చారిత్రక ప్రయత్నం

Sun,September 8, 2019 01:31 AM

Foreign Media Praises Indias Chandrayaan 2 Mission and ISRO

- అతితక్కువ ఖర్చుతో అద్భుతమైన ప్రయోగం
- చంద్రయాన్‌-2పై విదేశీ మీడియా ప్రశంసల జల్లు


వాషింగ్టన్‌/లండన్‌, సెప్టెంబర్‌ 7: ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 మిషన్‌కు చివరి నిమిషంలో ఎదురుదెబ్బ తగిలినా.. ఈ చారిత్రక ప్రయత్నం భారత ఇంజినీరింగ్‌ సామర్థ్యాన్ని చాటిచెబుతున్నదని విదేశీ మీడియా ప్రశంసించింది. న్యూయార్క్‌టైమ్స్‌, వాషింగ్టన్‌ పోస్ట్‌, బీబీసీ, గార్డియన్‌ తదితర ప్రఖ్యాత విదేశీ మీడియా సంస్థలు చంద్రయాన్‌-2పై కథనాలను వెలువరించాయి. అమెరికా మ్యాగజైన్‌ వైర్డ్‌ స్పందిస్తూ.. చంద్రయాన్‌-2 మిషన్‌ భారత్‌ ఇప్పటిదాకా చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రయోగమని పేర్కొంది. ల్యాండర్‌, రోవర్‌ను కోల్పోవడం భారత అంతరిక్ష కార్యక్రమానికి గట్టి ఎదురుదెబ్బే అయినా.. సర్వం కోల్పోయినట్లు మాత్రం కాదని వ్యాఖ్యానించింది. భారత్‌ తొలి ప్రయత్నంలో చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేయలేకపోయినప్పటికీ.. ఈ చారిత్రక ప్రయత్నం భారత ఇంజినీరింగ్‌ సామర్థ్యానికి, దశాబ్దాల అంతరిక్ష పరిజ్ఞాన అభివృద్ధికి నిదర్శనమని న్యూయార్క్‌టైమ్స్‌ కొనియాడింది. చంద్రుడిపై అడుగిడేందుకు భారత్‌ చేసిన తొలి ప్రయత్నం విఫలమైనట్లు కనిపిస్తున్నదని వాషింగ్టన్‌ పోస్ట్‌ పేర్కొంది.
world-news1
అయితే ఈ ప్రయోగం భారత దేశానికి గర్వకారణంగా నిలిచిందని వ్యాఖ్యానించింది. ప్రయోగం విఫలమైనప్పటికీ, ఇస్రో శాస్త్రవేత్తలకు సోషల్‌ మీడియాలో మద్దతు వెల్లువెత్తుతున్నదని పేర్కొంది. ‘చంద్రయాన్‌-2లో గొప్ప విజయం ఏమిటంటే తక్కువ వ్యయంతో ప్రాజెక్టును చేపట్టడం. ఈ మిషన్‌కు భారత్‌ కేవలం రూ.978 కోట్లు మాత్రమే వ్యయం చేసింది. అపోలో మిషన్‌కు నాసా ఖర్చుపెట్టిన మొత్తంలో ఇది చాలా తక్కువ’ అని వివరించింది. ‘చంద్రుడిపై రోవర్‌ను దింపేందుకు భారత్‌ చేసిన ప్రయత్నం విఫలమైనప్పటికీ.. ఈ ప్రయోగంలో ప్రతి చిన్న మెట్టునూ ప్రజలు వేడుక చేసుకున్నారు’ అని సీఎన్‌ఎన్‌ పేర్కొంది. బీబీసీ స్పందిస్తూ.. భారత్‌ అత్యంత తక్కువ వ్యయంతో అద్భుత ప్రయోగం చేపట్టిందని కొనియాడింది.
world-news2

1005
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles