రజనీకాంత్‌ టైటిల్‌తో..

Sun,September 15, 2019 11:23 PM

దక్షిణాది కథానాయికల్లో ప్రయోగాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుంటుంది నయనతార. ఫలితాలతో సంబంధం లేకుండా ప్రతి సినిమాతో ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించడానికి తపిస్తుంటుంది. తాజాగా మరో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది ఈ సొగసరి. నయనతార కథానాయికగా ‘నెట్రికన్‌' పేరుతో ఆదివారం నూతన చిత్రం ప్రారంభమైంది. ఆమె ప్రియుడు విఘ్నేష్‌శివన్‌ తొలిసారి నిర్మాణ బాధ్యతల్ని చేపడుతూ రౌడీ పిక్చర్స్‌ పతాకంపై రూపొందిస్తున్న ఈ చిత్రానికి మిలింద్‌రావ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. టైటిల్‌ పోస్టర్‌ను ట్విట్టర్‌ ద్వారా విడుదలచేశారు విఘ్నేష్‌శివన్‌. బ్రెయిలీ లిపిలో రాసిన అక్షరాల్ని ఓ యువతి చేతితో తడుముతూ ఉండగా.. సంకెళ్లు, రక్తం మరకలతో నిండివున్న ఈ పోస్టర్‌ ఆసక్తిని పంచుతున్నది. క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార అంధురాలి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న 65వ సినిమా ఇది. ‘నెట్రికన్‌' టైటిల్‌తో 1981లో బాలచందర్‌ నిర్మాణంలో రజనీకాంత్‌ సినిమా చేశారు. నయనతార చిత్రానికి ఈ టైటిల్‌ను నిర్ణయించడం తమిళ చిత్రసీమలో ప్రాధాన్యతను సంతరించుకున్నది. రజనీకాంత్‌ టైటిల్‌ను వాడుకున్నందుకు ఆయనకు ట్విట్టర్‌ ద్వారా విఘ్నేష్‌శివన్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం ‘దర్బార్‌' చిత్రంలో రజనీకాంత్‌కు జోడీగా నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.

674

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles