ముగ్గురు భారత ఇంజినీర్లకు విముక్తి!

Tue,October 8, 2019 03:55 AM

11 మంది ఉగ్రవాద నేతలకు బదులుగా విడుదల చేసిన తాలిబన్లు
ఇస్లామాబాద్, అక్టోబర్ 7: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల చెరలో ఉన్న ముగ్గురు భారత ఇంజినీర్లను విడుదల చేసినట్టు తాలిబన్లు ప్రకటించారు. అయితే ఈ ముగ్గురు ఇంజినీర్ల కోసం ఆఫ్ఘన్ జైలులో ఉన్న తాలిబన్ గ్రూపునకు చెందిన 11 మంది ముఖ్య నేతలను విడుదల చేయాలని షరతులు పెట్టినట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. ముల్లాహ్ అబ్దుల్ ఘని బరదార్ నేతృత్వంలోని తాలిబన్ ప్రతినిధులు, ఆఫ్ఘనిస్థాన్‌లోని అమెరికా ప్రత్యేక ప్రతినిధి జాల్మే ఖలిల్‌జాద్ నేతృత్వంలోని అమెరికా బలగాల మధ్య గత వారాంతం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చల్లో ఈ మేరకు ఒప్పందం కుదిరినట్టు సమాచారం. 2018 మే నెలలో ఆఫ్ఘన్‌లోని బగ్లాన్ ప్రావిన్స్‌లో పనిచేస్తున్న ఏడుగురు భారత ఇంజినీర్లను తాలిబన్లు కిడ్నాప్ చేశారు. వీరిలో ఒకరిని గత మార్చిలో విడుదల చేశారు. తాజాగా ముగ్గురిని విడుదల చేశారు. ఇక మిగిలిన ఇంజినీర్ల పరిస్థితి గురించి ఎలాంటి వివరాలు తెలియట్లేదు.


అలాగే, తాజాగా విడుదల చేసిన ఇంజినీర్లకు సంబంధించిన వివరాలు, విడుదల చేసిన ప్రాంతం గురించి కూడా ఎలాంటి సమాచారం తెలియరాలేదు. కిడ్నాప్‌కు గురైన వారంతా బగ్లాన్ ప్రావిన్స్‌లోని కేఈసీ పవర్ ప్లాంట్‌లో పనిచేసేవారు. ఇక విడుదలైన తాలిబన్లలో ప్రముఖ నేతలు అబ్దుల్ రహీవ్‌ు, మౌలాన్ అబ్దుర్ రషీద్ కూడా ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ 2001లో అమెరికా నేతృత్వంలోని పరిపాలనకు ముందు తాలిబాన్ పరిపాలనలో వరుసగా కునార్, నిమ్రోజ్ ప్రావిన్సుల గవర్నర్లుగా పనిచేశారు. అయితే, ఇప్పటి వరకూ జైలులో ఉన్న ఈ 11 మంది తాలిబన్‌లు ఆఫ్ఘన్ ప్రభుత్వం చెరలో ఉన్నారా? లేక ఆఫ్ఘన్‌లోని అమెరికా దళాల చెరలో ఉన్నారా అన్న విషయాన్ని కూడా తాలిబన్‌లు ప్రకటించలేదు. భారత ఇంజినీర్ల విడుదల అంశంపై ఇటు భారత్, అటు ఆఫ్ఘనిస్థాన్ అధికారులు ఇంకా స్పందించలేదు.

982
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles