రొమాంటిక్‌ సీన్స్‌లో ఇబ్బందిపడ్డా!

Sat,September 14, 2019 12:34 AM

సామాజిక ఇతివృత్తాలకు వాణిజ్య సూత్రాలను జోడించి సినిమాలు చేస్తుంటారు హీరో సూర్య. జయాపజయాలకు అతీతంగా కథ, కథనాలతో పాటు పాత్రల పరంగా ప్రతి సినిమాలో వైవిధ్యత కనబరిచేందుకు తపిస్తుంటారు. ఆ విలక్షణత ఆయనకు తమిళంతో పాటు తెలుగులో భారీ అభిమానగణాన్ని సంపాదించిపెట్టింది. సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘బందోబస్త్‌'. కె.వి.ఆనంద్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ నెల 20న విడుదలకానుంది. ఈసందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో సూర్య పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి...


కె.వి.ఆనంద్‌తో మూడో సినిమా చేయడానికి కారణమేమిటి?

1997లో కె.వి.ఆనంద్‌తో అనుబంధం మొదలైంది. నా తొలి సినిమాకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. పేపర్లలో ప్రచురితమైన నా తొలి ఫొటోను ఆయనే తీశారు. నేను ఆయన్నో సోదరుడిగా భావిస్తాను. నిత్యం జీవితంలో జరిగే సంఘటనల్ని కథావస్తువులుగా తీసుకొని సినిమాల్ని తెరకెక్కిస్తుంటారాయన. వాస్తవిక సమాజాన్ని ఆయన చిత్రాలు ప్రతిబింబిస్తుంటాయి. మా ఇద్దరి కలయికలో ఇదివరకు వచ్చిన అయన్‌, మ్యాట్రన్‌ చిత్రాలు యూనివర్సల్‌ కథాంశాలకు కమర్షియల్‌ హంగుల్ని జోడించి తెరకెక్కాయి. ఆ పంథాలో చాలా పరిశోధన చేసి ఈ సినిమాను రూపొందించారాయన.

ఈ సినిమా నేపథ్యమేమిటి?

దేశరక్షణ, వ్యవసాయం, రాజకీయాలతో పాటు పలు సామాజికాంశాల్ని స్పృశిస్తూ ఈ కథ సాగుతుంది. ఎన్‌ఎస్‌జీ కమాండోలు దేశంతో పాటు రాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి కీలక వ్యక్తుల్ని రక్షించేబాధ్యతల్ని తీసుకుంటారు. దేశరక్షణలోప్రధాన పాత్రను పోషించే కమాండోల బృందాన్ని నడిపించే నాయకుడు చెడ్డవాడైతే ఏం జరుగుతుంది? అలా మారడానికి కారణమేమిటనే పాయింట్‌తో రూపొందిన చిత్రమిది. కె.వి.ఆనంద్‌ కథలో రాసుకున్న సంఘటనలే నిజంగా మన దేశంలో జరిగాయి. ఎన్‌ఎస్‌జీ కమాండోల వ్యక్తిగత జీవితం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగభరితంగా ఉంటాయి.

కమాండోల నేపథ్యంలో సాగే ఈ కథ కోసం మీరు ఎలాంటి పరిశోధన చేశారు?

దేశరక్షణలో డబ్బుల కోసం కాకుండా తమ జీవితాల్ని పణంగా పెట్టి పనిచేస్తుంటారు కమాండోలు. శత్రువుల దాడుల్ని చూసి భయపడకుండా ధైర్యంగా పోరాడుతుంటారు. వారి పట్ల గౌరవాన్ని పెంచే సినిమా ఇది. ఢిల్లీలో రెండు వేల ఎకరాల్లో ఉన్న ఎన్‌ఎస్‌జీ క్యాంప్‌లో వారి జీవితాలు ఎలా ఉంటాయో మూడు రోజుల పాటు ప్రత్యేకంగా పరిశీలించాను. కులమతభేదాలకు అతీతంగా సోదరభావంతో ప్రతి ఒక్కరూ పనిచేసే తీరు నన్ను అమితంగా ఆకట్టుకుంది.

ఆర్య సెట్స్‌లో ఉండగా ఆయన సతీమణి సయేషాతో రొమాంటిక్‌ సీన్స్‌లో నటించడానికి చాలా ఇబ్బందిపడ్డాను(నవ్వుతూ) . సినిమా మొత్తంలో నేను ఎక్కువ కష్టపడి చేసిన సన్నివేశాలవే. రెగ్యులర్‌ హీరోయిన్‌లా కాకుండా చాలా ఎమోషనల్‌గా ఆమె పాత్ర సాగుతుంది.

మోహన్‌లాల్‌తో పనిచేయడం ఎలా అనిపించింది?

మోహన్‌లాల్‌ సినిమాల్ని రిఫరెన్స్‌గా తీసుకొని నటించిన రోజులున్నాయి. అలాంటిది ఆయనతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. నా కల నిజమైన అనుభూతి కలిగింది. చిన్నచిన్న హావభావాల్ని అద్భుతంగా పలికిస్తుంటారు. కొన్ని సార్లు కెమెరా సైతం ఆయనలోని ఎమోషన్స్‌ను కనిపెట్టలేదు. అలాంటి అద్భుతమైన నటుడితో పనిచేయడంతో చాలా నేర్చుకునే అవకాశం దొరికింది. అలాగే బొమన్‌ ఇరానీ, సముద్రఖని, ఆర్య ఇలా ప్రతి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.

ఈ సినిమాలో మీ పాత్ర నెగెటివ్‌ ఛాయలతో సాగినట్లుగా కనిపిస్తున్నది?

నా పాత్రలో చాలా షేడ్స్‌ ఉంటాయి. షూటింగ్‌ మొదలైన చాలా రోజుల వరకు నా పాత్ర పాజిటివ్‌, నెగెటివ్‌ అన్నది అర్థం కాలేదు. టిపికల్‌ హీరోయిజంతో సాగుతూ కొత్తగా ఉంటుంది.

ఆర్య పాత్ర ఎలా ఉండబోతుంది?

ఆర్య పాత్రను తొలుత అల్లు శిరీష్‌ చేయాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల అతడు తప్పుకోవడంతో ఆర్యను తీసుకున్నాం. ఇతర సినిమాలతో బిజీగా ఉండి కూడా ఇందులో నటించడానికి అంగీకరించారు.

తదుపరి సినిమా విశేషాలేమిటి?

సుధా కొంగర దర్శకత్వంలో చేస్తున్న సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతున్నది. మరో ఐదు రోజుల షూటింగ్‌ బ్యాలెన్స్‌గా ఉన్నది. నిజజీవిత కథను తీసుకొని ప్రయోగాత్మకంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. శివ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాను. గౌతమ్‌మీనన్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయి.

‘ఎన్‌జీకే’ ఫలితం నిరాశపరిచిందా?

మిష్టి నిర్ణయంతో చేసిన సినిమా అది. అందులో ఎవరిని తప్పు పట్టడం లేదు. మూడునాలుగు వెర్షన్స్‌ సిద్ధంచేసుకున్నాం. అందులో నుంచి మంచి వెర్షన్‌ను ఎంచుకొని సినిమా చేశాం. సరైన విడుదల తేదీ దొరక్కపోవడం, సృజనాత్మక పరమైన కారణాల వల్ల సినిమా సరైన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

922

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles