క‌శ్మీర్‌కు నేనే వెళ్తా: చీఫ్ జ‌స్టిస్ గ‌గోయ్‌

Mon,September 16, 2019 03:19 PM

హైద‌రాబాద్‌: క‌శ్మీర్‌లో చిన్నారుల ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌ని, ఆంక్ష‌ల వ‌ల్ల అక్క‌డి హైకోర్టును ఆశ్ర‌యించ‌డం కూడా వీలుకావ‌డం లేద‌ని సామాజిక కార్య‌క‌ర్త ఈనాక్షీ గంగూలీ దాఖ‌లు చేసిన అభ్య‌ర్థ‌న‌ను ఇవాళ సుప్రీంకోర్టు విచారించింది. అయితే ఆ ఆరోప‌ణ‌ల్లో నిజం ఉందో లేదో తెలుసుకోవ‌డానికి అవ‌స‌ర‌మైతే తాను క‌శ్మీర్‌కు వెళ్తానని ఇవాళ సీజేఐ రంజ‌న్ గ‌గోయ్ తెలిపారు. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత ఆగ‌స్టు 5వ తేదీ నుంచి క‌శ్మీర్‌లో ప‌రిస్థితులు ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ట్లు ఈనాక్షీ గంగూలీ త‌న పిటిష‌న్‌లో పేర్కొన్న‌ది. అక్క‌డి హైకోర్టుకు వెళ్లి స‌మ‌స్య‌ను చెప్పుకునే అవ‌కాశం లేకుండాపోయింద‌ని ఆమె త‌ర‌పున లాయ‌ర్ సుప్రీంలో వాదించారు. ఆ వాద‌న‌ల‌పై చీఫ్ జ‌స్టిస్ రియాక్ట్ అయ్యారు. జ‌మ్మూక‌శ్మీర్ హైకోర్టుకు వెళ్ల‌డానికి ఇబ్బంది ఏముంది, మిమ్మ‌ల్ని ఎవ‌రైనా అడ్డుకుంటున్నారా, క‌శ్మీర్ హైకోర్టు సీజే దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాలి, అవ‌స‌ర‌మైతే నేను క‌శ్మీర్‌కు వెళ్తాన‌ని ఇవాళ సుప్రీంలో గ‌గోయ్ తెలిపారు. ప్ర‌జ‌లు హైకోర్టుకు వెళ్ల‌లేకుంటే అప్పుడు స‌మ‌స్య మ‌రీ మ‌రీ తీవ్రంగా ఉన్న‌ట్లే అని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే జ‌మ్మూక‌శ్మీర్ హైకోర్టు న్యాయ‌మూర్తి నుంచి రిపోర్ట్ వ‌చ్చిన త‌ర్వాత తాను క‌శ్మీర్‌కు వెళ్ల‌నున్న‌ట్లు సీజేఐ తెలిపారు.

1893
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles