రివ్యూకు వెళ్తాం

Sun,November 10, 2019 02:22 AM

- ప్రకటించిన ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు
- సుప్రీంకోర్టు తీర్పుతో సంతృప్తిగా లేము
- కొన్ని అంశాలలో విభేదిస్తున్నాం: బోర్డు కార్యదర్శి
- సవాల్‌ చేసే ఉద్దేశం లేదు: సున్నీ వక్ఫ్‌ బోర్డు

న్యూఢిల్లీ, నవంబర్‌ 9: అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని రామ మందిరానికి కేటాయిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తాము సంతృప్తిగా లేమని ముస్లిం కక్షిదారులైన సున్నీ వక్ఫ్‌బోర్డు, ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) ప్రకటించాయి. తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని ఆలోచిస్తున్నట్టు ఏఐఎంపీఎల్‌బీ తెలిపింది. ఏఐఎంపీఎల్‌బీ కార్యదర్శి, ముస్లిం కక్షిదారుల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన జఫర్యాబ్‌ జిలానీ శనివారం మీడియాతో మాట్లాడారు. తాము సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని, అయితే తీర్పు తమను అసంతృప్తికి గురిచేసిందన్నారు. తాము మొత్తం తీర్పును వ్యతిరేకించడం లేదని, కొన్ని అంశాలతో మాత్రం విభేదిస్తున్నామని తెలిపారు. వివాదాస్పద స్థలంతోపాటు, ప్రాంగణాన్ని కూడా హిందువులకే అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. తీర్పులో అనేక పరస్పర విరుద్ధ వాదనలు ఉన్నాయన్నారు. తీర్పు ప్రతిని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత రివ్యూకు వెళ్లే అవకాశం ఉన్నదని చెప్పారు. త్వరలో ఏఐఎంపీఎల్‌బీ వర్కింగ్‌ కమిటీ సమావేశమై తీర్పు గురించి క్షుణ్ణంగా చర్చిస్తుందని తెలిపారు. అనంతరం న్యాయపరంగా తీసుకోవాల్సిన అన్ని మార్గాలను అన్వేషిస్తామన్నారు.

ఏదిఏమైనా తీర్పులోని కొన్ని అంశాలు దేశ లౌకిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయన్నారు. ఆర్టికల్‌ 142 ప్రకారం తన ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకొని కోర్టు తీర్పును ప్రకటించిందని చెప్పారు. ముస్లిం కక్షిదారుల న్యాయ బృందంలో ఒకరైన లాయర్‌ ఎంఆర్‌ శంషాద్‌ స్పందిస్తూ ఈ కేసులో తుది వరకు పోరాడాల్సిన అవసరం ఉన్నదన్నారు. ‘1992లో బాబ్రీ మసీదును కూల్చివేయడం ద్వారా ఆటవిక న్యాయానికి నాంది పలికారు. ఇకపై దేశంలోని ఏ మసీదును కూడా ముట్టుకునే సాహసం చేయని స్థాయిలో సుప్రీంకోర్టు తీర్పు ఉంటుందని ఆశించాం’ అని పేర్కొన్నారు. చారిత్రాత్మక ఆధారాలు తమకే అనుకూలంగా ఉన్నా, తీర్పు వ్యతిరేకంగా రావడంతో బోర్డు అసంతృప్తి చెందిందని న్యాయవాది షకీల్‌ అహ్మద్‌ సయీద్‌ తెలిపారు. విశ్వాసాలను బట్టి కాకుండా ఆధారాలను బట్టి తీర్పు ఇస్తుందని ఆశించామన్నారు.

తీర్పును స్వాగతిస్తున్నాం: వక్ఫ్‌బోర్డు

సుప్రీంకోర్టు తీర్పును సవాల్‌ చేసే ఉద్దేశం లేదని ప్రధాన కక్షిదారుల్లో ఒకరైన సున్నీ వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ జాఫర్‌ అహ్మద్‌ ఫరూఖీ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఒకవేళ ఏ న్యాయవాది అయినా, ఇతర వ్యక్తి అయినా ఈ తీర్పు సరికాదని, బోర్డు రివ్యూ పిటిషన్‌ వేయాలని సూచించినా తాము పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. అయితే బోర్డు తరఫు న్యాయవాది జఫర్యాబ్‌ జిలానీ, చైర్మన్‌ ఫరూఖీ పరస్పర విరుద్ధ వాదనలు చేయడంతో కాస్త గందరగోళం నెలకొన్నది. న్యాయవాది జిలానీ దీనిపై వివరణ ఇచ్చారు. సుప్రీంకోర్టు వద్ద తాను మీడియాతో మాట్లాడినప్పుడు ఏఐఎంపీఎల్‌బీ కార్యదర్శిగా మాత్రమే స్పందించానని, సున్నీ వక్ఫ్‌బోర్డుకు సంబంధం లేదని తెలిపారు.
JAMIAT

మేము ఊహించినట్టు రాలేదు


- సుప్రీంకోర్టు తీర్పును శిరసావహించాల్సిందే
- జమాత్‌ ఉలేమా ఏ హింద్‌

సుప్రీంకోర్టు తీర్పు తాము ఊహించినట్టుగా లేదని ప్రముఖ ఇస్లామిక్‌ సంస్థ జమాత్‌ ఉలేమా ఏ హింద్‌ పేర్కొన్నది. అయితే సుప్రీంకోర్టు తీర్పును శిరసావహించాల్సిందేనన్నది. ఈ తీర్పుతో ముస్లింలు నిరాశచెందొద్దని సంస్థ అధ్యక్షుడు మౌలానా అర్షద్‌ మదాని కోరారు. ముస్లింలు ఈ తీర్పును గెలుపుగానో, ఓటమిగానో స్వీకరించవద్దని, దేశంలో శాంతి, సామరస్యాలను కాపాడాలని పిలుపునిచ్చారు. అల్లాపై విశ్వాసం ఉంచి ముందడుగు వేయాలని కోరారు. వివాదాస్పద స్థలంపై న్యాయం కోసం జమాత్‌ తరఫున చివరివరకూ పోరాడామన్నారు. తీర్పుపై రివ్యూకు వెళ్లే ఆలోచనే లేదని సంస్థ వర్గాలు తెలిపారు.
JILANI2

ఇంతటితో వివాదాన్ని ముగిద్దాం


- ఇంకా కొనసాగించడం సరికాదు
- ఢిల్లీ జామా మసీదు ప్రధాన ఇమామ్‌ పిలుపు

రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ను అందరూ ఆహ్వానించాలని ఢిల్లీలోని జామా మసీదు ప్రధాన ఇమామ్‌ సయీద్‌ అహ్మద్‌ బుఖారీ పిలుపునిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శతాబ్దానికి పైగా కొనసాగుతున్న ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలుకాలని కోరారు. ఇంకా కొనసాగించడం సరికాదని సూచించారు. దేశంలోని ముస్లింలంతా శాంతి కోరుకుంటున్నారని చెప్పారు. తీర్పు ఎవరికి అనుకూలంగా ఉన్నా స్వాగతిస్తామని ఇప్పటికే వారు ప్రకటించారని గుర్తుచేశారు.

2519
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles