విభేదాలు వివాదాలు కావొద్దు!

Tue,August 13, 2019 01:38 AM

-చైనాకు భారత్ విదేశాంగమంత్రి జైశంకర్ స్పష్టీకరణ
-చైనా ఉపాధ్యక్షుడు వాంగ్ ఖ్విషాన్, విదేశాంగ మంత్రి వాంగ్ యీలతో భేటీ

బీజింగ్: ద్వైపాక్షిక అంశాలపై తలెత్తే విభేదాలను వివాదాలు కానివ్వవద్దని చైనాకు భారత్ స్పష్టంచేసింది. భారత్, చైనా పరస్పరం తమ సమస్యలపై సున్నితంగా, సుహృద్భావంతో ముందుకెళ్లినప్పుడే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలను నూతన శిఖరాలకు తీసుకెళ్లేందుకు వుహాన్ సదస్సులోని సానుకూల ఫలితాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు. జమ్ముకశ్మీర్ విషయంలో తీసుకున్న నిర్ణయాలు పూర్తిగా భారత్‌కు సంబంధించి నవేనని, కశ్మీర్ భారత్ అంతర్భాగమని పేర్కొన్నారు. చైనా పర్యటనలో ఉన్న జైశంకర్ భారత్-చైనా సాంస్కృతిక సమ్మేళనం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం ఇరు దేశాల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చైనా ప్రభుత్వంతో తన సమావేశాలు సానుకూలంగా జరిగాయన్నారు.

చైనా ఉపాధ్యక్షుడు వాంగ్ ఖ్విషాన్‌తో జరిగిన భేటీలో జైశంకర్ అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. అనంతరం చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీతో జై శంకర్ సమావేశమయ్యారు. వారిద్దరూ సంయు క్తంగా మీడియాతో మాట్లాడారు. మేం అంతర్జాతీయ, ప్రాంతీయ పరిస్థితులతోపాటు ఇరు దేశాల మధ్య చాలా ముఖ్యమైన ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించాం. ఈ ఏడాది చివరిలో భారత్‌లో చైనా అధ్యక్షుడు జరిపే పర్యటన, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 70 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించనున్న సంబురాల ఏర్పాట్లపై దృష్టి సారించాలని నిర్ణయించాం అని జైశంకర్ వివరించారు. జమ్ముకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల ఊసెత్తకుండా.. ప్రాంతీయ శాంతి, సుస్థిరతలో భారత్ నిర్మాణాత్మక పాత్ర పోషించాలని వాంగ్ యీ కోరారు. ఆరోగ్య పరిరక్షణ, క్రీడలు, మ్యూజియంల నిర్వహణ, పరస్పర సాంస్కృతికాంశాల మార్పిడి అంశాలపై ఇరు దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి.

సంయుక్తంగా సినిమా వారోత్సవాలు

ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాల బలోపేతానికి 100 కార్యక్రమాలను నిర్వహించాలని భారత్, చైనా నిర్ణయించాయి. అందులో భాగంగా సంయుక్తంగా సినిమా వారోత్సవం, మ్యూజియంల నిర్వహణ, సినిమాలు-ప్రసారాల్లో సహకారం, విద్య, అధ్యయన వేదికల మధ్య చర్చలతో ఇరుదేశాల ప్రజలమధ్య బంధం బలోపేతం చేయాలన్న ప్రతిపాదన వచ్చిందని జైశంకర్ చెప్పారు. కైలాస మానసరోవర్ యాత్రికులకు వసతి కల్పన, చైనా విప్లవ సమయంలో ఆ దేశంలో సేవలందించిన భారత డాక్టర్ ద్వారకనాథ్ శాంతారాం కోట్నిస్ భావాలను ముందుకు తీసుకెళ్లాలని, ఇరు దేశాల వైద్య బృందాలు సంయుక్తంగా రెండు దేశాల్లోని మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలందించాలన్న ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు.

322
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles