డియర్‌ కామ్రేడ్‌లకు అంకితం చేస్తున్నాం!

Thu,July 11, 2019 11:31 PM

‘ఈ సినిమా ట్రైలర్‌ కోసం ఈ రోజు పొద్దున ఆరు గంటలకు లేస్తే శుక్రవారం రిలీజ్‌ పెట్టుకుని మా తమ్ముడు మాత్రం తొమ్మిది గంటలకు లేచాడు. మా సినిమా ఈ నెల 26న రిలీజ్‌ అవుతున్నా మాకు నిద్రపట్టడం లేదు. ఈ చిత్రాన్ని మీకు అందిస్తున్నందుకు చాలా గర్వంగా వుంది’ అన్నారు విజయ్‌ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌'. భరత్‌ కమ్మ దర్శకుడు. రష్మిక మందన్న కథానాయిక. మైత్రీ మూవీస్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ పతాకాలపై నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి, యష్‌ రంగినేని నిర్మించారు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ని చిత్ర బృందం గురువారం హైదరాబాద్‌లో విడుదల చేసింది. ఈ సందర్భంగా హీరో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘నాలుగు భాషల్లో విడుదలైన ట్రైలర్‌ అందరికి నచ్చుతుందనే నమ్మకముంది. నా సినిమా రిలీజ్‌ రోజు 12 గంటలకు లేచిన రోజులున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్‌కు వారం ముందు నుంచే నిద్ర పట్టడం లేదు. ఈ నెల 12 నుంచి డియర్‌ కామ్రేడ్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌ మొదలవుతోంది. ఏడాది పాటు ఈ సినిమా కోసం శ్రమించాం. ఇప్పుడు ఆ కష్టాన్ని మర్చిపోవడం కోసం ఎంజాయ్‌ చేయాలని నిర్ణయించుకున్నాం. 12న బెంగళూరులో, 13న కొచ్చిలో, 18న చెన్నైలో, 19 హైదరాబాద్‌లో, 22న వైజాగ్‌లో ఆడియో రిలీజ్‌ వేడుకలు నిర్వహించబోతున్నాం. నా కెరీర్‌లోనే బెస్ట్‌ ఆల్బమ్‌ ఇది.


ఈ ఏడాదికి ఇది బిగ్గెస్ట్‌ ఆల్బమ్‌గా నిలుస్తుంది. దీన్ని సెలబ్రేట్‌ చేసుకోవాలనే టీమ్‌ అంతా డ్యాన్స్‌ చేస్తూ ఐదు రాష్ర్టాల్లో పాటలు పాడబోతున్నాం. మన జీవితంలో ఏది చేసినా మనకు ఆ పనిలో తోడుగా నిలిచే వాడే కామ్రేడ్‌. ఈ చిత్రాన్ని అలాంటి కామ్రేడ్‌లకు అంకితం చేస్తున్నాం. బెంగళూరులో నిర్వహించనున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో యష్‌ వస్తున్నారు’ అన్నారు. నవీన్‌ యెర్నేని మాట్లాడుతూ ‘ట్రైలర్‌ అద్భుతంగా వుంది. అన్ని చోట్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ రోజు నుంచి ఈ చిత్ర ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ సినిమా మ్యూజిక్‌ ఫెస్టివల్‌ని శుక్రవారం నుంచి మొదలుపెడుతున్నాం. 22న ప్రీరిలీజ్‌ వేడుకని వైజాగ్‌లో నిర్వహించనున్నాం. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది’ అన్నారు. యష్‌ రంగినేని మాట్లాడుతూ ‘రెండేళ్లుగా ఈ టీమ్‌ కష్టాన్ని చూస్తున్నాను. సినిమాపై టీమ్‌ అంతా చాలా నమ్మకంతో వున్నాం. విజయ్‌ని ఈ చిత్రంలో చాలా కొత్తగా చూస్తారు’ అని తెలిపారు. ‘మూడేళ్ల ప్రయాణం ఈ సినిమా. ఈ చిత్రం విషయంలో చాలా మంది కామ్రేడ్‌లు నాకు సహకారాన్ని అందించారు’ అని దర్శకుడు భరత్‌కమ్మ తెలిపారు. కార్యక్రమంలో రష్మిక మందన్న, రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి తదితరులు పాల్గొన్నారు.

1113

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles