ముగ్గురికి ‘వైద్యం’ నోబెల్

Tue,October 8, 2019 04:04 AM

-అమెరికా పరిశోధకులు కెయిలిగ్, సెమెన్జా, బ్రిటన్‌కు చెందిన రాట్‌క్లిఫ్‌కు ప్రకటించిన అకాడమీ
-ఆక్సిజన్ స్థాయి-కణాల పనితీరు మధ్య సంబంధాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు
-రక్తహీనత, క్యాన్సర్ వంటి వ్యాధుల చికిత్సలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారని ప్రశంస

స్టాక్‌హోమ్: వైద్యరంగంలో నోబెల్ బహుమతిని ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా ప్రకటించారు. కణాలు ఆక్సిజన్ స్థాయిలను ఎలా గుర్తిస్తాయి?, దానికి అనుగుణంగా తమ పనితీరును ఎలా మార్చుకుంటాయి? అనే అంశాలపై పరిశోధనలు చేసిన అమెరికాకు చెందిన విలియం జీ కెయిలిన్ జూనియర్, గ్రెగ్ ఎల్ సెమెన్జా, బ్రిటన్ శాస్త్రవేత్త సర్ పీటర్ జే రాట్‌క్లిఫ్‌కు నోబెల్ కమిటీ పురస్కారాల ను ప్రకటించింది. వారి పరిశోధన ఫలితాలు రక్తహీనత, క్యాన్సర్ తదితర వ్యాధులపై పోరాడటంలో సరికొత్త వ్యూహాలకు ఊపిరిపోశాయని కమిటీ ప్రశంసించింది. కెల్విన్ ప్రస్తుతం హార్వర్డ్ హ్యూస్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో, సెమెన్జా.. జాన్ హాప్కిన్స్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెల్ ఇంజినీరింగ్‌లో వాస్క్యులార్ రీసెర్చ్ ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా, రాట్‌క్లిఫ్ లండన్‌లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్‌లో క్లినికల్ రీసెర్చ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. వీరికి రూ.6,48,72,978 (914,000 డాలర్లు) నగదు బహుమతి ఇవ్వనున్నారు. ఆల్‌ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 10న స్టాక్‌హోమ్‌లో అందుకోనున్నారు.

ఏం గుర్తించారు?

సాధారణంగా కణాలు ఆక్సిజన్ సాయంతో ఆహారాన్ని మండించి శక్తిని ఉత్పత్తి చేస్తుంటాయని తెలిసిందే. మనం చేసే పనులను బట్టి అవయవాలకు చేరే ఆక్సిజన్ స్థాయి భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు వ్యాయామం చేసినప్పుడు, వేగంగా నడిచినప్పుడు, గాయపడినప్పుడు.. ఇలా సమయాన్ని, పనిని బట్టి అవయవాలకు చేరే ఆక్సిజన్‌స్థాయి మారుతూ ఉంటుంది. ఆక్సిజన్ తగ్గినప్పుడు కణాలు గుర్తించి దానికి అనుగుణంగా జీవక్రియల వేగాన్ని మార్చుకుంటున్నాయి. ఇలా ఎందుకు జరుగుతున్నదనే అంశంపై ముగ్గురు నోబెల్ పురస్కార గ్రహీతలు పరిశోధనలు చేశారు. కణాలకు లభ్యమయ్యే ఆక్సిజన్ స్థాయి తగ్గిపోయినప్పుడు హైపోక్సియా-ఇండ్యూసబుల్ ఫ్యాక్టర్స్ (హెచ్‌ఐఎఫ్) అనే ప్రొటీన్ సముదాయం ఉత్పత్తి పెరుగుతుంది. ఇది ఎరిత్రోపొయెంటిన్ (ఈపీవో) అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేసే జన్యువును ఉత్తేజపరుస్తుంది. ఈపీవో హార్మోన్ ఎర్రరక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది అని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ చర్య వల్లే ఎర్రరక్తకణాల ఉత్పత్తి పెరుగడం, గాయపడిన ప్రాంతాల్లో రక్తనాళాల పునరుత్పత్తి వంటి చర్యలు జరుగుతున్నాయి.

nobel-prize2

ఎందుకంత ప్రాముఖ్యం

నివాసయోగ్యం కాని ప్రదేశాల్లో సైతం కొన్ని జీవులు ఎలా మనుగడ సాగించగలుగుతున్నాయో ఈ పరిశోధనలతో గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. క్యాన్సర్ కణతులు ఎర్రరక్తకణాల ఉత్పత్తిని అడ్డుకుంటున్నాయి. ఫలితంగా రక్తనాళాల ద్వారా వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతున్నది. తాజా పరిశోధనతో దీనిని అడ్డుకోవచ్చు. ఎర్రరక్త కణాల ఉత్పత్తిని కృత్రిమంగా ప్రోత్సహించగలిగితే రక్తహీనతను ఎదుర్కోవచ్చు అని వివరించారు.

మంచి పనికోసమే వెచ్చిస్తా

సోమవారం ఉదయం 5 గంటలకే స్టాక్ హోం నుంచి ఫోన్ వచ్చింది. పొద్దున్నే అక్కడి నుంచి ఫోన్ వచ్చిందంటే కొన్నిసార్లు చాలా మంచి విషయమే అయ్యుంటుందని నాకు తెలుసు. వెంటనే నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. మొత్తంగా శుభవార్త విన్నాను. నగదు బహుమతిని కచ్చితంగా మంచి పనికోసమే వెచ్చిస్తా - విలియం జీ కెయిలిన్ జూనియర్

ఈ ఫలితాన్ని ఊహించలేదు

నేను నా పరిశోధన ప్రారంభించినప్పుడు ఈ ఫలితాన్ని ఊహించలేదు. కణాలపై ఆక్సిజన్ ప్రభావం అనే అంశం అన్నిసార్లూ పరిశోధనలకు తగినది కాదు. మా ప్రయాణం లో అనేకమంది మా పరిశోధన ఫలితంపై అనుమానాలను వ్యక్తంచేశా రు. అయినా వెనక్కి తగ్గలేదు
- పీటర్ జే రాట్‌క్లిఫ్

529
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles