వెంకటేష్‌తో సినిమా చేస్తా!

Fri,October 18, 2019 12:57 AM

జీనియస్ రాజుగారి గది చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున్నారు ఓంకార్. మరోవైపు బుల్లితెర ప్రయోక్తగా రాణిస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం రాజుగారి గది-3 నేడు ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా ఓంకార్ ప్రాతికేయులతో సంభాషించారు. ఆ విశేషాలివి..
రాజుగారి గది-2 చిత్రాన్ని నాగార్జున, సమంత వంటి అగ్రతారలతో రూపొందించాను. మూడోభాగానికి కథానుగుణంగా అశ్విన్‌ను కథానాయకుడిగా ఎంచుకున్నాను. అశ్విన్ కొన్ని సినిమాలు చేసినప్పటికీ పూర్తిస్థాయి కథానాయకుడిగా ఎస్టాబ్లిష్ కాలేదు. ఈ సినిమా ఆ లోటును తీర్చుతుందనే ్త విశ్వాసంతో ఉన్నాను. రాజుగారి గది సినిమా తీసినప్పుడు హారర్ చిత్రాల రూపకల్పన ఎక్కువగా లేదు. ప్రస్తుతం నెలకు రెండుమూడు హారర్ సినిమాలొస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల మాస్ హంగులతో ఈ సినిమాను తెరకెక్కించాను. ఈ కథ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది.


వినోదం మిస్ అయింది...

రాజుగారి గది-2 చిత్రానికి మంచి కథ, హృదయాన్ని కదిలించే భావోద్వేగాలు కుదిరినప్పటికీ వినోదం మిస్ అయిందనే భావన కలిగింది. అందుకే మూడో భాగంలో వినోదానికి పెద్దపీట వేశాం. తొలుత రాజుగారి గది-2 చిత్రంలో వెంకటేష్‌ను హీరోగా తీసుకోవాలనుకున్నాం. ఆ టైమ్‌లో ఆయన డేట్స్ సర్ధుబాటుకాని కారణంగా నాగార్జునను కథానాయకుడిగా ఎంపిక చేసుకున్నాం. భవిష్యత్తులో వెంకటేష్‌తో రాజుగారి గది సిరీస్‌లో ఏదో ఒక సినిమా చేస్తాను.

అశ్విన్‌కు మాస్ ఇమేజ్‌నిస్తుంది..

కథానాయకుడిగా అశ్విన్‌లోని భిన్న పార్శాల్ని ఆవిష్కరించే చిత్రమిది. కేవలం నటనాపరంగానే కాకుండా డ్యాన్సులు, పోరాటాల్లో కూడా అతని ప్రతిభ ఏమిటో ఆవిష్కరిస్తుంది. మాస్ హీరోగా సరికొత్త ఇమేజ్‌ను తీసుకొస్తుందనే పూర్తి విశ్వాసంతో ఉన్నాను. రాజుగారి గది మొదటిభాగానికి మించిన సినిమా చేయాలనే సంకల్పంతో మూడోభాగంలో పరిపూర్ణత కోసం శ్రమించాను. మొదట ఈ చిత్రంలో తమన్నాను కథానాయికగా అనుకున్నాం. డేట్స్‌లేని కారణంగా ఆమె సినిమా నుంచి తప్పుకుంది. ఆ తర్వాత కాజల్, తాప్సీలను కూడా సంప్రదించాం. కానీ కుదరలేదు. ఒకవేళ తమన్నా నటించి ఉంటే ఆమె దృష్టికోణంలో కథ నడిచేది. ఇప్పుడు అశ్విన్‌ను ఎలివేట్ చేస్తూ స్క్రిప్ట్‌లో మార్పులు చేశాం. అవికాగోర్ దెయ్యం పాత్రలో అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించింది. ప్రస్తుతం క్రీడానేపథ్యంలో ఓ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాను. రాజుగాది గది నాలుగో భాగం సబ్జెక్ట్ కూడా సిద్ధంగా ఉంది.

1059

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles