హీరో చేస్తే ఒప్పు..! హీరోయిన్ చేస్తే తప్పా?

Wed,August 7, 2019 12:06 AM

నాయకానాయికల మధ్య వయోభేదాలతో పట్టింపులు లేకుండా మంచి కథ, పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ సినిమాలు చేస్తున్నానని అంటున్నది రకుల్‌ప్రీత్‌సింగ్. కమర్షియల్ సినిమాలతో అగ్ర కథానాయికగా గుర్తింపును సొంతం చేసు కున్న ఆమె ప్రస్తుతం విభిన్నమైన ఇతివృత్తాల్లో భాగమయ్యేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నది.
రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయికగా నటించిన తాజా చిత్రం మన్మథుడు-2. నాగార్జున కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ నెల 9న విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో రకుల్‌ప్రీత్ సింగ్ పాత్రికేయులతో ముచ్చటించింది. ఆ విశేషాలివి..


మన్మథుడు-2లో మీ పాత్ర ఎలా ఉంటుంది? ఈ సినిమాను అంగీకరించడానికి కారణం ఏమిటి?

ఇందులో అవంతిక అనే స్వేచ్ఛాస్వాతంత్య్రాల్ని అభిలషించే పరిణితితో కూడిన అమ్మాయిగా కనిపిస్తాను. అందరిని ఆటపట్టిస్తూ సరదాగా నా పాత్ర సాగుతుంది. వినోదం, సెంటిమెంట్‌తో పాటు అన్ని రకాల భావోద్వేగాలతో శక్తివంతంగా ఉంటుంది. తనకన్నా రెట్టింపు వయసున్న వ్యక్తితో పరిచయం అవంతిక జీవితంలో ఎలాంటి మార్పుల్ని తీసుకొచ్చిందన్నది సినిమాలో ఆసక్తిని పంచుతుంది.

ప్రచార వేడుకల్లో సినిమా మర్చిపోలేని అనుభూతుల్ని మిగిల్చిందని చెప్పారు?

నా కెరీర్‌లో అత్యంత సంతోషంగా పూర్తిచేసిన సినిమా ఇదే. చిత్రీకరణ సమయంలో నాగార్జున, లక్ష్మి, ఝాన్సీ.. అందరం ఓ కుటుంబంలా కలిసిపోయాం. కారావ్యాన్‌లలోకి వెళ్లకుండా షూటింగ్ విరామ సమయంలో ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుకునేవాళ్లం. షాట్ సిద్ధమైంది మాటలు ఆపేసి రండి అని రాహుల్ చెప్పగానే ముచ్చట్లలోంచి బయటపడేవాళ్లం. సాయంత్రం ఆరు గంటలకు ప్యాకప్ చెప్పగానే కలిసే డిన్నర్ చేసేవాళ్లం. ఆ కలివిడితనం స్క్రీన్‌పై ఫ్యామిలీ సన్నివేశాలు సహజంగా రావడానికి ఉపయోగపడింది.

రాహుల్ రవీంద్రన్‌తో ఉన్న స్నేహంతోనే ఈ సినిమాను అంగీకరించారా?దర్శకుడిగా అతడిలో మీకు నచ్చినదేమిటి?

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సమయంలో రాహుల్‌తో పరిచయం మొదలైంది. అతడిని ఓ పెద్దన్నలా భావిస్తాను. ప్రీప్రొడక్షన్స్‌కు రాహుల్ ఎక్కువ సమయాన్ని తీసుకుంటాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి నెల రోజుల ముందుగానే బౌండ్ స్క్రిప్ట్‌ను నాకు ఇచ్చాడు. కథపై పూర్తిగా అవగాహన ఉండటంతో ప్రతి రోజు సెట్స్‌కు వెళ్లేముందు డైలాగ్స్, సీన్స్ ఏమిటనే టెన్షన్ ఉండేదికాదు. నా పాత్ర తీరుతెన్నులు ఎలా ఉంటాయి? మిగతా క్యారెక్టర్స్‌తో ఉన్న అనుబంధం ఏమిటనేది ముందుగానే తెలియడంతో సులభంగా నా పాత్రలో ఒదిగిపోగలిగాను.

బాలీవుడ్‌లో మీరు నటించిన దే దే ప్యార్‌దే వయో అంతరాల ఆధారంగా సాగుతుంది. ఆ సినిమాతో ఈ చిత్రానికి ఏమైనా పోలికలు ఉంటాయా?

వయసు అంతరం అనే పాయింట్ తప్పితే రెండు కథల్లో చాలా వైరుధ్యాలుంటాయి. దే దే ప్యార్ దే పూర్తిస్థాయి ప్రేమకథతో సాగుతుంది. వయసు అంతరాల కారణంగా ఓ జంటకు ఎదురయ్యే పరిణామాలతో సరదాగా ఉంటుంది. మన్మథుడు-2 చిత్రాన్ని కుటుంబ, ప్రేమ, అనుబంధాలు.. పలు అంశాల్ని సృ్పశిస్తూ తెరకెక్కించారు. దే దే ప్యార్ దే పూర్తయిన తర్వాతే కథ విని ఈ సినిమాను అంగీకరించాను.

మీరు చేసిన అవంతిక పాత్రలో బోల్డ్‌నెస్ ఎక్కువగా కనిపిస్తుంది. ట్రైలర్‌లో సిగరెట్ తాగుతూ కనిపించారు?

సినిమాలో అవంతికకు సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. సిగరెట్ తాగడాన్ని బోల్డ్‌నెస్ అంటే ఎలా? హీరోయిన్ సిగరెట్ తాగే సన్నివేశాన్ని చూపించడానికో, సినిమాలో నాగార్జున ప్రియురాళ్ల గురించి చెప్పడానికో సరదాగా చేసిన సినిమా కాదిది. అవన్నీ కథలో అంతర్భాగంగానే ఉంటాయి. అవే కీలకం కాదు. కొద్ది క్షణాలు మాత్రమే కనిపించే సన్నివేశాల్ని ప్రేక్షకులు గుర్తుపెట్టుకోరని అనుకుంటున్నాను. నిజజీవితంలో నేను సిగరెట్ కాల్చను. ఆ అలవాటు లేదు. కానీ క్యారెక్టర్ కోసమే ఈ సన్నివేశాల్లో నటించాను. .

హీరోయిన్లు అలాంటి సన్నివేశాల్లో నటిస్తే ప్రేక్షకులు స్వీకరిస్తారని అనుకుంటున్నారా?

దేశంలో నిత్యం ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. కానీ సమాజం అంగీకరిస్తుందో? లేదో అని చాలామంది వాటి గురించి మాట్లాడటానికి భయపడతారు. అదే సినిమాల్లోకి వచ్చే సరికి అలాంటివి చూపిస్తే సంస్కృతి సంప్రదాయాలను కించపరుస్తున్నారని చెబుతారు. చెడు అలవాట్ల వైపు వెళ్లమని ఎవరూ ప్రోత్సహించరు. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరమని సినిమాల్లో ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు హెచ్చరిస్తాం. సినిమాల్లో హీరోలు సిగరెట్లు తాగితే ఎవరూ పట్టించుకోరు. అదే హీరోయిన్లు అలాంటి సన్నివేశాల్లో నటిస్తే మాత్రం సమస్యగా భావిస్తుంటారు.

ఈ మధ్యకాలంలో మీరు వయసు ఎక్కువగా ఉన్న హీరోలతో సినిమాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి?

ఇలాంటి మాటల్ని నేను పట్టించుకోను. వయసు ఎక్కువగావున్న హీరోలతో రొమాన్స్, పాటలతో కూడిన కమర్షియల్ సినిమాలు చేస్తే విమర్శించడంలో తప్పులేదు. నిజజీవితంలో నా స్నేహితురాలు ఒకరు తన తండ్రి కంటే రెండేళ్లు చిన్నవాడైన వ్యక్తిని ప్రేమించి పెళ్లిచేసున్నది. ఆమె కథను తెరపై ఆవిష్కరించాలని అనుకున్నప్పుడు హీరోయిన్‌గా ఇరవై ఐదేళ్ల అమ్మాయే నటించాలి తప్పితే నలభై ఏళ్ల వారు నటిస్తే ఆ పాత్రకు న్యాయం జరగదు. మన్మథుడు-2 నాయకానాయికల మధ్య వయోభేదానికి కారణం ఉంటుంది. అవంతిక లాంటి మంచి పాత్ర లభించినప్పుడు వదలుకోవడంలో అర్థం లేదు. ఇలాంటి పాత్రలు అరుదుగా దొరుకుతాయి.

వయసు ఎక్కువగా ఉన్న హీరోలతో నటించడం వల్ల అవకాశాలు తగ్గుతాయనే భయం ఉందా?

అలాంటివి నేను నమ్మను. సీనియర్స్, జూనియర్స్ అనే ఆలోచనతో కాకుండా కథను నమ్మే సినిమాలు చేస్తాను. ఆ ఆలోచన ధోరణిని వీడాలి. సినిమాలకు, పాత్రలకు నటీనటులు ఎంతవరకు న్యాయం చేస్తున్నారనే చూడాలి తప్పితే వారి వ్యక్తిగత జీవితాలతో వాటిని ఆపాదించడం సరికాదు. దేశవ్యాప్తంగా తెలుగు సినిమాను అందరూ గౌరవిస్తున్నారు. పెళ్లిచూపులు, క్షణం, గూఢచారి లాంటి చిన్న సినిమాలతో పాటు వినూత్న కథాంశాలతో రూపొందించిన పెద్ద సినిమాలు విజయాల్ని అందుకున్నాయి. దర్శకనిర్మాతల ఆలోచన ధోరణులతో పాటు ప్రేక్షకులు మారుతున్నారు.

ఈ సినిమాలో సహజీవనం గురించి చర్చించినట్లున్నారు. దానిపై మీ అభిప్రాయమేమిటి.

నేను ఎవరితో రిలేషన్‌షిప్‌లో లేను. అలాంటప్పుడు దానిపై ఎలా అభిప్రాయం చెప్పగలను. సహజీవనం తప్పని చెప్పను. తమకు నచ్చినట్లుగా జీవించే హక్కు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉంది. నేను మాత్రం వివాహవ్యవస్థను గౌరవిస్తాను.

తదుపరి సినిమాలేమిటి?

ప్రస్తుతం తెలుగులో నితిన్‌తో ఓ సినిమా చేస్తున్నాను. ఇందులో క్రిమినల్ లాయర్‌గా నా పాత్ర వినూత్నంగా ఉంటుంది. అలాగే తమిళంలో సిద్ధార్థతో చేస్తున్న సినిమా అక్టోబర్‌లో విడుదలకానుంది. బాలీవుడ్‌లో ఓ చిత్రాన్ని అంగీకరించాను. ఆ వివరాల్ని త్వరలో వెల్లడిస్తాను.

1241

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles