సూర్య మాటల్ని నేను సమర్థిస్తున్నాను!


Tue,July 23, 2019 01:44 AM

Rajini hails Suriya supports his speech on education policy

కప్పాన్ ఆడియో వేడుకలో రజనీకాంత్
విలక్షణ కథానాయకుడు సూర్య నటిస్తున్న తాజా తమిళ చిత్రం కప్పాన్. కె.వి.ఆనంద్ దర్శకుడు. తెలుగులో ఈ చిత్రం బందోబస్త్ పేరుతో విడుదలకానుంది. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుక ఆదివారం చెన్నైలో జరిగింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ ముఖ్యఅతిథిగా హాజరై ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్య తండ్రి శివకుమార్ తన ఇద్దరు కుమారుల్ని గొప్పగా పెంచి పెద్ద చేశారు. ఈ ప్రయాణంలో సూర్య తనని తాను ఉన్నతమైన నటుడిగా మలుచుకున్నాడు. అతను తప్ప మరెవరూ చేయలేని పాత్రల్ని పోషించాడు. ఇటీవల సూర్య విద్యావ్యవస్థపై చేసిన వ్యాఖ్యల్ని కొందరు తప్పుబట్టారు. ఆయనకు ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. కానీ అగరం ఫౌండేషన్ స్థాపించి ఎందరికో విద్యనందిస్తున్న సూర్యకు పిల్లల కష్టాలు తెలుసు. అందుకే అలా మాట్లాడారు. ఆయన మాటల్ని నేను సమర్ధిస్తున్నాను. సూర్య మరిన్ని గొప్ప సినిమాలు చేసి ప్రజాభిమానం పొందాలని ఆకాంక్షిస్తున్నాను.

హరీస్‌జైరాజ్ ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్నందించాడు. ఇక నిర్మాత సుభాస్కరన్ పరిశ్రమకు దేవుడిచ్చిన వరం. ప్రస్తుతం నాతో పాటు ఎందరో అగ్ర నటులు ఆయన సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమా భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. సూర్య మాట్లాడుతూ ఈ సినిమాలో నేను స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ సభ్యుడి పాత్రలో నటించాను. మోహన్‌లాల్ వంటి స్టార్‌తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నా. జయాపజయాలతో సంబంధం లేకుండా కష్టపడితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. ఇక రజనీకాంత్‌గారిది ఎప్పుడూ ఒక రహదారే. ఆయన దారిలో మరొకరు రాలేరు. సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినీ..సక్సెస్ ఈజ్ ఏ జర్నీ..అనే సిద్ధాంతాన్ని నేను బలంగా నమ్ముతాను. నేను అభిమానులకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను.

ముందు మీరు..మీ కుటుంబం..తర్వాతే మన సమాజం గురించి ఆలోచించండి. ఏదీ ప్రకటనల కోసం మాత్రం చేయొద్దు అన్నారు. నటుడిగా తనదికి 41వ సంవత్సరమని, మంచి టీమ్‌తో పనిచేయడం ఆనందంగా ఉందని మోహన్‌లాల్ చెప్పారు. మోహన్‌లాల్‌గారి సినిమాలకు నేను కెమెరామెన్‌గా పనిచేశాను. తన ముందు కెమెరా లేదనుకొని నటించే గొప్ప నటుల్లో ఆయనొకరు. ఈ సినిమాలో ఆయన ప్రధాన మంత్రి పాత్రలో కనిపిస్తారు. మరొకరు చేయలేనంత గొప్పగా ఆ పాత్రను పోషించారు. సూర్య అభినయం విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కారు. మా ఇద్దరి మధ్య చక్కటి అవగాహన ఉంది. సినిమాలో పాటలకు ఇప్పటికే మంచి ఆదరణ లభిస్తున్నది అని దర్శకుడు కె.వి.ఆనంద్ చెప్పారు. సూర్యతో తాను చేస్తున్న తొమ్మిదో చిత్రమిదని, ఈ సినిమాలో చిన్నపిల్లలు కూడా పాటలు పాడారని సంగీత దర్శకుడు హరీస్ జైరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర్, వైరముత్తు, సముద్రఖని, శివకుమార్, కార్తి, ఆర్య తదితరులు పాల్గొన్నారు.

630

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles