‘సైరా’తో దక్కిన గొప్ప గౌరవమిది

Thu,October 17, 2019 12:22 AM

-‘నమస్తే తెలంగాణ’ గెస్ట్‌ ఎడిటర్‌గా దర్శకుడు సురేందర్‌రెడ్డి

స్టార్ట్‌.. కెమెరా.. యాక్షన్‌.. అంటూ తన సృజనతో వెండితెరపై పాత్రలకు ప్రాణం పోసే దర్శకుడు సురేందర్‌రెడ్డి కలం పట్టారు. కెప్టెన్‌ కుర్చీని పక్కనపెట్టి ఎడిటర్‌ కుర్చీలో ఆసీనుడైన ఆయన గెస్ట్‌ ఎడిటర్‌గా నమస్తేతెలంగాణ దిన పత్రిక బాధ్యతల్ని కొద్ది సేపు నిర్వర్తించారు. చారిత్రక కథాంశంతో తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని అసమాన సృజనాత్మకతో వెండితెరపై దృశ్యమానం చేసి దర్శకుడిగా యావత్‌ తెలుగు ప్రేక్షకులందరిచేత ప్రశంసలందుకుంటున్నారు సురేందర్‌రెడ్డి. ప్రముఖ కథానాయకుడు చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం చక్కటి వసూళ్లను సాధిస్తున్నది. ఈ అసమాన విజయంతో ద్విగుణీకృత ఉత్సాహంతో ఉన్న దర్శకుడు సురేందర్‌రెడ్డి బుధవారం నమస్తే తెలంగాణ దిన పత్రిక ప్రధాన కార్యాలయానికి వచ్చారు. నమస్తే తెలంగాణ పత్రికకు కొద్ది సేపు ఆయన గెస్ట్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ‘సైరా’ రూపకల్పనలో తాను చేసిన పరిశోధన, చిత్రీకరణలో ఎదురైన అనుభవాల్ని నమస్తే తెలంగాణ ఎడిటర్‌ కట్టా శేఖర్‌రెడ్డితో పంచుకున్నారు. నమస్తే తెలంగాణ దిన పత్రికకు గెస్ట్‌ ఎడిటర్‌గా పనిచేసే అవకాశం లభించడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని సురేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ‘సైరా’ కథ కోసం పరిశోధన చేస్తున్న క్రమంలో చారిత్రక అంశాలకు సంబంధించి మరుగున పడిన ఎన్నో సత్యాల్ని తెలుసుకోగలిగానని పేర్కొన్నారు.

Surender-Reddy1
నమస్తే తెలంగాణ ప్రధాన కార్యాలయంలో గెస్ట్‌ ఎడిటర్‌గా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న దర్శకుడు సురేందర్‌రెడ్డి
డబ్బుల కోసం కాకుండా నటుడిగా తన కెరీర్‌లో మరపురాని సినిమా చేయాలనే తపనతో చిరంజీవి చేసిన సినిమా ఇదని, ఆయన కెరీర్‌లో చిరస్థాయిగా ‘సైరా’ నిలిచిపోతుందని సురేందర్‌రెడ్డి చెప్పారు. హిట్స్‌, బ్లాక్‌బస్టర్స్‌కు మించి దర్శకుడిగా ఓ చక్కటి సినిమా చేశాననే గుర్తింపును తనకు తెచ్చిపెట్టిందని అన్నారు. హైదరాబాద్‌ సంస్థాన విలీనానికి సంబంధించి 13 నెలల సంధికాలంతో పాటు తెలంగాణ సాయుధ పోరాటం, రజాకార్ల ఉద్యమ నేపథ్య ఇతివృత్తాల్ని వెండితెరపై ఆవిష్కరించడానికి ఇదే సరైన సమయమని అభిప్రాయపడ్డారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి రోజున కాకతాళీయంగా ఈ సినిమాకు అంకురార్పణ పడిందని చెప్పారు. ఈ సందర్భంగా సురేందర్‌రెడ్డిని ఎడిటర్‌ కట్టా శేఖర్‌రెడ్డి శాలువాతో సత్కరించారు. అనంతరం నమస్తే తెలంగాణ బృందంతో కలిసి సక్సెస్‌ కేక్‌ను కట్‌చేశారాయన. ఈ కార్యక్రమంలో ఆపరేషన్స్‌ జీఏం సీహెచ్‌ శ్రీనివాస్‌, స్టేట్‌ బ్యూరో ఛీఫ్‌ సతీష్‌ ఓరుగంటి, ఫీచర్స్‌ ఎడిటర్‌ నగేష్‌ బీరెడ్డి, సినిమా డెస్క్‌ ఇన్‌ఛార్జి మధు మడూరి, సిటీడెస్క్‌ ఇన్‌ఛార్జి చిరంజీవి ప్రసాద్‌ పాల్గొన్నారు.

1567

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles