ఢిల్లీ-లాహోర్‌ బస్సు నిలిపివేత

Sun,August 11, 2019 01:56 AM

Pakistan suspends Delhi Lahore Dosti bus service

-కరాచీ వెళ్లేందుకు థార్‌ ఎక్స్‌ప్రెస్‌కు అనుమతి
-ఇదే చివరి సర్వీస్‌ అన్న పాక్‌ మంత్రి
-భారత్‌తో వాణిజ్య సంబంధాలు అధికారికంగా బంద్‌

ఇస్లామాబాద్‌, ఆగస్టు 10: జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా పాకిస్థాన్‌ చర్యలను కొనసాగిస్తున్నది. ఇరు దేశాల సరిహద్దుల గుండా నడిచే రెండు రైళ్లను ఇప్పటికే నిలిపివేసిన పాక్‌.. తాజాగా ఢిల్లీ-లాహోర్‌ బస్సు సర్వీసులను కూడా సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే భారత్‌తో వాణిజ్య సంబంధాలను శనివారం అధికారికంగా తెంచేసుకున్నది. 1999 ఫిబ్రవరిలో ఢిల్లీ-లాహోర్‌ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. అయితే 2001లో భారత పార్లమెంట్‌పై దాడి తర్వాత సర్వీసులు కొంతకాలం పాటు నిలిచిపోయాయి. 2003 జూలైలో తిరిగి పునరుద్ధరించారు. తాజాగా మరోసారి నిలిపివేశారు. జాతీయ భద్రతా కమిటీ సమావేశంలో నిర్ణయించిన మేరకు బస్సు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు పాకిస్థాన్‌ మంత్రి మురాద్‌ సయీద్‌ శనివారం తెలిపారు.

ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌(డీటీసీ)కు చెందిన బస్సులు ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం.. పాకిస్థాన్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (పీటీడీసీ) బస్సులు ప్రతి మంగళవారం, గురువారం, శనివారం ఢిల్లీ నుంచి లాహోర్‌కు బయలుదేరుతాయి. తిరిగి అటునుంచి, డీటీసీ బస్సులు ప్రతి మంగళవారం, గురువారం, శనివారం.. పాక్‌ బస్సులు ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం ఢిల్లీకి బయలుదేరుతాయి. భారత్‌తో సంబంధాలను కనిష్ఠ స్థాయికి తగ్గించుకోవాలన్న నిర్ణయానికి అనుగుణంగా గురువారం సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవలను నిలిపివేసిన పాక్‌.. ఆ మరునాడే థార్‌ ఎక్స్‌ప్రెస్‌ (జోధ్‌పూర్‌-కరాచీ) సర్వీసులను కూడా నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే 165 మంది ప్రయాణికులతో శనివారం వేకువజామున 1 గంటకు జోధ్‌పూర్‌ నుంచి బయలుదేరిన థార్‌ ఎక్స్‌ప్రెస్‌ కరాచీ వెళ్లేందుకు పాక్‌ అనుమతినిచ్చింది. ఇదే చివరి సర్వీస్‌ అని పాక్‌ మంత్రి రషీద్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు ఇద్దరు ప్రయాణికులతో కూడిన పీటీడీసీ బస్సు శనివారం ఉదయం లాహోర్‌కు బయలుదేరిందని, అలాగే ముగ్గురు ప్రయాణికులతో కూడిన డీటీసీ బస్సు లాహోర్‌ నుంచి ఢిల్లీకి వస్తున్నదని డీటీసీ అధికారి ఒకరు తెలిపారు.

పాక్‌ వాదనను పట్టించుకోని అంతర్జాతీయ సమాజం

జమ్ముకశ్మీర్‌ అంశంలో భారత్‌కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి, అమెరికాతోపాటు అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్థాన్‌ చేస్తున్న లాబీయింగ్‌ ఫలించడం లేదు. పాక్‌ వాదనను ప్రపంచ అధినేతలు పట్టించుకోవడం లేదు. కశ్మీర్‌ అంశాన్ని సీమాంతర ఉగ్రవాదానికి, అక్రమ చొరబాట్లకు వినియోగించుకోవడానికి వీల్లేదని పాక్‌కు నిర్మొహమాటంగానే చెబుతున్నట్లు దౌత్య వర్గాలు పేర్కొంటున్నాయి. పాక్‌ పీఎం ఇమ్రాన్‌తోపాటు ఆ దేశ మంత్రులు, ఉన్నతాధికారులు అమెరికా మధ్యవర్తిత్వం వహించకుంటే పరిస్థితులు యుద్ధానికి దారి తీస్తాయని చెబుతున్నారు. కశ్మీర్‌ తమ అంతర్గత వ్యవహారమని భారత్‌ తేల్చిచెప్పింది. పరిస్థితి భయానకంగా ఉన్నట్టుగా అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించేందుకు పాక్‌ యత్నిస్తున్నదని ధ్వజమెత్తింది. ఆ దేశ వాదనలను ప్రపంచ దేశాలు విశ్వసించబోవని స్పష్టం చేసింది.

279
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles