అంజలకు నేనే ప్రపోజ్ చేశా!

Mon,December 2, 2019 11:04 PM

‘అంజల జవేరి సినిమాల విషయంలో నాకు ఎలాంటి సలహాలు ఇవ్వదు. మనసుకు నచ్చింది చేయమని ప్రోత్సహిస్తుంది’ అని అన్నారు తరుణ్‌రాజ్ ఆరోరా. ఆయన ప్రతినాయకుడిగా నటించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. సంతోష్ దర్శకుడు. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సోమవారం హైదరాబాద్‌లో తరుణ్ రాజ్ ఆరోరా పాత్రికేయులతో ముచ్చటించారు..


దేశవ్యాప్తంగా ఉన్న సమకాలీన సమస్యను చర్చిస్తూ దర్శకుడు సంతోష్ ఈ సినిమాను తెరకెక్కించారు. నవతరం మోసాలబారిన పడకుండా జాగ్రత్తగా ఎలా నడుచుకోవాలో అవగాహన కల్పించే సినిమా ఇది. తమిళ మాతృక ‘కణితన్’లో నేనే ప్రతినాయకుడిగా నటించాను. అదే పాత్రను తెలుగులో పోషించడం కష్టమేమీ అనిపించలేదు. మాతృక పూర్తిగా హీరో, విలన్ దృక్కోణం నుంచి సాగుతుంది. కానీ తెలుగులో పాత్రికేయుల సమస్యలు, ఫ్యామిలీ ఎమోషన్స్, మాస్ హంగులు జోడించి దర్శకుడు రూపొందించారు. కథ చెడిపోకుండా నా శైలిలో పాత్రకు న్యాయం చేసే ప్రయత్నం చేశాను. నటనకు భాషాభేదాలతో సంబంధం లేదన్నది నా సిద్ధాంతం. పాత్ర తాలూకూ భావోద్వేగాలతో సహానుభూతి చెందుతూ నటించడానికి ప్రయత్నిస్తాను. భిన్న భాషల్లో నటించే అవకాశాలు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మోడల్‌గా నా కెరీర్ ప్రారంభమైంది. పదిహేనేళ్ల పాటు మోడలింగ్ రంగంలో పనిచేశాను. ఎలాంటి సినిమా చేయాలి, ఏ సంస్థ, దర్శకుడితో కలిసి పనిచేయాలనే దానిపై జడ్జిమెంట్ లేకపోవడంతో తొలినాళ్లలో కొన్ని అనవసరమైన సినిమాల్లో నటించి తప్పుచేశాను. ఆ సినిమాల విషయంలో ఎవరిని నిందించడం లేదు. అవే నాకు నటనను నేర్పించాయి.

ప్రేమవివాహం...

అంజల జవేరి, నేను ప్రేమించి పెళ్లిచేసుకున్నాం. స్నేహితుల ద్వారా ఆమె నాకు పరిచయమైంది. తొలుత నేనే ఆమెకు ప్రపోజ్ చేశాను. పదమూడేళ్ల పాటు స్నేహితులుగా ఉన్న తర్వాత పెళ్లిచేసుకున్నాం. మా వివాహం జరిగి ఏడేళ్లవుతుంది. అంజలాజవేరి సినిమాల్లో పునరాగమనం చేసే ఆలోచనలో ఉంది. మంచి కథ కోసం ఎదురుచూస్తున్నది. ప్రస్తుతం మలయాళంలో ‘మామాంగం’, హిందీలో ‘లక్ష్మీబాంబ్’లో తమిళంలో ఓ సినిమా చేస్తున్నాను. తెలుగులో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా.

2329

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles