ప్రజలు కోరుకునే పాత్రలే చేస్తా!

Mon,January 13, 2020 10:59 PM

‘దేవుడి ఆశీస్సులు,ప్రేక్షకుల దీవెనల వలే్ల నలభైఏళ్ల పాటు కథానాయికగా రాణించాను. ఇక ముందు సినిమాలు చేయాల్సివస్తే ఉత్తమ కథల్నే ఎంచుకుంటాను. ప్రజలు ఆశించే పాత్రలే చేస్తాను’ అని చెప్పారు సీనియర్‌ నటి విజయశాంతి. ఆమె ప్రొఫెసర్‌ భారతిగా కీలక పాత్రలో నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. ఈ సందర్భంగా విజయశాంతి సోమవారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు.


రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల సినిమాలకు 13ఏళ్ల పాటు విరామం వచ్చింది. అనిల్‌రావిపూడి చెప్పిన కథ స్ఫూర్తివంతంగా అనిపించడంతో ఈ సినిమా ఒప్పుకున్నాను. ప్రొఫెసర్‌ భారతి పాత్రతో మహిళలు బాగా కనెక్ట్‌ అవుతున్నారు. ఆమె పడే సంఘర్షణ చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కొందరైతే రాములమ్మ మళ్లీ వచ్చిందంటూ ఉద్వేగానికిగురవుతున్నారు. మహేష్‌బాబు స్టార్‌హీరో ఇమేజ్‌, సీనియర్‌ నటిగా నాకున్న స్టేటస్‌ సినిమాకు బాగా ఉపయోగపడ్డాయి. నాకిది ఫర్‌ఫెక్ట్‌ రీఎంట్రీ చిత్రమని అభిమానులందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు.

దేవుడే డిజైన్‌ చేశాడు..

దాదాపు 40ఏళ్లు నాయికగా కొనసాగడం మామూలు విషయం కాదు. అదొక రికార్డ్‌బ్రేక్‌గా భావిస్తున్నా. నేను నటించిన ‘కర్తవ్యం’ సినిమా చూసి ఎంతోమంది మహిళలు పోలీస్‌డిపార్ట్‌మెంట్‌లో చేరారు. ‘మీ సినిమాల స్ఫూర్తితో సమాజంలోని అన్యాయాలపై పోరాటం చేశాం’అని చాలా మంది మహిళలు నాతో చెప్పారు. నా స్థాయికి తగిన ఉత్తమ పాత్రలు లభిస్తే భవిష్యత్తులో సినిమాలు చేస్తాను. ఏడాదికో మంచి సినిమా చేసినా చాలనుకుంటున్నా. జనాలు నా నుంచి కోరుకునే పాత్రల్నే పోషిస్తాను. ఇన్నేళ్లుగా కష్టపడి సముపార్జించుకున్న ఇమేజ్‌ను కాపాడుకోవడం అన్నింటికంటే చాలా ముఖ్యం.

అన్నీ క్లియర్‌ అయ్యాయి..

ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుకలో చిరంజీవిగారితో వేదికను పంచుకోవడం ఆనందంగా అనిపించింది. రాజకీయపరంగా మా ఇద్దరి మధ్యనున్న మనస్పర్థలు ఆ వేదిక సాక్షిగా తొలగిపోయాయి. మా ఇద్దరి కన్ఫ్యూజన్స్‌ అన్నింటికి క్లారిటీ వచ్చింది. నేను మితాహారిని. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటాను. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యతనిస్తాను. మనసు, ఆలోచనల్ని నిర్మలంగా ఉంచుకుంటాను. అందుకే ఇప్పటికీ చక్కటి అందంతో కనిపించగలుగుతున్నా.

319

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles