గురి చూసి దాడి!

Wed,October 23, 2019 02:28 AM

-పక్కా సమాచారం, ఉపగ్రహ నిఘా సాయంతోనే
-టెర్రర్ లాంచ్‌ప్యాడ్లపై ఆర్మీ దాడులు

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్‌లోయలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు సాగిస్తున్న చొరబాటు యత్నాలను నిరోధించేందుకు భారత సైన్యం ఆదివారం పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్ర స్థావరాలపై జరిపిన దాడులు అత్యంత కీలకమైనవి. శీతాకాల సమయంలో సీమాంతర ఉగ్రవాద సంస్థలు సాధ్యమైనంత ఎక్కువ మంది ఉగ్రవాదులను భారత్‌లోకి పంపేందుకు కుట్ర పన్నే అవకాశమున్న నేపథ్యంలో చొరబాట్లను ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకోవాలని నిఘా సంస్థల నుంచి స్పష్టమైన ఆదేశాలు అందినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పీవోకేలోని నీలమ్ వ్యాలీలో ఉన్న మూడు ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని, మరో శిబిరానికి గణనీయ నష్టం కలిగించామని భారత సైన్యాధిపతి బిపిన్ రావత్ ఆదివారం వెల్లడించిన విషయం తెలిసిందే. నియంత్రణ రేఖకు సమీపంలోని ఈ లాంచ్ ప్యాడ్‌లలో గత నెల కాలంలో నూతనంగా నియమించుకున్న క్యాడర్‌ను ఉగ్ర సంస్థలు మోహరించినట్లు సమాచారం. జైషే మహమ్మద్, లష్కరేతాయిబా, అల్ బదర్ ఉగ్రవాద సంస్థలకు చెందిన ఈ శిబిరాల్లో ఉగ్రవాదుల ఉనికి గురించి ఈ నెల మొదటివారంలో నిఘా సంస్థలు సమాచారం అందించాయని సైనిక వర్గాలు తెలిపాయి. ఈ టెర్రర్ లాంచ్ ప్యాడ్లకు సంబంధించిన జీపీఎస్ లొకేషన్‌ను గుర్తించి, వాటిని ఢిల్లీ, శ్రీనగర్‌లోని ఆర్మీ యూనిట్లకు పంపించినట్లు పేర్కొన్నాయి. జీపీఎస్ లొకేషన్ అందగానే, ఉపగ్రహాల సాయంతో ఆ శిబిరాలపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల కదలికలను ట్రాక్ చేసినట్లు వివరించాయి. పౌరులు, ఉగ్రవాదుల కదలికలు వేర్వేరుగా ఉంటాయని, దీన్ని బట్టి అక్కడ ఉన్నది ఉగ్రవాదులనే అన్నది నిర్ధారణ అయ్యిందని వెల్లడించాయి. సైన్యం జరిపిన దాడుల్లో 6-10 మంది పాక్ సైనికులు మరణించారని, హతమైన ఉగ్రవాదుల సంఖ్య అంతకంటే ఎక్కువనే ఉంటుందని రావత్ తెలిపారు. అయితే ఉగ్రవాదులు 18 మంది మరణించారని, పాక్ సైనికులు 12 మంది చనిపోయారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అలాగే ఆరుగురు పౌరులు మరణించినట్లు పేర్కొన్నాయి. అర్ధరాత్రి అంబులెన్సుల ద్వారా పాకిస్థాన్ ఆ ప్రాంతం నుంచి మృతదేహాలను తరలించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. అయితే భారత వాదనలను పాక్ తోసిపుచ్చింది.

1776
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles