అమెరికాలో చరిత్ర సృష్టించిన హైదరాబాద్ మున్నీ

Fri,November 8, 2019 02:28 AM

-వర్జీనియా సెనేటర్‌గా ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా ఘజాలా హష్మీ రికార్డు
-స్థానిక ఎన్నికల్లో మరో ముగ్గురు భారత సంతతి వ్యక్తుల గెలుపు

వాషింగ్టన్, హైదరాబాద్, నవంబర్ 7: హైదరాబాద్‌కు చెందిన ఘజాల హష్మీ (మున్నీ) అమెరికాలో చరిత్ర సృష్టించారు. చిన్నతనంలోనే (దాదాపు 50 ఏండ్ల కిందట) తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడిన ఆమె వర్జీనియా రాష్ట్ర సెనేటర్‌గా ఎన్నికయ్యారు. వర్జీనియా రాష్ట్ర సెనేటర్‌గా ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా, తొలి భారత సంతతి మహిళగా రికార్డులు సృష్టించారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన హష్మీ రిపబ్లికన్ పార్టీ సెనేటర్ గ్లిన్ స్టర్టివాంట్‌ను ఓడించడంతో ఆమె ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. ఎమోరీ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందిన ఆమె దాదాపు 25 ఏండ్లపాటు వర్జీనియాకు చెందిన కాలేజీ అండ్ యూనివర్సిటీ సిస్టమ్‌లో లీడింగ్ ఎడ్యుకేటర్‌గా సేవలందించారు. ప్రస్తుతం ఆమె రెనాల్డ్స్ కమ్యూనిటీ కాలేజ్‌లోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ విజయం నా ఒక్కరిదే కాదు.

మీ అందరిదీ.. ఎవరైతే వర్జీనియాలో ప్రగతిశీల మార్పును కోరుకుంటున్నారో.. ఎవరైతే తమ తరఫున గొంతుకను వినిపించాలని నన్ను ఎన్నుకున్నారో వారందరికీ ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను అని తెలిపారు. తనను గెలిపించిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని, తుపాకుల సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడుతానని, విద్య, వైద్యరంగాల అభివృద్ధికి కృషి చేస్తానని హష్మీ చెప్పారు. హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో చదువుకొని ప్రస్తుతం దుబాయ్‌లో పనిచేస్తున్న జాఫర్ అక్బర్ మాట్లాడుతూ ఘజాల హష్మీ చిన్నప్పటి నుంచి తెలుసు. అందరం ఆమెను మున్నీ అని పిలిచేవాళ్లం. ఆమె వర్జీనియా రాష్ట్ర సెనేటర్‌గా ఎన్నికకావడం సంతోషంగా ఉన్నది. గొప్ప సెనేటర్‌గా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నాం అని పేర్కొన్నారు. మరోవైపు మరో ముగ్గురు భారత సంతతి వ్యక్తులు కూడా ఎన్నికల్లో విజయం సాధించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు టెక్నాలజీ పాలసీ సలహాదారుగా పనిచేసిన సుహాస్ సుబ్రమణ్యం వర్జీనియా స్టేట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటీవ్‌గా ఎన్నికయ్యారు. ఆయన భారత సంతతికి చెందిన వారి ప్రాబల్యం ఎక్కువగా ఉన్న లౌదన్ అండ్ ప్రిన్స్ విలియమ్ జిల్లా నుంచి పోటీ చేసి గెలిచారు. బెంగళూరుకు చెందిన సుబ్రమణ్యం కుటుంబం 1979లో అమెరికాకు వలస వెళ్లింది. ఉత్తర కాలిఫోర్నియాలోని ఛార్టోటీ సిటి కౌన్సిల్‌కు డింప్లీ అజ్మీరా, కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాసిస్‌కో పబ్లిక్ డిఫెండర్‌గా మూ రాజు ఎన్నికయ్యారు.

1762
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles