భద్రత కట్టుదిట్టం

Sun,November 10, 2019 02:40 AM

-అయోధ్య తీర్పు నేపథ్యంలో పలు రాష్ర్టాల్లో పోలీసుల పహారా
-పరిస్థితిని సమీక్షించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
-పలు రాష్ర్టాల సీఎంలతో ఫోన్ సంభాషణ
-దేశవ్యాప్తంగా ప్రశాంత వాతావరణం

న్యూఢిల్లీ, నవంబర్ 9: అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరిగాయి. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ తదితర రాష్ర్టాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా పోలీసులను మోహరించారు. దేశవ్యాప్తంగా భద్రతను కేంద్ర హోంశాఖ సమీక్షించింది. ఆ శాఖ ఉన్నతాధికారులు నిత్యం రాష్ర్టాలతో సంప్రదింపులు జరుపుతూ పలు సూచనలు చేశారు. అలాగే పారామిలిటరీ బలగాలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతోనూ మాట్లాడారు. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీలోని తన నివాసంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోంశాఖ కార్యదర్శి అజిత్ భల్లా, ఇంటెలిజెన్స్ బ్యూర్ డైరెక్టర్ అరవింద్‌కుమార్‌తో సమావేశమై భద్రతను సమీక్షించారు.

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ తదితర రాష్ర్టాల సీఎంలతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. శాంతి భద్రతలను కాపాడటానికి ఎలాంటి సహకారం కావాలన్నా అందజేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వాటిపై పోలీసులు నిఘా ఉంచారు. శనివారం చాలా రాష్ర్టాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఓ అధికారి మాట్లాడుతూ అన్ని కేంద్ర బలగాలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సమన్వయం చేసుకుంటూ అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూస్తున్నాయి. ఈ ప్రక్రియ మరికొన్ని రోజుల వరకు కొనసాగనున్నది అని పేర్కొన్నారు. శాంతిభద్రతలను కాపాడటంలో రాష్ట్ర పోలీసులు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారని, సీసీటీవీ, డ్రోన్లు తదితర వాటిని కూడా నిఘా కోసం ఉపయోగిస్తున్నారని వివరించారు.

అయోధ్యలో సాధారణ పరిస్థితులు

ఉత్తరప్రదేశ్ డీజీపీ ఓపీ సింగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉన్నది. ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగలేదు. విధుల్లో ఉన్న పోలీసు ఉన్నతాధికారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నాం అని తెలిపారు. యూపీ అడిషనల్ డీజీపీ (శాంతిభద్రతలు) పీవీ రామశాస్త్రి స్పందిస్తూ గత 10 రోజులుగా సోషల్ మీడియా (ట్విట్టర్, ఫేస్‌బుక్ తదితరాలు)లో వదంతులకు సంబంధించి 80 కేసులు నమోదు చేశామని చెప్పారు. అయోధ్యలో సాధారణ పరిస్థితి ఉన్నదని, ప్రజలు తమ రోజువారీ కార్యక్రమాలను యధావిథిగా కొనసాగించారని తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరించింది. సోషల్ మీడియాపైనా ఓ కన్ను వేసి ఉంచామని, ఎవరైనా వదంతులు వ్యాప్తి చేయాలని చూస్తే ఊరుకునేది లేదని తెలిపింది. అలాగే రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.
CRPF-Lucknow
వదంతులను వ్యాప్తి చేసినందుకు నోయిడాలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే రాజస్థాన్‌లోని బికనీర్‌లోనూ ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. జమ్ముకశ్మీర్‌లో ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అయోధ్య తీర్పు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఆదేశించింది. గుజరాత్‌లోనూ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే వదంతులను వ్యాప్తి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరించింది. కాగా, శనివారం యూపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ తదితర రాష్ర్టాల్లో విద్యాసంస్థలు తెరుచుకోలేదు. ఇంకోవైపు ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో శనివారం మధ్యహ్నం 12 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను అధికారులు రద్దు చేశారు. మతపరమైన ఊరేగింపు కార్యక్రమాలపై నిషేధం విధించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారీగా పోలీసులను మోహరించారు.

737
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles