ఒక్క ఫ్లాప్ వస్తే చాలు కషాల్లో ఉన్నాడంటారు!

Sun,September 8, 2019 08:16 AM

ఏదో ఒక ఇమేజ్ ఛట్రంలో ఇమిడిపోవడం నానికి ఇష్టం ఉండదు. వాణిజ్య ఇతివృత్తాలతో పాటు ప్రయోగాత్మక కథల్ని ఎంపికచేసుకుంటూ కెరీర్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ప్రేక్షకులు ఎలా నన్ను స్వీకరిస్తే ఆ పాత్రల్లో ఒదిగిపోయి వాటికి న్యాయం చేయాలని తపిస్తాను. నటుడిగా నా సిద్ధాంతమదే అని అంటున్నారు నాని. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం నానిస్ గ్యాంగ్‌లీడర్. విక్రమ్ కె కుమార్ దర్శకుడు. మైత్రీమూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఈ నెల 13న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా శనివారం నాని పాత్రికేయులతో సంభాషించారు. ఆయన చెప్పిన సంగతులివి..


సినిమాలో మీరు నడిపించే గ్యాంగ్ ఎలా ఉంటుంది?

-ఈ సినిమాలో నేను పెన్సిల్ పార్థసారథి అనే రచయిత పాత్రలో కనిపిస్తాను. అతని కలం పేరు పెన్సిల్. తను ప్రపంచంలోనే ప్రఖ్యాతి పొందిన రైటర్‌నని అతని ఫీలింగ్. అయితే ప్రచురణకర్తలు (పబ్లిషర్స్) మాత్రం పార్థసారథి గురించి పెద్దగా పట్టించుకోరు. ఐదుగురు మహిళలు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రతీకారాన్ని పార్థసారథి సహాయంతో ఎలా తీర్చుకున్నారన్నదే చిత్ర ఇతివృత్తం. ఇది సీరియస్ అంశాలున్న రివేంజ్ స్టోరీ కాదు. ఆద్యంతం వినోద ప్రధానంగా సాగుతుంది.

ఇంతకి ఈ సినిమా ఎలా కుదిరింది?

-దర్శకుడు విక్రమ్‌కుమార్‌తో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. కథ గురించి ఇద్దరం ఎన్నో ఐడియాలు పంచుకున్నాం. చివరకు ఈ సబ్జెక్ట్ ఓకే అయింది. జెర్సీ సినిమా ఆరంభం అయ్యే ముందు కథ చెప్పాడు. ఆ సినిమా పూర్తయ్యేలోగా స్క్రిప్ట్ మొత్తం సిద్ధంచేసుకోమన్నా.

విక్రమ్‌కుమార్ సినిమాలంటే ఇంటిలిజెంట్ స్క్రీన్‌ప్లేతో ఉంటాయి. ఇందులో అలాంటి ప్రయోగాలు ఏమైనా చేశారా?

-అలాంటిదేమి లేదు. కథాగమనంలో మలుపులు, అనూహ్య సంఘటనలు ఉన్నప్పటికి కథ ఆసాంతం హాస్యప్రధానంగా అలరిస్తుంది. సంక్లిష్టమైన అంశాలు ఏమీ ఉండవు. సాధారణ స్క్రీన్‌ప్లేతో కథ నడుస్తుంది. జెర్సీ సినిమా ఆశించిన ఫలితాన్నిచ్చిందని

భావిస్తున్నారా?

-జెర్సీ విషాదాంత కథ. ఓ క్రికెటర్ ప్రయాణాన్ని హృద్యంగా ఆవిష్కరించారు. ఈ తరహా యాంటీ ైక్లెమాక్స్‌న తెలుగు ప్రేక్షకులు స్వీకరించరు. సినిమాపరంగా మనం ఎప్పటినుంచో నమ్ముతున్న నియమాల్ని, నమ్మకాల్ని బ్రేక్ చేస్తూ ఆ చిత్రం రూపొందింది. థియేట్రికల్‌గా 30కోట్లు వసూలు చేసింది. అలాంటి సినిమాను ఫెయిల్యూర్ అని ఎలా అంటారు?. ఎంసీఏ సినిమా విడుదలైనప్పుడు డబ్బులు సరేకానీ..నాని మంచి సినిమా చేయడా? అని కొంతమంది ప్రశ్నించారు. జెర్సీ రిలీజైన తర్వాత మంచి సినిమా చేశారు సరే కానీ..ఏంసీఎ కలెక్షన్స్‌ను బ్రేక్ చేస్తుందా? అని అడిగారు. నేను ఎటువైపు వెళ్లాలో మీరే మార్గదర్శనం చేయాలి (నవ్వుతూ). జెర్సీ చిత్రాన్ని తమిళం, కన్నడం, మలయాళం, హిందీలో రీమేక్ చేయబోతున్నారు. అయినప్పటికి తెలుగులో ఆ సినిమా అనుకున్నస్థాయిలో ఆడలేదంటూ కైంప్లెంట్ చేస్తున్నారు.

కథాంశాల ఎంపికలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మిమ్మల్ని ఏ జోనర్ హీరోగా పరిగణించాలను కుంటున్నారు?

-నేను నటనను ప్రేమిస్తాను. మీరు నన్ను ఎలా స్వీకరిస్తే ఆ పాత్రలో ఒదిగిపోవడానికి ఇష్టపడతాను. కమర్షియల్ లేదా ప్రయోగాత్మక చిత్రాల హీరోనా అనే అంశాన్ని మీరే నిర్ణయించాలి.

గత కొద్ది సంవత్సరాలుగా వరుస విజయాలతో దూసుకు పోతున్నారు. కథల ఎంపికలో మీ విజయరహస్యమేమిటను కుంటున్నారు?

-సక్సెస్‌రేట్ అనే కాన్సెప్ట్‌నే నేను పట్టించుకోవడం మానేశాను. పది హిట్స్ తర్వాత ఒక్క సినిమా ఆడకపోయినా.. నాని కష్టాల్లో ఉన్నాడని విమర్శిస్తారు. అందుకే విజయాల గురించి ఆలోచించకుండా నా మనసుకు నచ్చిన కథల్ని ఎంపిక చేసుకొని సినిమాలు చేస్తున్నా.

సినిమాకు సంబంధించిన సృజనాత్మక అంశాల్లో మీ జోక్యం ఎంతవరకు ఉంటుంది?

-ఫస్ట్‌కాపీ రెడీ అయిన తర్వాత సినిమా చూసి ఓ ప్రేక్షకుడిగా నా అభిప్రాయం చెబుతా. అంతకుమించిన జోక్యం ఉండదు. ఏదైనా బాగాలేదనిపిస్తే నాకు నచ్చిన సూచనలిస్తాను.

గ్యాంగ్‌లీడర్ అనగానే చిరంజీవి గుర్తొస్తారు. అసలు ఈ టైటిల్ ఎందుకు ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది?

-ఓ మాస్ కథతో ఈ సినిమా చేస్తే ఆ టైటిల్ పెట్టుకున్నందుకు భయపడాలి. ఎందుకంటే చిరంజీవిగారి గ్యాంగ్‌లీడర్ చిత్రాన్ని ఎవరూ బీట్ చేయలేరు. అది నాకు చాలా ఇష్టమైన సినిమా. ప్రేమతో ఆ టైటిల్ పెట్టుకున్నాం. ఆ సినిమా గొప్పదనాన్ని గౌరవించినట్లుగా ట్రైలర్‌లో ఓ సన్నివేశాన్ని చూపించాం.

ఒక ప్రేక్షకుడిగా సినిమాను విశ్లేషిస్తానని చెప్పారు. హీరోగా మారిన తర్వాత సినిమా విషయంలో మీ ప్రాధామ్యాలు ఏమైనా మారాయా?

-సినిమా విషయంలో నాలోని ప్రేక్షకుడు అలాగే ఉన్నాడు. ఒక సాధారణ ప్రేక్షకుడి దృక్కోణం నుంచే నేను సినిమాలు చూస్తాను. కాలక్రమేణా ప్రేక్షకుల్లో అభిరుచుల్లో మార్పులొచ్చాయి. వారితో పాటే నా ఆలోచనాధోరణి కూడా మారింది. నేను హీరోగా నటించిన చిత్రాల్ని కూడా కామన్ ఆడియెన్ కోణంలోనే చూస్తాను.

మీ తదుపరి సినిమా గురించి?

-వి చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఈ నెల 15 నుంచి థాయ్‌లాండ్‌లో రెండో షెడ్యూల్ ప్లాన్ చేశాం.

-గతంలో ద్విభాషా చిత్రం చేసినప్పుడు చాలా సమయం వృథా అయిందనే భావన కలిగింది. అందుకే రెండు భాషల్లో సినిమా చేయాలంటే కొంచెం భయంగా ఉంటుంది. అందరికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్‌తో అద్భుతమైన కథ కుదిరితే తప్పకుండా ద్విభాషా చిత్రం చేస్తాను. అంతేకాని కమర్షియల్ కోణంలో ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆలోచనతో మాత్రం ద్విభాషా సినిమాలు చేయను.

-నేను స్కూల్‌జీవితంలో ఎలాంటి గ్యాంగ్‌ను మెయిన్‌టైన్ చేయలేదు. చాలా సైలెంట్‌గా ఉండేవాణ్ణి. అసలు క్లాస్‌లో ఉన్నానా? లేదా అనే విషయం కూడా ఎవరికి తెలిసేది కాదు. అయితే మా ఇంటి గల్లీలో మాత్రం నేనే గ్యాంగ్‌లీడర్‌ను.

-డబ్బులు మిగుల్చుకోవడానికి జెర్సీ సినిమా చేయలేదు. గొప్ప సినిమా చేశామనే ప్రశంసలతో పాటు వాణిజ్యపరంగా కూడా ఆశించిన ఫలితాలొచ్చాయి. జెర్సీ ఎన్నో అనుభూతుల్ని మిగిల్చింది. ఆ సినిమాతో మేము అనుకున్న లక్ష్యాలన్నింటిని సాధించాం.

1492

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles