-తమిళనాడులో గోడకూలి 17 మంది దుర్మరణం
-మృతుల్లో పదిమంది మహిళలు, ఇద్దరు చిన్నారులు
-తెల్లవారుజామున నిద్రలోనే గాల్లో కలిసిన ప్రాణాలు
-ఇప్పటివరకు రాష్ట్రంలో 25 మంది మృతి
కోయంబత్తూర్: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు తమిళనాడును అతలాకుతలం చేస్తున్నాయి. పలువురి ప్రాణాలను బలిగొంటున్నాయి. తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. కోయంబత్తూర్కు 50 కి.మీ. దూరంలోని మెట్టుపాళ్యం సమీపాన నాదుర్ గ్రామంలో గోడ కూలి 17 మంది మృత్యువాతపడ్డారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు 15 అడుగుల ఎత్తైన గోడ కూలి.. పక్కనే వరుసగా ఉన్న మూడు పెంకుటిండ్లపై పడటంతో ఆ ఇండ్లలో నిద్రిస్తున్న 17 మంది నిద్రలోనే కన్నుమూశారు. మృతుల్లో పదిమంది మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నా రు. అగ్నిమాపక, ఇతర సిబ్బంది స్థానికులతో కలిసి శిథిలాల కింద చిక్కుకుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనపై సీఎం కే పళనిస్వామి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున రాష్ట్ర విపత్తు నివారణ నిధి నుంచి పరిహారం అందజేస్తామని ప్రకటించారు.
పాఠశాలలు, కళాశాలలు మూసివేత
భారీ వర్షాలతో వరదలు ముంచెత్తే ప్రమాదం ఉన్నదన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలతో తమిళనాడు, పుదుచ్చేరిలో పాఠశాలలు, కళాశాలలను మూసేశారు. మద్రాస్ విశ్వవిద్యాలయం, అన్నా విశ్వవిద్యాలయాల్లో పరీక్షలను వాయిదా వేశారు. తమిళనాడులో చాలా ప్రాంతాలతోపాటు పక్కనున్న పుదుచ్చేరిలో గత 24 గంటల్లో భారీ వర్షాలు పడ్డాయి. నవంబర్ 29 నుంచి సోమవారం వరకు వర్షాల సంబంధ ఘటనల్లో తమిళనాడులోనే మొత్తం 25 మంది మృతిచెందారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో 176 సహాయ శిబిరాలను ఏర్పాటుచేశామన్నది. భారీ వర్షాలతో అతలాకుతలమైన ట్యుటికోరిన్, కుద్దలూర్, తిరునెవెల్లి జిల్లాల్లో ఏర్పాటుచేసిన సహాయ శిబిరాల్లో 1000 మందికి ఆశ్రయం కల్పించారు. బలమైన గాలులు వీస్తున్నందున కొమోరిన్, లక్ష్యద్వీప్ ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లొద్దని తుఫాను హెచ్చరిక కేంద్రం సూచించింది. తమిళనాడులో మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ.. వర్షాలతో దెబ్బతిన్న రెయిబోనగర్, కృష్ణానగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.