HomeNational News

నష్టం మిగిల్చిన వరద

Published: Wed,August 14, 2019 02:13 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

-కర్ణాటక, మహారాష్ట్రలో తగ్గిన వరద ఉధృతి..
-కేరళలోని రెండు జిల్లాలకు భారీ వర్షసూచన
-వరదల కారణంగా 210 దాటిన మృతుల సంఖ్య
-వరద బీభత్సానికి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు పెద్ద ఎత్తునధ్వంసం
-బాధితుల కోసం నెల జీతాన్ని విరాళంగా అందించిన మహారాష్ట్ర సీఎం, మంత్రులు

న్యూఢిల్లీ, ఆగస్టు 13: భారీ వర్షాలు, వరదల ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. భారీ వర్షాలతో పోటెత్తిన వరదల కారణంగా మంగళవారంనాటికి 210 మందికి పైగా మృతి చెందారు. ఇప్పటి వరకూ కేరళ రాష్ర్టంలో 91 మంది, మహారాష్ట్రలో 43, కర్ణాటకలో 48, గుజరాత్‌లో 31 మంది మరణించారు. వరద బీభత్సానికి ఇండ్లతో పాటు.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి. దీంతో పెద్దయెత్తున ఆస్తి నష్టం జరిగింది. బుధవారం భారీ వర్షాలు పడనున్నాయన్న భారత వాతావరణ విభాగం(ఐఎండీ) హెచ్చరికల నేపథ్యంలో కేరళలోని మలప్పురం, కోజికోడ్‌ జిల్లాల్లో అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. కేరళ వరదల ఘటనల్లో మంగళవారంనాటికి 91 మంది చనిపోగా, 40 మంది గల్లంతైనట్టు అధికారులు ప్రకటించారు. వరద ఉధృతి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో బాధితులకు అవసరమైన సామాగ్రిని అందిస్తున్నారు. వరదల గురించి ముందస్తుగా హెచ్చరికలు జారీచేసే వ్యవస్థలను సిద్దం చేయడం ద్వారా వయనాడ్‌లో ఎంతో మంది ప్రాణాల్ని, జీవనోపాధిని కాపాడొచ్చని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీకి మంగళవారం ఓ లేఖ రాశారు.

మరోవైపు, కర్ణాటకలో కూడా వరద ఉధృతి తగ్గింది. వర్షాల ప్రభావంతో కర్ణాటకలో ఇప్పటి వరకూ 48 మంది మరణించినట్టు, 16 మంది గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. శివమొగ్గ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప మంగళవారం సందర్శించారు. వరదల వల్ల రాష్ర్టంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ప్రభావితం అయిన నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాధారణంగా జరుపాలని ఆ రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు మహారాష్ర్టలో 43 మంది చనిపోయారు. కొల్హాపూర్‌, సంగ్లీ జిల్లాల్లో వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలను అధికారులు నిలిపివేశారు. వరదల వల్ల సర్వ స్వం కోల్పోయిన బాధితుల సహాయార్థం మహారాష్ర్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, కేబినెట్‌ మంత్రులు ఒక నెల వేతనాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి విరాళంగా ఇస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు. ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మంగళవారంనాటికి ఎనిమిది మంది చనిపోయారు. వరద పరిస్థితులను రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సమీక్షించారు. దేశ రాజధాని ఢిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్‌లో కూడా మంగళవారం భారీ వర్షాలు కురిశాయి.

14వేల మందిని రక్షించిన నౌకాదళం

‘వర్ష రహత్‌' ఆపరేషన్‌ పేరుతో చేపట్టిన వరద సహాయక చర్యల్లో దాదాపు 14వేల మందిని కాపాడినట్టు భారత నౌకా దళం ప్రకటించింది. భారీ వరదలతో అల్లకల్లోలమైన మహారాష్ర్ట, కర్ణాటక, గోవాలో భారత నౌకా దళం సహాయక చర్యలు చేపట్టడం తెలిసిందే. ‘గత ముప్పై ఏండ్ల కాలంలో ఈ ప్రాంతాల్లో ఇంతవరకూ చేపట్టని ఓ చారిత్రాత్మక ఆపరేషన్‌ను నిర్వహించాం. మహారాష్ర్ట, గోవా వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న 11,124 మందిని, కర్ణాటకలో మరో 3,115 మందిని రక్షించడం జరిగింది’ అని ఓ ఫ్లాగ్‌ కమాండింగ్‌ అధికారి తెలిపారు. ఈ ఆపరేషన్‌ కోసం 41 నేవీ బృందాలను వినియోగించినట్టు, బాధితులకు 3,195 కిలోల అత్యవసర సామాగ్రిని అందించినట్టు అధికారులు తెలిపారు.

రోడ్డుపై దిగిన హెలికాప్టర్‌!


IAF
-125 మందిని కాపాడిన భారత వైమానిక దళం
కచ్‌ (గుజరాత్‌), ఆగస్టు 13: గత కొంత కాలంగా కురుస్తున్న భారీ వర్షాలతో గుజరాత్‌లో వరదలు పోటెత్తాయి. వరదల్లో చిక్కుకున్న వాళ్లను రక్షించడానికి భారత వైమానికదళం(ఐఏఎఫ్‌)కు చెందిన ఓ హెలికాప్టర్‌ ఏకంగా రోడ్డుపైనే దిగింది. ఈ ఘటన కచ్‌ జిల్లాలో జరిగింది. కచ్‌ జిల్లా భుజ్‌లోని హాజిపిర్‌ దర్గా ప్రాంతంలో ఓ రోడ్డులో కొంత భాగం కొట్టుకుపోయింది. దీంతో రోడ్డు మధ్యలో దాదాపు 125 మంది చిక్కుకుపోయారు. చుట్టూ ఉధృతమైన ప్రవాహం చేరడంతో ఎటూ వెళ్లలేని పరిస్థితి. బాధితుల్ని రక్షించాల్సిందిగా ఆదివారం సాయంత్రం భారత వైమానికదళం(ఐఏఎఫ్‌)కు ఓ సందేశం వచ్చింది. స్పందించిన ఐఏఎఫ్‌ అధికారులు జావ్‌ునగర్‌ నుంచి ఎంఐ 17 హెలికాప్టర్‌ను పంపారు. రహదారి మధ్యలో దిగిన హెలికాప్ట్టర్‌ మూడు దఫాలుగా 125 మందిని సురక్షిత ప్రాంతానికి చేరవేసింది. భారీవర్షాల మూలంగా హాజిపిర్‌ దర్గా ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. వరదల్లో దాదాపు 300 మంది చిక్కుకుపోయారని, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్‌), స్థానిక పోలీసులు 175 మందిని కాపాడారని అధికారులు తెలిపారు.

1570

More News