అమెరికాలో మళ్లీ కాల్పులు

Mon,October 7, 2019 03:16 AM

-కాన్సస్‌ బార్‌లో దుండగుల కాల్పులు
-నలుగురి మృతి.. ఐదుగురికి తీవ్రగాయాలు

కాన్సస్‌: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. కాన్సస్‌ నగరంలోని టెక్విలా కేసీ అనే బార్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృత్యువాతపడ్డారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కనీసం ఇద్దరు దుండగులు ఈ కాల్పులకు పాల్పడి ఉండవచ్చని కాన్సస్‌ నగర పోలీస్‌ విభాగ అధికార ప్రతినిధి థామస్‌ తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. తొలుత బార్‌లోని వారితో దుండగులకు వాగ్వాదం జరిగిందని, తర్వాత వారు బయటకు వెళ్లి తుపాకులతో తిరిగివచ్చారని వివరించారు. కాల్పులు జరిగిన సమయంలో బార్‌లో సుమారు 40 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. మృతులందరూ స్పానిష్‌ మాట్లాడేవారని వెల్లడించారు. వారి లక్ష్యంగానే ఈ దాడి జరిగిందని భావిస్తున్నామని, అయితే ఇది జాత్యహంకార దాడి కాకపోవచ్చని పోలీసులు చెప్పారు.

టెక్విలా కేసీ అనేది ప్రైవేట్‌ బార్‌ అని, సభ్యులకు మాత్రమే అందులోకి ప్రవేశం ఉంటుందని తెలిపారు. లోపలికి ఎవరెవరు వస్తున్నారనే దానిపై ప్రైవేట్‌ క్లబ్బులు ఒక రిజిస్టర్‌ నిర్వహించాల్సి ఉంటుందని, అయితే టెక్విలా కేసీ దాన్ని నిర్వహిస్తున్నదో లేదో అన్నదానిపై ఇంకా స్పష్టత లేదన్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారని వివరించారు. బార్‌కు సుమారు తొమ్మిది మైళ్ల దూరంలోని నివాసంలో వ్యాన్‌డొట్టే కౌంటీ షెరీఫ్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగి కాల్చివేతకు గురైన కొన్ని గంటలకే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. అయితే ఈ రెండు కాల్పుల ఘటనలకు గల సంబంధంపై ఎలాంటి వివరాలు వెల్లడికాలేదు. ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి అమెరికాలో 38 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి.

366
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles