ప్రతిరోజు కొత్త ఉదయం

Tue,September 17, 2019 11:30 PM

ప్రేమజ్ఞాపకాలు జీవితంలో నూతనోత్తేజాన్ని నింపుతాయి. గతంలోకి వెళ్లి ఆనాటి మధురస్మృతుల్ని మరోసారి తరచి చూసుకున్నామనే భావన కలిగిస్తాయి. గ్లోబల్‌స్టార్‌గా కీర్తి సంపాదించుకున్న ప్రియాంకచోప్రా ప్రణయబంధంలో కూడా అలాంటి మధురానుభూతులు ఎన్నో ఉన్నాయి. పాప్‌గాయకుడు, నటుడు నిక్‌జోనాస్‌ను గత ఏడాది ప్రియాంక చోప్రా వివాహమాడిన విషయం తెలిసిందే. సోమవారం నిక్‌జోనాస్‌ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ప్రియాంక పోస్ట్‌ చేసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వివాహానికి ముందు భర్త నిక్‌జోనాస్‌తో తాను పంచుకున్న మధుర ఘట్టాల తాలూకు వీడియోలన్నింటిని ఈ పోస్ట్‌లో పొందుపరిచింది ప్రియాంకచోప్రా. ఫుట్‌బాల్‌ స్టేడియంలో భర్తను ముద్దాడుతున్న సన్నివేశం వీడియోలో హైలైట్‌గా నిలిచింది. తన జీవితంలో మధురమైన జ్ఞాపకాల మాలిక ఇదంటూ ఆ వీడియోను అభివర్ణించింది ప్రియాంకచోప్రా. ‘నిక్‌ నా జీవితానికి వెలుగునిచ్చాడు. అతని సాంగత్యంలో ప్రతిరోజు కొత్త ఉదయాల్ని చూస్తున్నాను. నేను జీవితంలో కలుసుకున్న పరిపూర్ణమైన వ్యక్తి నిక్‌. ప్రపంచంలోని ఆనందమంతా నా భర్తకే సొంతమవ్వాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే జాన్‌. ఐ లవ్‌ యూ’ అంటూ భర్తకు విషెస్‌ అందజేసింది ప్రియాంకచోప్రా. పోస్ట్‌ చేసిన కొద్ది గంటల్లోనే ఈ వీడియోకు లక్షలసంఖ్యలో లైక్స్‌ వచ్చాయి. ప్రియాంకచోప్రా నటించిన హిందీ చిత్రం ‘ది స్కై ఈజ్‌ పింక్‌' త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.

493

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles