సంస్కరణలతోనే పారదర్శక సేవలు


Sat,September 21, 2019 11:32 PM

ఇవ్వాళ రెవెన్యూ శాఖపెద్ద ఎత్తున విమర్శలకు గురికావడానికి రెవెన్యూ సిబ్బంది కారణం కాదు. అలాంటి పరిస్థితులను సృష్టించిన గత ప్రభుత్వాలు, ఉన్నతాధికారులు బాధ్యులు. 1985లో తాలూకాలను విభజించి మండల వ్యవస్థ ఏర్పరచినప్పటి నుంచి ఇప్పటివరకు పెద్దస్థాయిలో నియామకా లు జరుగలేదు. గ్రామాధికారుల రద్దు సందర్భంగా చేసిన గ్రూప్-4 నియామకాలు, అడపాదడపా చేపట్టిన డిప్యూటీ తహసిల్దార్లు, డిప్యూటీ కలెక్టర్ల నియామకాలే ఈ శాఖలో జరిగాయి. 2011లో వీఆర్వో, వీఆర్‌ఏలను నియమించడం జరిగింది. అసలైన ఫైల్ వర్కర్స్ అంతా కారు ణ్య నియామకం ద్వారా వచ్చినవారే. ప్రస్తుతం రెవెన్యూశాఖలో వేలాది ఖాళీలున్నాయి. రాష్ర్టాలలో ప్రతిచిన్న శాఖకూ శిక్షణా సంస్థ ఉంది. రెవెన్యూ శాఖలో అలాంటిదేదీ ఏర్పాటు చేయలేదు. వందలాది చట్టాలున్నా ఏ రెవెన్యూ అధికారికీ కనీసం సగం చట్టాలమీదైనా అవగాహన ఉండదు. వాటి గురించి సాధికారికంగా చెప్పేవా రు లేరు. అంతా ఫార్మాట్ వర్క్‌తో లాక్కొస్తున్నారు. చట్టాల అవసరాన్ని మదింపు చేయలేదు.


రెవెన్యూశాఖలో జవాబుదారీతనం తక్కువ. రెవెన్యూ శాఖ ప్రజాహిత శాఖగా మారవలసిన తరుణం ఆసన్నమైనది. రెవెన్యూ కార్యాలయానికి పోతే ఒక పోస్టాఫీసుకో, ఒక బ్యాంకుకో పోయి పనిచేసుకోగలిగిన అనుభూతి కలుగాలి. అంత సరళత్వం ఉండాలి. అలా జరుగాలంటే శాఖలో పనిచేసే వ్యక్తుల దృక్పథంలో మార్పురావాలి. సేవచేయడం ద్వారా గుర్తింపు పొందగలిగే స్వభావం రెవెన్యూ ఉద్యోగుల్లో రావాలి. అందుకోసం ప్రభుత్వం సంస్కరణలను ప్రవేశపెట్టాలి.


క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు సిబ్బంది అంతా తెలుగులో చదువుకున్నవారు. చట్టాలన్నీ ఇంగ్లిషులో ఉన్నాయి. పైగా చట్ట పరిభాష, ఇంగ్లిషు వాక్య నిర్మాణం తెలుగు మాత్రమే చదువుకున్న రెవెన్యూ సిబ్బందికి పెద్ద అడ్డంకి. చట్టాల తెలుగు అనువాదాల గురించి ఏనాడూ ఆలోచన చేయలేదు. రెవెన్యూ శాఖను ప్రజోపయోగ శాఖగా మార్చడానికి ఏ ప్రభుత్వమూ పనిచేయలేదు. వ్యక్తిగత అభిప్రాయాలతో మార్పులు చేశారు. అన్ని కీలక సమయాలలో వాడుకున్న రెవెన్యూశాఖను ఏ ప్రభుత్వమూ పటిష్ట పరుచలేదు. రెవెన్యూశాఖ సంక్షే మ శాఖ కాదు, రెగ్యులేటరీ శాఖ. రెగ్యులేటరీ విధులు చాలా సందర్భాలలో ప్రజల మీద రుణాత్మక ఫలితాలనే ఇస్తాయి. ప్రభుత్వాల దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు అనుగుణంగా ఉంటాయి. అంటే ప్రభుత్వం ఒక వర్గానికి రాష్ట్రవ్యాప్తంగా వెయ్యియూని ట్లు మంజూరి చేయాలనుకుంటే దానికి ఐదువేలమంది దరఖాస్తు చేస్తారు.

దాంట్లో వెయ్యిమందినే అర్హులను చేస్తూ ఎంపిక చేయవలసి వస్తుంది. మిగతా నాలుగు వేలమందిని అనర్హులను చేయడమే రెగ్యులేటరీ విధి. రాజకీయ నాయకుల సిఫారసులను పక్కకుపెట్టి తీరవలసినంత కఠినమైన నిబంధనలను ఈ శాఖ పాటించవలసి ఉంటుంది. రెవెన్యూశాఖలో జవాబుదారీతనం తక్కువ. రెవెన్యూ శాఖ ప్రజాహిత శాఖగా మారవలసిన తరుణం ఆసన్నమైనది. రెవెన్యూ కార్యాలయానికి పోతే ఒక పోస్టాఫీసుకో, ఒక బ్యాంకుకో పోయి పనిచేసుకోగలిగిన అనుభూతి కలుగాలి. అంత సరళత్వం ఉండాలి. అలా జరుగాలంటే శాఖలో పనిచేసే వ్యక్తుల దృక్పథంలో మార్పురావాలి. సేవచేయడం ద్వారా గుర్తింపు పొందగలిగే స్వభావం రెవెన్యూ ఉద్యోగుల్లో రావాలి. అందుకోసం ప్రభుత్వం సంస్కరణలను ప్రవేశపెట్టాలి. ఆ సంస్కరణలు కొన్ని తక్షణం ప్రవేశపెట్టగలిగేవి, కొన్ని దీర్ఘకాలంలో అమలుచేయగలిగేవి ఉంటా యి. మొత్తంగా మూడురకాల సంస్కరణలను ప్రతిపాదించవచ్చు.

అవి..

1) వ్యవస్థాగత సంస్కరణలు
2) సాంకేతిక సంస్కరణలు
3) చట్టపరమైన సంస్కరణలు. వ్యవస్థాగత సంస్కరణలు: వ్యవస్థాగతమైన సంస్కరణలు చాలా సులభమైనవి. పైగా ఎలాంటి కొత్త చిక్కులు తీసుకురానివి. ఒకటిరెండు అంశాలలో తప్ప పెద్దగా ఆర్థికభారం కూడా పడనివి. సంస్థాగతంగా అమలు చేయవలసిన సంస్కరణలు పర్యవేక్షణాధికారుల వైఫల్యం వల్ల పుట్టినవే. అందువల్ల రాష్ట్రం నుంచి మండలం వరకు అందరూ రెవెన్యూ అధికారులు వారంలో కనీసం మూడురోజులు తమ సిబ్బందితో సహా ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00ల వరకు సీట్లమీద నే కూర్చొని ప్రజలకు సమయమివ్వాలి. వాళ్ళ సమస్యను సానుకూలంగా వినాలి. దాన్ని పరిష్కరించగలిగే అవకాశం ఉన్నదీ లేనిదీ అంచనావేసి చెప్పాలి. అపోహల కు తావులేని వాతావరణం కల్పించి, సమస్యల పరిష్కారానికి నిజాయితీగా ప్రయత్నించాలి. ఈ ఒక్క అంశాన్ని, సమయపాలనతో పాటిస్తే, రెవెన్యూ శాఖ పట్ల ప్రజలకు కచ్చితంగా సదభిప్రాయం ఏర్పడుతుంది. రికార్డుల ఏకీకరణ జరుగాలి. పహాణి అడంగల్‌ను నిరంతరం నవీకరిస్తే చాలు. ఇతర రికార్డులన్నీ అడంగల్ నుంచి సృష్టించగలిగేవే.

ఉదాహరణకు

ఎ) జలాధారాల రిజిష్టరు
బి) ప్రభుత్వ భూముల రిజిష్టరు
సి) ఆసామీవారీ (చౌపస్లా),
డి) పంటల వివరాలు.

అన్నీ పహణి నుంచి రాబట్టుకోవచ్చు. కాబట్టి పహణి అడంగల్‌ను చక్కగా నిర్వహించి మిగిలిన రిజిష్టర్లను వదిలిపెట్టవచ్చు. కాలం చెల్లిన జమాబందీని కూడా రద్దు చేయవచ్చు.

సాంకేతిక సంస్కరణలు : రెవెన్యూవ్యవస్థ ప్రజలకు జవాబుదారీగా ఉండటం కోసం సాంకేతికత వినియోగం తప్పనిసరి. ఈ అవసరాన్ని గుర్తించి ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా ఉన్నప్పుడు మీ సేవను ప్రారంభించారు. అందులో అయినవీ, కానివీ వందలాది సేవలు చేర్చారు. ఏ తహసిల్దార్‌కు, కలెక్టరుకు అర్థంకాని సేవలు అందు లో చాలా ఉన్నాయి. పైగా తహసిల్దారు కార్యాలయానికి అసలే వెళ్లకుండా మీసేవ లో దరఖాస్తు చేసి మీసేవలోనే ధృవపత్రం పొందే విధంగా ఏర్పాటుచేశారు. కానీ దాని మీద పర్యవేక్షణ శూన్యం. ఏ కలెక్టరూ, ఆర్డీవో కూడా మీ సేవలో ఆల స్యం గురించి పట్టించుకోడు. సాంకేతికతను ఎంత వాడినా దాని మీద పరిశీలన లేకుండానిర్ణీతకాలంలో దరఖాస్తులు పరిశీలించబడవు, పరిష్కరించబడవు. అందుకోసం ఈ కింద చూపిన సాంకేతిక నియంత్రణలు, సంస్కరణలు అవసరం.

యాంత్రిక క్రమానుగతి: ఒక తహసిల్దార్ కార్యాలయంలో ఎలాంటి దరఖాస్తులైనా కంప్యూటరైజ్డ్ ఎంట్రీ ద్వారా మాత్రమే స్వీకరించాలి. ఆ దరఖాస్తును ఏ క్యాటగిరీలోకి చేర్చి పరిష్కరించవలసి ఉంటుందో ఆ క్యాటగిరీ క్రమసంఖ్య ఇచ్చి క్యాటగిరీని సూచిస్తూ దరఖాస్తు నమోదైపోవాలి. తదనుగుణంగా దరఖాస్తుదారునికి రశీదు ఇచ్చి పంపాలి. ఏదేని బలమైన కారణం ఉండి మొదటవచ్చిన దరఖాస్తును పరిష్కరించలేకుండా ఉండి తర్వాత దరఖాస్తును పరిష్కరించవలసి వచ్చినప్పుడు మొదటి దరఖాస్తుదారునికి ఆ విషయం తెలియజేస్తూ తర్వాత దరఖాస్తును ముట్టే పద్ధతి ఉండాలి. పైనున్న అందరు దరఖాస్తుదారులకు కూడా ఆ సమాచారం ఉండాలి. పహాణి/ అడంగల్ ప్రజాక్షేత్రంలో పెట్టాలి. ఎప్పుడంటే అప్పుడు ఎవరి భూమి వివరాలైనా చూసే విధంగా అంతర్జాలంలో పెట్టాలి. దీనివల్ల తాత్కాలికంగా కొంత చర్చ జరుగుతుంది. కానీ తర్వాత ఒక స్పష్టత వస్తుంది. ఒకసారి ప్రజాక్షేత్రంలో అడంగల్ ఉంచిన తర్వాత, తదుపరి ప్రతిమార్పునకు కారణాలు నమోదు చేయా లి. ఆ కారణాల ఆధారంగా తహసిల్దారు ఇచ్చిన ఆదేశాల పత్రాన్ని కూడా పహాణి లో డ్రాప్ డౌన్‌లు ఏర్పాటు చేసి అప్‌లోడ్ చేయాలి. ఆ ప్రొసీడింగ్ కాపీని ప్రింటు తీసుకునే అవకాశం కలిగించాలి. మిగతా విషయాలలో గట్టి రక్షణ వ్యవస్థలు ఏర్పాటుచేసుకొని పహాణిని ప్రజాక్షేత్రంలో ఉంచడం ద్వారా మండల కార్యాలయాల చుట్టూ తిరిగే బాధనుండి ప్రజలు విముక్తులవుతారు.

భూమి వెబ్‌సైట్: రెవెన్యూశాఖ అంతర్గత కార్యకలాపాల కోసం గతంలో భూ రికార్డుల నవీకరణ కార్యక్రమం ఉండేది. ప్రస్తుతం దాని స్థానంలో ధరణి అనే సైట్‌ను ప్రారంభించారు. సైట్‌లు ఏవైనా వాడుకదారుకు అనుకూలంగా ఉండటం లేదనేది రెవెన్యూ ఉద్యోగుల ఆరోపణ. ఏ ఒక్క వెబ్‌సైట్‌నూ నిత్యవాడకానికి తీసుకు రాకపోవడానికి ప్రధాన అవరోధకులు ఉన్నతాధికారులే. ఏ సాంకేతిక వ్యవస్థ అయినా తహసిల్దారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తేనే విజయవంతంగా పనిచేస్తుంది. పూర్తి స్వేచ్ఛతో కూడిన అవకాశాలతో తహసిల్దార్ పనిచేయగలిగే వెబ్‌సైట్‌ను వాడకంలో ఉంచాలి.

చట్టపరమైన సంస్కరణలు:వ్యవస్థాగతంగా, సాంకేతికంగా కొన్ని సంస్కరణల ను ప్రవేశపెట్టడం ద్వారా ఉన్న చట్టాల ఆధారంగా కొంత అభిలషణీయమైన ప్రయోజనాన్ని సాధించవచ్చు. ప్రజా వ్యతిరేకతను కొంతమేర తగ్గించుకోవచ్చు. కానీ కొన్ని చట్టపరమైన సంస్కరణల ద్వారా మాత్రమే రెవెన్యూశాఖను పూర్తిగా ఆధునీకరించగలం. చట్టపరమైన సంస్కరణలు రాజకీయస్ఫూర్తితో మాత్రమే సాధ్యమవుతాయి. వీటిని తీసుకురావడానికి ఆర్థికభారం కూడా పడుతుంది. కొన్ని నిర్ణయాధికారాలను ఉపయోగించడం ద్వారా ఈ సంస్కరణలతో ముందుకుపోయే ప్రభు త్వం కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. చట్టపరమైన సంస్కరణలను ఇలా ఆహ్వానించవచ్చు.

సర్వే సెటిల్మెంట్: సర్వే సెటిల్మెంట్ చట్టం ప్రకారం ప్రతి 30-40 సంవత్సరాలకొకసారి రీ సర్వే జరుపాలి. రీ సర్వే జరిపినప్పుడు మారిన కమతాలకు కొత్త సర్వేనెంబర్లు వస్తాయి. పోట్ నెంబర్లు తగ్గిపోతాయి. ప్రతి అనుభవదారుడికీ ఒక కొత్త స్వతంత్ర సర్వేనెంబరు రావడం వల్ల, కమతం సరియైన విస్తీర్ణం నిర్ధారించబడటం వల్ల భూసమస్యలు తొలిగిపోతాయి. ఒక పట్టాదారుకు ఉన్న భూమి కొత్తపాత సర్వేనెంబర్లు నమోదు అవుతాయి. ఒక సర్వేనెంబర్లో ఇప్పుడు ఎన్నో బిట్లు అయినాయి కానీ వాటికి సబ్ డివిజన్ కూడా జరుగలేదు. 1860-70లలో మొదటిసారి ప్రారంభమైన సర్వే సెటిల్మెంటు తిరిగి 1920-50 మధ్యలో రీసర్వే సెటిల్మెంటుకు నోచుకుంది. కానీ డ్బ్భై ఏండ్లు దాటినా మళ్ళీ రీసర్వే జరుగలేదు. ఇప్పుడు తలెత్తుతున్న అనేక భూసమస్యలకు రీసర్వే మాత్రమే పరిష్కారం చూపగలుగుతుంది. ప్రతి వ్యక్తిగతమైన భూఖండాన్ని కొలిచి, హద్దులు నిర్ణయించి, విస్తీర్ణం స్థిరపరిచి టీపన్ తయారుచేయాలి. ఆ టీపన్‌లో ఉన్న భూఖండానికి మాజీ సర్వేనెంబరు ఏమిటో కూడా వసూల్‌బాకీ తయారుచేయాలి. టెక్నాలజీని ఉపయోగించుకొని అన్ని టీపన్‌లను కంప్యూటరీకరించాలి.

పట్టణ సర్వే: తెలంగాణలో ఒక హైదరాబాద్‌కు మాత్రమే టౌన్ సర్వేలాండ్ రికా ర్డు నిర్వహించబడింది. అదికూడా 1964 నుండి 1972 మధ్య. అందులో ఎన్నో మార్పులొచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని నగరాలలో మాత్రమే టౌన్ సర్వే జరిగిం ది. ఆ రికార్డులను ఎక్కడా వాడకంలో పెట్టడంలేదు. పట్టణీకరణ పెరిగిన ఈ రోజుల్లో రీ సర్వేలో భాగంగా టౌన్ సర్వే కూడా నిర్వహించాలి. ప్రతి నిర్మాణానికి, ఇంటిస్థలానికి ఒక టౌన్ సర్వేనెంబర్ ఇస్తూ పోవాలి. గృహేతర నిర్మాణాలు కూడా ఈ సర్వేలోనే చేరాలి. టౌన్ సర్వేలోనికి రాని భూములన్నీ వ్యవసాయ రీసర్వేలో కలిపిచేయాలి. పటంతో కూడిన విస్తీర్ణాలు ఎప్పుడైనా దొరికేటట్లు సర్వే నిర్వహిస్తే చాలా సమస్యలు రెవెన్యూ అధికారుల వద్దకు రాకుండా పరిష్కారమవుతాయి.

వ్యవసాయేతర భూముల నిర్వహణ: కాలం ఆధునీకరణ దిశగా పయనిస్తున్న కొద్దీ వ్యవసాయేతర విస్తీర్ణాలు పెరిగిపోతున్నాయి. పరిశ్రమలు, గృహనిర్మాణరంగం, వ్యాపార నిర్మాణాలు విస్తరిస్తున్న క్రమంలో కూడా ఆ భూమిని పహాణిల లో వ్యవసాయ భూమిగా రాస్తూ పంటల గడులలో మాత్రం పడావా అని రాస్తున్నారు. కనీసం నిర్మాణాలు, పరిశ్రమలు, ఇండ్లు అని కూడా రాయని వీఆర్వోలు ఉన్నారు. అది పహాణిలలో వ్యవసాయ భూమిగానే ఉంటుంది కానీ ప్లాటింగు జరుగుతుంది. ఇంకోవైపు పహాణిలో పట్టాలు మారుతూ ఉంటాయి. ఇవి అనేక గందరగోళానికి దారితీస్తాయి. ఈ పరిస్థితి మారాలంటే ఎ) వ్యవసాయేతర భూమిగా మారకుండా వ్యవసాయేతర పనులు జరుగకుండా చూడాలి. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకునే ప్రక్రియను సులభతరం చేయాలి. బి) వ్యవసాయేతర భూములుగా మారిన తర్వాతే నిర్మాణ అనుమతులు, లోన్లు ఇవ్వాలి.

పహాణి/ అడంగల్‌ను ఆర్‌ఓఆర్‌గా ప్రకటించాలి: వాస్తవానికి అడంగల్‌లోని 11,12వ గడిలోని వ్యక్తినే పట్టాదార్లుగా భావించడం జరుగుతుంది. అది సరియైనదే. అయితే ఆర్‌ఓఆర్ చట్టం ప్రకారం ఫారం1లోని ఖాతేదారునే పట్టాదారు అనాలి. కోర్డు దావాలలో స్పష్టత కోసం పహాణిని ఆర్‌ఓఆర్‌గా ప్రకటించాలి. అందు లో ఉన్న పట్టెదారు, ఖాతాదారుగా గుర్తించబడటం సబబు.
dr-Yenugu-Narsimha-Reddy
22ఎ రిజిస్టర్లను ప్రకటించడం: రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఎ ప్రకారం ప్రభుత్వ, ప్రభుత్వ ఆసక్తి కలిగిన భూములు రిజిస్ట్రేషన్‌కు నిషేధించబడతాయి. అయితే ఈ భూములు తుది జాబితాను ఇంకా ప్రకటించలేదు. ఈ ఆస్తులలో కొన్నింటిని జిల్లా కలెక్టరు, కొన్నింటిని ఆర్డీవో, కొన్నింటిని ఎస్.ఓ. పట్టణ భూగరిష్టపరిమితి కొన్నింటిని సంబంధిత కమిషనర్లు, కొన్నింటిని ప్రభుత్వం ప్రకటించ వలసి ఉంది. 2016లోనే ప్రకటించాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. కానీ ప్రభు త్వం ఇంత వరకు స్పష్టమైన నిషేధజాబితా తయారుచేయకపోవడం వల్ల రిజిస్ట్రేషన్ శాఖ తమవద్ద ఉన్న పాత 22ఎ జాబితా ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అందువల్ల కొన్నినష్టాలు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాలలో కోర్టు చిక్కులు ఎదుర్కోవలసి వస్తుంది.

22ఎ రిజిష్టరు కూడా నిరంతరం మార్పులకు అవకాశం కలిగి ఉన్నదే. ప్రభుత్వ అవసరాలకు సేకరించిన భూములు, కోర్టు వ్యాజ్యాలలో నెగ్గడం ద్వారా వచ్చిన భూములు, వారసులు లేనిభూములు ఎప్పటికప్పుడు 22ఎ జాబితాలో చేరుతూ ఉండాలి. అలాగే కోర్టు తీర్పుల్లో ప్రభుత్వం ఓడిపోయిన భూములు, స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చిన భూములు 22ఎ నుంచి తొలిగిస్తూ ఉండాలి. అట్లా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ నిషేధపు భూముల జాబితాను తయారుచేసి సత్వరం, స్పష్టంగా ప్రకటించాలి. ఈ విధమైన సంస్కరణలు చేపట్టి, రెవెన్యూ ఉద్యోగుల్లో నిబద్ధత, జవాబుదారీతనం పెంచాల్సిన అవసరం ఉన్నది. అలాగే రెవెన్యూ విభాగంలో సర్వత్రా పారదర్శకత పాదుకొనేలా చర్యలు తీసు కున్నప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది.

472
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles