ఆ వైరుధ్యాల్ని ఆవిష్కరించడం సవాలుగా అనిపించింది!


Tue,August 13, 2019 11:47 PM

ranarangam inspired many films sudheer varma

క్రైమ్, యాక్షన్ ఇతివృత్తాలతో విలక్షణ కథాగమనంతో సినిమాల్ని తెరకెక్కిస్తుంటారు దర్శకుడు సుధీర్‌వర్మ. స్వామిరారా నుంచి వైవిధ్యతను నమ్మి ప్రయాణాన్ని సాగిస్తున్నారు. సుధీర్‌వర్మ దర్శకత్వం వహించిన తాజా చిత్రం రణరంగం. శర్వానంద్ కథానాయకుడిగా నటించారు.ఈ నెల 15న విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో సుధీర్‌వర్మ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..

దర్శకుడిగా నా కెరీర్‌లో ఛాలెంజింగ్‌గా నిలిచిన చిత్రమిది. 1990-2015 కాలాల్లో బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్‌ప్లేతో కథాగమనం సాగుతుంది. రెండు కాలాల మధ్య వైరుధ్యాల్ని తెరపై ఆవిష్కరించడం సవాల్‌గా అనిపించింది. సాంకేతికత ఏ మాత్రం అందుబాటులో లేని ఆ కాలాన్ని వాస్తవికంగా చూపించడానికి ప్రత్యేకంగా సెట్ వేశాం. సన్నివేశాల్లో ఆధునిక ఛాయలు కనిపించకుండా సినిమా చేయడానికి చాలా కష్టపడాల్సివచ్చింది.


రణరంగం చిత్రాన్ని రూపొందించడానికి ప్రేరణ నిచ్చిన అంశాలేమిటి?

-గ్యాంగ్‌స్టర్ సినిమా అనగానే ఎవరికైనా హాలీవుడ్ సినిమా గాడ్‌ఫాదర్ గుర్తొస్తుంది. ఈ జోనర్‌కు బెంచ్‌మార్క్‌గా నిలిచిన చిత్రమది. రణరంగం స్క్రీన్‌ప్లేకు గాడ్‌ఫాదర్-2 ప్రేరణగా తీసుకున్నాను.

శర్వానంద్‌తో మీ కలయిక ఎలా కుదిరింది?

-శర్వానంద్ నటించిన చిత్రాల్లో ప్రస్థానం అంటే నాకు చాలా ఇష్టం. తీవ్రమైన ఉద్వేగాలతో విలక్షణంగా అందులో అతడి పాత్ర సాగుతుంది. ఇటీవల శర్వానంద్ సున్నితమైన ప్రేమకథలు, కుటుంబ బంధాలతో కూడిన సినిమాలు చేశాడు. ఆ చిత్రాలకు భిన్నంగా ఇంటెన్సిటీతో కూడిన శక్తివంతమైన కథాంశాన్ని ఎంచుకొని శర్వానంద్‌తో సినిమా చేయాలని అనుకున్నాను. ఆ ఆలోచన నుంచి ఈసినిమా చేశాం.

నలభై ఏళ్ల వయసుపై బడిన గ్యాంగ్‌స్టర్ పాత్ర కోసం శర్వానంద్‌ను ఎలా ఒప్పించారు?

-శర్వానంద్‌ను నేను ఒప్పించడం కాదు అతడే నన్ను ఈ కథతో సినిమా చేసేలా కన్విన్స్ చేశాడు. తొలుత ఈ గ్యాంగ్‌స్టర్ కథాంశంతో రవితేజతో సినిమా చేయాలనుకున్నా. అయితే రవితేజ ఇతర చిత్రాలతో బిజీగా ఉండటంతో శర్వానంద్ హీరోగా మరో కథతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాను. ఓ సందర్భంలో గ్యాంగ్‌స్టర్ కథ శర్వానంద్‌కు చెప్పాను. అతడికి బాగా నచ్చింది. నటుడిగా ఛాలెంజింగ్‌గా ఉంటుందని, ఈ కథను తనతోనే చేయమని అడిగారు. లుక్ టెస్ట్ చేసిన తర్వాత గ్యాంగ్‌స్టర్ పాత్రకు శర్వానంద్ సరిపోతాడని అనిపించించింది. శర్వానంద్‌తో సినిమా చేస్తున్నట్లు చెప్పగానే రవితేజ కన్విన్స్ అయ్యారు.

ఇదివరకు గ్యాంగ్‌స్టర్ సినిమాలు తెలుగుతెరపై చాలా వచ్చాయి. వాటితో పోలిస్తే ఈ చిత్రం ఎంతవరకు భిన్నంగా ఉంటుంది?

-స్క్రీన్‌ప్లేతో పాటు కథానేపథ్యం కొత్తగా ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1994లో రెండోసారి ముఖ్యమంత్రి పదవీ చేపట్టిన తర్వాత ఎన్టీఆర్ లిక్కర్ ప్రొహిబిషన్‌కు ఆమోదం చెప్పారు. ఈ రెండేళ్ల ప్రొహిబిషన్ కాలం నేపథ్యంలో సినిమా సాగుతుంది. ఈ బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పటివరకు సినిమాలు రాలేదు.

ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి?

-గత చిత్రం కేశవ లో హీరోకు గుండె కుడివైపు ఉంటుందనే పాయింట్‌ను ట్రైలర్‌లలో ఎక్కువగా చూపించాం. ఆ అంశంతోనే కథ సాగుతుందనే ఆసక్తితో థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులంతా నిరాశకు లోనయ్యారు. ఆ తప్పు మళ్లీ చేయకుండా సినిమాలో మేము ఏం చెప్పబోతున్నామో అదే ట్రైలర్‌లో చూపించాం.

ప్రచార చిత్రాల్లో ఎక్కువగా కల్యాణి పాత్ర కనిపిస్తున్నది. కాజల్‌ను చూపించలేదెందుకని?

-నిడివి తక్కువే అయినా కథ, పాత్రను నమ్మి కాజల్ ఈ సినిమా చేయడానికి అంగీకరించింది. కుటుంబ ప్రేక్షకుల్లో ఆమెకున్న ఇమేజ్, అభిమానగణాన్ని దృష్టిలో పెట్టుకొని ముందునుంచే కాజల్ పాత్ర చిన్నదే అని అర్థమయ్యేలా చెప్పడం కోసమే ట్రైలర్‌లో ఆమెను చూపించలేదు. అలా చేసినందుకే కాజల్ అభిమానులు నాతో ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు.

1990 కాలాన్ని పునఃసృష్టించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

-1990 లుక్ కోసం ఆకాలం నాటి సినిమాల్ని చూశాను. ఆ రోజుల్లో సముద్రమార్గం గుండా మద్యం అక్రమ రవాణా ఎలా జరిగేందనేది తెలుసుకోవడానికి చాలా మందితో మాట్లాడాను. ఇందులో నాటకీయత ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి రాజకీయ వ్యంగ్యాస్ర్తాలు , సందేశాలు ఉండవు.

ఈ సినిమాకు సీక్వెల్‌ను రూపొందించే ఆలోచన ఉందా?

-సీక్వెల్ ఐడియా శర్వానంద్ చెప్పాడు. ఆ ఆలోచన నాకు నచ్చింది. ఈ సినిమా సక్సెస్‌ను అనుసరించే సీక్వెల్ ప్లాన్‌చేస్తాం. స్వామిరారా సినిమా సమయంలో నా గురించి ఎవరికి తెలియదు. నిఖిల్ పరాజయాల్లో ఉన్నాడు. అలాంటి సమయంలో కష్టపడి సినిమా చేశాం. వర్కవుట్ అయ్యింది. ఇప్పుడు సీక్వెల్ చేస్తే అంచనాలుంటాయి. వాటికి తగ్గ కథ దొరికితే సీక్వెల్ చేయడం మంచిదే.

స్వామిరారా నుంచి రణరంగం వరకు దర్శకుడిగా మీ ప్రయాణాన్ని విశ్లేషించుకుంటే ఏమనిపిస్తుంది.

-తదుపరి సినిమా అవకాశం వస్తుందా? రాదా? అనే అనుమానాలు లేకుండా ప్రయాణం ముందుకు సాగుతున్నది. నేను చేస్తున్న సినిమాలు, వస్తున్న అవకాశాల పట్ల సంతృప్తిగా ఉన్నాను. తదుపరి సినిమాకు సంబంధించి రవితేజతో సంప్రదింపులు జరుగుతున్నాయి.

స్వామిరారా నుంచి రెగ్యులర్ కమర్షియల్ పంథాకు భిన్నంగా సినిమాలు చేస్తున్నారు? ఎందుకలా?

-కమర్షియల్ ఫార్మెట్‌లో దోచేయ్ చేశాను. అది వర్కవుట్ కాలేదు. ఆ జోనర్ నుంచి బయటకు వచ్చి నాకు నచ్చిన కథతో కేశవ సినిమా చేశాను. ఆ సినిమాతో ప్రేక్షకుల అంచనాల్ని అందుకోలేకపోయినా నిర్మాతలకు మాత్రం లాభాల్ని తెచ్చిపెట్టింది. రణరంగం చిత్రాన్ని నేను ఏదైనా అనుకున్నానో దానిని తెరపై ఆవిష్కరించాను.

327

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles