలువునా మతం ప్రాతి పదికగా చీల్చివేసింది. 19 ఏండ్ల క్రితం అలహాబాద్ హైకోర్టు ఈ వివాదాన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నించింది. కానీ, దానిపైనా అనేక వివాదాలు అలుముకున్నాయి. ఆధునిక భారతదేశ చరిత్రతో అవినాభావ సంబంధాన్ని ఏర్పర్చుకున్న అయోధ్య వివాదానికి దేశ అత్యున్నత న్యాయస్థానం ఎట్టకేలకు ఒక ముగింపునిచ్చింది. అయోధ్య పట్టణంలోని వివాదాస్పద స్థలం 2.77 ఎకరాలను కక్షిదారుల్లో ఒకరైన రామ్‌లల్లాకే (బాల రాముడి విగ్రహం) అప్పగించాలని, ఆ స్థలానికి శ్రీరాముడే యజమాని అని నిర్ణయించింది. ఆ స్థలంలో రామాలయ నిర్మాణం చేపట్టాలని, దీనికోసం మూడునెలల్లోగా ఒక ట్రస్టును ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అవసరం అనుకుంటే కేంద్రం తన ఆధీనంలోని మొత్తం 68 ఎకరాల భూమినీ ఈ ట్రస్టుకు అప్పగించవచ్చని పేర్కొంది. మరోవైపు, ముస్లింల కోసం మసీదు నిర్మాణం జరుగాలని, ఇందుకు అయోధ్య పట్టణంలోనే ఒక ప్రముఖ ప్రదేశంలో ఐదు ఎకరాల స్థలాన్ని కేంద్రంగానీ, యూపీ ప్రభుత్వంగానీ సున్నీ వక్ఫ్ బోర్డుకు అప్పగించాలని ఆదేశించింది. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు 1,045 పేజీల ఏకగ్రీవ తీర్పునిచ్చింది.
AyodhyaVerdict-UP1
హైదారాబాద్, నమస్తే తెలంగాణ: దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను కలిగించిన అయోధ్య కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. కోట్ల మంది హిందువుల మనోభావాలను గౌరవిస్తూ.. వివాదాస్పద స్థలాన్ని రామాలయ నిర్మాణానికి అప్పగించింది. ముస్లింలకు ఉపశమనం కలిగించేలా.. మసీదు నిర్మాణం కోసం అయోధ్య పట్టణంలో ఎక్కడైనా ప్రముఖ ప్రాంతంలో ఐదు ఎకరాల స్థలాన్ని కేంద్రప్రభుత్వంగానీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంగానీ కేటాయించాలని ఆదేశాలు జారీచేసింది. దశాబ్దాలుగా దేశాన్ని మతాలవారీగా విభజించిన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీమసీదు వివాదంలో.. ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. ఈ ధర్మాసనానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వం వహించారు. ధర్మాసనంలో జస్టిస్ ఏస్‌ఏ బోబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్ సభ్యులుగా ఉన్నారు.

40 రోజులపాటు వరుసగా విచారణ చేపట్టిన అనంతరం తీర్పును రిజర్వు చేసిన ధర్మాసనం.. శనివారం తీర్పును ప్రకటించింది. సుప్రీంకోర్టు చరిత్రలో ఇది రెండో సుదీర్ఘమైన కేసు. ఈ నెల 17న జస్టిస్ గొగోయ్ పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే అత్యంత కీలకమైన ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణను వేగంగా పూర్తి చేసి చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. సెలవు రోజైన శనివారం తీర్పును వెలువరించటం సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారని సమాచారం. ఈ తీర్పులోని ముఖ్యాంశాలు.. విశ్వాసాలు, నమ్మకాలపై ఆధారపడి ఈ తీర్పును ఇవ్వటం లేదు. నిర్ణయం తీసుకోవటంలో వాటిని కేవలం సంకేతంగా (indicator) మాత్రమే పరిగణిస్తున్నాం. సున్నీ ముస్లిం వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్‌లల్లా విరాజ్‌మాన్.. ఈ ముగ్గురు కక్షిదారుల మధ్య నెలకొన్న భూవివాదంగానే దీనిని పరిగణించాం. ఒక స్థిరాస్తి విషయంలో నెలకొన్న వివాదమే ఈ కేసు. దీనిపై సాక్ష్యాధారాల ఆధారంగానే నిర్ణయం తీసుకున్నాం.

పూర్వకాలం నుంచే హిందువుల పూజలు

ఔధ్ ప్రాంతాన్ని బ్రిటీషర్లు హస్తగతం చేసుకోవటానికి ముందు వరకూ అంటే 1857 వరకు కూడా.. (వివాదాస్పద స్థలం) వెలుపల ప్రాంతంలో హిందువులు పూజలు చేసేవారని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. 1856-57లోనే ఆ స్థలంలో ఇనుప కంచెను ఏర్పాటు చేయటం అన్నది అక్కడ హిందువులు పూజలు చేసేవారని తెలియజేస్తున్నది. సంభావ్యత (probabilities) ఆధారంగా ఈ ప్రతిపాదనకు వస్తున్నాం. రాముడు అక్కడ జన్మించాడన్న హిందువుల విశ్వాసం తిరుగులేనిది. దాంట్లో ఎలాంటి వివాదానికి తావులేదు. ముస్లింలు కూడా వివాదాస్పదస్థలం రామజన్మభూమి అనే అంటున్నారు. అక్కడున్న సీతా రసోయి, రామ్ చబుత్రా, భండార్‌గృహం వంటివి కూడా ఈ మతవిశ్వాసాలకు ఆధారంగా నిలుస్తున్నాయి. తద్వారా ఆ స్థలం యజమాని శ్రీరాముడేనని ప్రతీకాత్మకంగా (symbolically) పేర్కొనవచ్చు. అంతేకాదు.. ప్రాచీనకాలపు యాత్రికుల కథనాలు కూడా ఈ విషయంలో కీలకమైన ఆధారాలను అందజేస్తున్నాయి. 1743-1785 మధ్య భారతదేశాన్ని సందర్శించిన విలియం ఫిం చ్, టీఫెన్ థాలెర్.. అయోధ్యలో సీతా రసోయి, స్వర్గ్‌ద్వార్ తదితర ప్రాంతాలలో రాముడిని హిందువులు కొలుస్తున్నారని, పూజలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాముడు పుట్టిన ప్రాంతంగా భావిస్తున్న ప్రదేశంలో భక్తులు ఒక ఊయలను ఏర్పాటుచేసి దానిలో బాల రాముడి విగ్రహాన్ని ఉంచి పూజలు జరిపారన్న విషయాన్ని టీఫెన్ థాలెర్ స్పష్టంగా తెలియజేశాడు.
AyodhyaVerdict-UP3

సాక్ష్యాధారాలను సమర్పించటంలో వక్ఫ్‌బోర్డు విఫలం

1857కు ముందు మసీదు పూర్తిగా తమ ఆధీనంలోనే ఉన్నదన్నదానిపై ముస్లింలు కోర్టుకు ఎటువంటి సాక్ష్యాధారాలను సమర్పించలేకపోయారు. 1528లో బాబర్ హయాంలో మసీదును నిర్మించినప్పటికీ అప్పటి నుంచీ 325 ఏండ్లకుపైగా అంటే 1856-57 వరకూ ముస్లింల ఆధీనంలో ఆ మసీదు ఉందనిగానీ, అక్కడ ప్రార్థనలు జరిపారనిగానీ ఆధారాలు లేవు. బ్రిటీషర్లు అక్కడ ఒక కంచెను ఏర్పాటు చేసిన తర్వాతనే ముస్లింలు తమ హక్కుకు సంబంధించిన ఆధారాలను సమకూర్చుకున్నారు. అంతేకాదు వివాదాస్పద స్థలం వెలుపలి ప్రాంతం వారి ఆధీనంలో లేదు. తమ వాదనలను సమర్థించుకోవటంలో ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు విఫలమైంది. అయితే, అక్కడి మసీదులో ముస్లింలు శుక్రవారం ప్రార్థనలను చేసేవారని, అది నిరవధికంగా జరుగకపోయినప్పటికీ.. మసీదును వారు వదిలివేయలేదని ఆధారాలను బట్టి తెలుస్తున్నది.

పురావస్తు ఆధారాలు కీలకం

కూల్చివేతకు గురైన నిర్మాణం (బాబ్రీమసీదు) కింద ఒక ఆలయం ఉండేదని, అది 12వ శతాబ్దానికి చెందినదని భారత పురావస్తు సంస్థ (ఏఎస్‌ఐ) నిర్ధారించింది. ఆలయ శిథిలాలు మసీదు నిర్మాణానికి పునాదిగా ఉపయోగపడ్డాయి. మొత్తానికి బాబ్రీమసీదు కింద ఉన్నది ఇస్లామిక్ నిర్మాణం మాత్రం కాదు. దీనిద్వారా స్పష్టమవుతున్నదేమిటంటే, బాబ్రీమసీదును ఖాళీ స్థలంలో నిర్మించలేదు. ఏఎస్‌ఐ చూపించిన ఆధారాలను కేవలం ఆ సంస్థ అభిప్రాయాలుగా కొట్టివేయలేము. అలా చేస్తే ఏఎస్‌ఐని తీవ్రంగా అగౌరపరిచినట్టవుతుంది. అయితే, మసీదు నిర్మాణం కోసం అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ధ్వంసం చేశారా అన్నదానిని మాత్రం ఏఎస్‌ఐ నిర్ధారించలేదు. కోర్టు తీర్పు మేరకు వివాదాస్పద 2.77 ఎకరాల స్థలం ఇకపై కేంద్రప్రభుత్వం నియమించే ఒక చట్టబద్ధమైన స్వీకర్త స్వాధీనం లో ఉంటుంది. మూడు నెలల వ్యవధిలో కేంద్రప్రభుత్వం ఆలయ నిర్మాణానికి అవసరమైన కార్యాచరణ పథకాన్ని అయోధ్యలో నిర్దిష్ట ప్రాం తాల స్వాధీనం చట్టం, 1993 ప్రకారం రూపొందించాలి. ఒక ట్రస్టును ఏర్పాటు చేసి ఈ స్థలాన్ని సదరు ట్రస్టుకు అప్పగించాలి. ఆ స్థలంలో ఆలయాన్ని నిర్మించే బాధ్యత ఈ ట్రస్టుదే. ఈ ట్రస్టు లో ఉండే సభ్యులు, వారి అధికారాలు, బాధ్యతలకు సంబంధించిన స్పష్టతను కార్యాచరణ పథకంలో కేంద్రప్రభుత్వం ఇవ్వాలి. ఈ ట్రస్టుకు వివాదాస్పద 2.77 ఎకరాల స్థలంతోపాటు మొత్తం 68 ఎకరాల భూమిని ఇచ్చే విషయంలో కేంద్రప్రభుత్వానికి పూర్తి స్వతంత్రం ఉంది (ఈ 68 ఎకరాల భూమిని కేంద్రప్రభుత్వం 1993లో స్వాధీనపర్చుకుంది). ఈ మేరకు సంబంధిత నిబంధనల్లో కూడా ప్రభుత్వం మార్పులు, చేర్పులు చేయవచ్చు. ట్రస్టుకు భూమిని అప్పగించేంత వరకూ, ఈ మేరకు ఒక నోటిఫికేషన్ వెలువడేంతవరకూ వివాదాస్పద భూమి చట్టబద్ధమైన స్వీకర్త వద్ద ఉంటుంది.

ఆ తీర్పు సరైనది కాదు

వివాదాస్పద స్థలాన్ని ముగ్గురు కక్షిదారుల మధ్య సమానంగా మూడు భాగాలుగా పంచాలంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనది కాదు. సదరు వివాదాస్పద స్థలం ప్రభుత్వస్థలం. రెవెన్యూ రికార్డులు ఈ మేరకు స్పష్టం చేస్తున్నాయి అని సుప్రీంకోర్టు పేర్కొంది. మొత్తం వివాదాస్పద ప్రాంతం తమ నియంత్రణలో ఉండాలన్న నిర్మోహి అఖాడా వాదనను కోర్టు కొట్టివేసింది. అయితే, ఆలయ నిర్మాణం కోసం ఏర్పాటు చేసే ట్రస్టులో అఖాడాకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని, అయితే, దీనిపై నిర్ణయాధికారం కేంద్రప్రభుత్వానిదేనని తెలిపింది.

14 అప్పీళ్లపై విచారణ

2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన 14 అప్పీళ్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్‌లల్లా మధ్య సమానంగా మూడు భాగాలుగా పంచాలని అలహాబాద్ హైకోర్టు నాడు తీర్పునిచ్చింది.

మధ్యవర్తిత్వ ఒప్పందం తప్పనిసరేమీ కాదు

అయోధ్య వివాదం పరిష్కారం కోసం తాము ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కమిటీ ఇచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు ప్రస్తావించింది. మధ్యవర్తిత్వ కమిటీ ఇచ్చిన నివేదికను భాగస్వామ్య పక్షాలన్నీ కలిసికట్టుగా అంగీకరించలేదని, దానిపై అందరూ సంతకాలు కూడా చేయలేదనీ, ఆ ఒప్పందం తప్పనిసరేమీ కాదని పేర్కొంది.

కూల్చివేత ముమ్మాటికీ తప్పే

AyodhyaVerdict-UP4
16వ శతాబ్దంనాటి బాబ్రీమసీదును ఆలయ నిర్మాణం కోసం హిందూ కరసేవకులు కూల్చివేయటం ముమ్మాటికీ తప్పే. జరిగిన తప్పును తప్పకుండా సరిదిద్ది, నష్టనివారణ చర్యలు చేపట్టాల్సిందే. రాజ్యాంగం దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. చట్టబద్ధపాలనకు కట్టుబడి ఉన్న ఒక లౌకికదేశంలో జరుగరాని విధంగా జరిగిన చర్య ద్వారా ముస్లింలు తమ మసీదును కోల్పోయారు. వారి హక్కును న్యాయస్థానం పట్టించుకోకపోతే న్యాయానికి నిలువనీడ లేనట్టవుతుంది. ఈ తప్పును సరిదిద్దటానికి అయోధ్య పట్టణంలోనే ఒక ముఖ్యమైన ప్రాంతంలో ఐదు ఎకరాల స్థలాన్ని మసీదు నిర్మాణం కోసం యూపీ సున్నీ వక్ఫ్‌బోర్డుకు కేంద్రప్రభుత్వంగానీ, యూపీ ప్రభుత్వంగానీ అందజేయాలి.

116 పేజీల అనుబంధ తీర్పు

ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్న ఒక న్యాయమూర్తి విడిగా 116 పేజీల తీర్పును ఇచ్చారు. ఇది 929 పేజీల ఏకగ్రీవ తీర్పుతో కలిసి అదనంగా ఉంది. ఈ తీర్పునిచ్చిన న్యాయమూర్తి పేరు వెల్లడి కాలేదు. కానీ, దాంట్లోని వివరాలు బయటకు వచ్చాయి. పురాణాలు, ప్రభుత్వ రికార్డులు, శిల్పాలు, మతగ్రంథాలు తదితర అనేక ఆధారాల వల్ల అయోధ్యలోని వివాదాస్పద స్థలం రాముడి జన్మస్థలమేనని రుజువవుతుందని పేర్కొన్నారు. దీనికి ఆధారంగా వాల్మీకి రామాయణం, స్కంధ పురాణం తదితర గ్రంథాలను ఉదహరించారు. అంతేకాదు, 1510-11లో ఈ ప్రదేశాన్ని సిక్కుల గురువు గురునానక్ సందర్శించారని, ఈ మేరకు ఆధారాలున్నాయన్నారు.

45 నిమిషాల్లో తీర్పు

శనివారం ఉదయం 10.30కు తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ చదివి వినిపించటం ప్రారంభించారు. 45 నిమిషాల్లో తీర్పును ముగించారు.

విగ్రహాలు పెట్టిన తర్వాతే వివాదమైంది

1949లో బాబ్రీమసీదు లోపల రాముడి విగ్రహాలను పెట్టిన తర్వాతనే ఈ అంశం న్యాయపరంగా వివాదంగా మారిందని సుప్రీంకోర్టు పేర్కొంది. నాడు జరిగిన ఘటనలను తీర్పులో ప్రస్తావించింది. మతపరమైన ఉద్రిక్తతల అనంతరం 12 నవంబరు 1949 నాడు బాబ్రీమసీదు వద్ద పోలీసు పికెట్‌ను ఏర్పాటు చేశారు. హిందువులు బాబ్రీమసీదులోకి ప్రవేశించి అక్కడ దేవుడి విగ్రహాలను పెట్టనున్నారనే సమాచారం తమకు లభించిందని జిల్లా ఎస్పీ కలెక్టర్‌కు లేఖ రాశారు. దీనిని కలెక్టర్ సీరియస్‌గా తీసుకోలేదు. డిసెంబర్ 22-23 మధ్య రాత్రి కొందరు హిందువులు మసీదుకున్న తాళం పగులగొట్టి.. మధ్య గుమ్మటం కింద విగ్రహాలను పెట్టారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. విగ్రహాలను అక్కడి నుంచి తీసేయాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించినప్పటికీ.. కలెక్టర్ ఆ పని చేయలేదు. ఈ నేపథ్యంలో వివాదాస్పద స్థలాన్ని యూపీ ప్రభుత్వం జప్తు చేసింది. అనంతరం ఈ అంశంపై న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు కావటం ప్రారంభమైంది అని సుప్రీంకోర్టు గుర్తు చేసింది.

ఆర్టికల్ 142 ఏం చెప్తున్నది?

న్యూఢిల్లీ: చారిత్రక అయోధ్య కేసులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం శనివారం ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని.. మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయంగా సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదెకరాల స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. అయితే ఈ చారిత్రక తీర్పును వెల్లడించే తరుణంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రాజ్యాంగంలోని 142 ఆర్టికల్‌ను ఆవాహన చేసుకొన్నట్టుగా కనిపించింది. ఈ ఆర్టికల్ ప్రకారమే నిర్మోహీ ఆఖాడాలకు వారసత్వ హక్కులు క్లెయిం చేసే అధికారం లేదని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు.. చాలా కాలంగా ఉద్యమిస్తున్న వీరికి కేంద్రం ఏర్పాటుచేయనున్న ట్రస్ట్‌లో ప్రాతినిధ్యం కల్పించాలని ఆదేశించింది. ఇంతకీ ఆర్టికల్ 142 ఏం చెప్తున్నది? పెండింగులో ఉన్న ఏదైనా కేసులో పూర్తి న్యాయం చేసేందుకు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 142ను వినియోగించి సదరు కేసుకు సంబంధించిన ఉత్తర్వులను జారీచేసే అధికారం సుప్రీంకోర్టు కలిగి ఉంటుంది. ఈ ఉత్తర్వులను భారత భూభాగంలోని అన్ని ప్రాంతాల్లో అమలు చేయాలి. బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో నిందితులుగా ఉన్న అద్వానీ, మురళీమనోహర్‌జోషి, ఉమాభారతి కేసులో ఆర్టికల్ 142 ప్రకారం తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించిన సుప్రీంకోర్టు.. విచారణను రాయ్‌బరేలి నుంచి లక్నో కోర్టుకు మార్చాలని సంచలన నిర్ణయం తీసుకొన్నది.

కీలక పరిణామాలు ఇవే..

-1528: మొఘల్ చక్రవర్తి బాబర్ సైన్యాధిపతి మీరు బాకీ బాబ్రీ మసీదును నిర్మించారు
-1885: వివాదాస్పద నిర్మాణం వెలుపల పందిరిని నిర్మించేందుకు అనుమతినివ్వాలని ఫైజాబాద్ జిల్లా న్యాయస్థానాన్ని కోరిన మహంత్ రఘుబీర్‌దాస్. అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయస్థానం
-1949: వివాదాస్పద నిర్మాణం బయట ఉన్న మధ్య గుమ్మటంలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన
-1950: విగ్రహాలను ఆరాధించేందుకు అనుమతివ్వాల్సిందిగా ఫైజాబాద్ జిల్లా కోర్టులో పిటిషన్‌లు వేసిన గోపాల్ సిమ్లా విశారద్, పరమహంస రామచంద్ర దాస్
-1959: స్థలాన్ని తమ స్వాధీనంలోకి తీసుకోవడానికి అనుమతివ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన నిర్మోహి అఖాడా
-1961: స్థలాన్ని తమ స్వాధీనంలోకి తీసుకోవడానికి అనుమతివ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు
-ఫిబ్రవరి 1, 1986: హిందువులు ఆరాధించుకునేందుకు వీలుగా వివాదాస్పద ప్రాంతా న్ని తెరువాలని ఆదేశించిన స్థానిక కోర్టు
-ఆగస్టు 14, 1989: వివాదాస్పద నిర్మాణంలో యథాతథ స్థితిని కొనసాగించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశం
-డిసెంబర్ 6, 1992: బాబ్రీ మసీదు కూల్చివేత
-ఏప్రిల్ 3, 1993: వివాదాస్పద స్థలం కేంద్రం ఆధీనంలోకి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన అయోధ్య యాక్ట్ అమలు, దీన్ని సవాలు చేస్తూ న్యాయస్థానాల్లో ఇస్మాయిల్ ఫారూఖ్ తదితర ప్రముఖుల పిటిషన్ల దాఖలు
-అక్టోబర్ 24, 1994: ఇస్లాం మతంలో మసీదు అంతర్భాగం కాదంటూ ఇస్మాయిల్ ఫారూఖ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు
-ఏప్రిల్, 2002: వివాదాస్పద ప్రాంతం ఎవరికి చెందిందో నిర్ధారించేందుకు అలహాబాద్ హైకోర్టులో విచారణ ప్రారంభం
-మార్చి 13, 2003: వివాదాస్పద స్థలంలో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు జరుగొద్దని అస్లాం కేసు విచారణ సందర్భంగా స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
-సెప్టెంబర్ 30, 2010: వివాదాస్పద ప్రాంతాన్ని మూడు భాగాలుగా విభజించి సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రావ్‌ు లల్లాకు సమానంగా పంచాలని 2:1 మెజారిటీతో అలహాబాద్ హైకోర్టు తీర్పు
-మే 9, 2011: హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు
-మార్చి 21, 2017: అయోధ్య అంశాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవాలని కక్షిదారులకు సలహానిచ్చిన సీజేఐ జేఎస్ ఖేహర్
-ఆగస్టు 7, 2017: 1994లో కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఏర్పాటు
-ఫిబ్రవరి 8, 2018: సివిల్ అప్పీల్స్‌పై విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు
-జూలై 20, 2018: తీర్పు రిజర్వు
-సెప్టెంబర్ 27, 2018: ఐదుగురు సభ్యులున్న బెంచ్‌కు కేసును బదిలీచేయాలన్న అభ్యర్థనను నిరాకరించిన సుప్రీంకోర్టు. కొత్తగా ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం అక్టోబర్ 29న కేసును విచారిస్తుందని వ్యాఖ్య
-అక్టోబర్ 29, 2018: విచారణ కోసం తగిన ధర్మాసనం ముందుకు జనవరి మొదటి వారంలో కేసును బదిలీ చేస్తామని సుప్రీంకోర్టు వ్యాఖ్య
-డిసెంబర్ 24, 2018: జనవరి 4, 2019న విచారించేందుకు అయోధ్యకు సంబంధించిన పిటిషన్ల స్వీకరణ
-జనవరి 4, 2019: కేసు విచారణకు తగిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టీకరణ. కేసు విచారణ ప్రారంభమయ్యే తేదీని జనవరి 10న ప్రకటిస్తామని వెల్లడి
-జనవరి 8: కేసు విచారణకు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, జస్టిస్‌లు ఎస్‌ఏ బొబ్డే, ఎన్ వీ రమణ, యూ యూ లలిత్, డీ వై చంద్రచూద్ ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు
-జనవరి 10: బెంచ్‌లో కొనసాగేందుకు జస్టిస్ యూ యూ లలిత్ నిరాకరణ
-జనవరి 25: ఐదుగురు సభ్యులతో కూడిన కొత్త రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు - ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌ఏ బొబ్డే, జస్టిస్ డీ వై చంద్రచూద్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ ఏ నజీర్ ఇందులో ఉన్నారు.
-జనవరి 29: వివాదాస్పద స్థలం చుట్టూ ఉన్న 67 ఎకరాల భూ యజమానుల్ని గుర్తించాలని సుప్రీంకోర్టుని కోరిన కేంద్రం
-ఫిబ్రవరి 26: మధ్యవర్తిత్వానికి సుముఖం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం
-మార్చి 8: సుప్రీంకోర్టు మాజీ జడ్జి నేత్వత్వంలో ముగ్గురు సభ్యులతో మధ్యవర్తిత్వ కమిటీ ఏర్పాటు
-మే 9: మధ్యంతర రిపోర్టును సుప్రీంకోర్టుకు సమర్పించిన మధ్యవర్తిత్వ కమిటీ
-ఆగస్టు 2: మధ్యవర్తిత్వ కమిటీతో ప్రయోజనం లేకపోవడంతో అయోధ్య వివాదంపై రోజువారీ విచారణను ప్రారంభించిన అత్యున్నత ధర్మాసనం
-అక్టోబర్ 4: నవంబర్17 లోపున తుది తీర్పు వెల్లడిస్తామని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టీకరణ
-అక్టోబర్ 16: వాదనలు ముగించిన అత్యున్నత న్యాయస్థానం.. తీర్పు రిజర్వు
-నవంబర్ 9: అయోధ్య భూవివాదం కేసులో తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు

భారత ప్రజాస్వామ్యం సజీవం

modi111
భారత ప్రజాస్వామ్యం సజీవం, శక్తిమంతమైందని అయోధ్య తీర్పు రుజువు చేసింది. అయోధ్య తీర్పును దేశంలోని అన్ని వర్గాలు స్వాగతించాయి. ఇది పురాతన భారత సంప్రదాయమైన మైత్రి, అన్యోన్యతలను ప్రతిబింబించింది. సరిగ్గా 30 ఏండ్ల క్రితం నవంబర్ తొమ్మిదో తేదీన బెర్లిన్ గోడ కూల్చివేతతో జర్మనీ ఏకమైంది. ఇదే రోజు కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభమైంది. అయోధ్యపై తీర్పు వెలువడిందీ ఇదే రోజు. కలిసి ముందడుగు వేయాలని నవంబర్ 9 మనకు గుణపాఠం నేర్పింది.
- ప్రధాని నరేంద్రమోదీ

తీర్పు మాకు సంతృప్తి కరంగా లేదు..

jilani111
సుప్రీం తీర్పు మాకు సంతృప్తినివ్వలేదు. వివాదాస్పద స్థలంతోపాటు, ప్రాంగణాన్ని కూడా హిందువులకే అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నాం. తీర్పులో అనేక పరస్పర విరుద్ధ వాదనలు ఉన్నాయి. తీర్పుపై రివ్యూ పిటిషన్
దాఖలు చేయాలని భావిస్తున్నాం.
- ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు లాయర్ జఫర్యాబ్ జిలానీ

న్యాయంపై మతవిశ్వాసం గెలుపు!

owaisi111
సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు మాకు ఆమోదయోగ్యంగా లేదు. ఇది న్యాయంపై మతవిశ్వాసం సాధించిన విజయం. దానమిచ్చినట్లు పడేసే ఐదెకరాల భూమిని తిరస్కరించాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ముస్లిం పర్సనల్ లా బోర్డును సంప్రదించాకే సమీక్షా పిటిషన్ వేయాలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకుంటాం.
- మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ
AyodhyaVerdict-UP5

2294
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles