ఆ భ్రమలు తొలగిపోవాలి!


Fri,August 9, 2019 11:46 PM

Kajal Aggarwal at Ranarangam Interview

స్టార్ హీరోయిన్ అనే గర్వం నాకు ఎప్పుడూ లేదు. ఈ ప్రయాణంలో ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే మంచి పాత్రలు చేయాలనే సంకల్పంతో కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నాను అని చెప్పింది కాజల్ అగర్వాల్. పుష్కరకాలంగా దక్షిణాది ప్రేక్షకుల్ని తన అందం, అభినయంతో మెప్పిస్తున్న ఈ సుందరి తాజాగా రణరంగం చిత్రంలో కథానాయికగా నటించింది. శర్వానంద్ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలకానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో కాజల్ అగర్వాల్ పాత్రికేయులతో ముచ్చటించింది. ఆ విశేషాలివి..

రణరంగం చిత్రంలో మీ పాత్ర చిత్రణ ఎలా ఉంటుంది?

ఈ సినిమాలో నేను డాక్టర్‌గా కనిపిస్తాను. ద్వితీయార్థంలో నా పాత్ర కథలోకి ప్రవేశిస్తుంది. గ్యాంగ్‌స్టర్ జీవిత ప్రయాణంలో ఓ మహిళా డాక్టర్‌తో ఏర్పడిన పరిచయం ఎలాంటి మలుపులకు కారణమైంది? ఇద్దరి ఉన్నతికి వారి ప్రేమాయణం ఏ విధంగా దోహదపడిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది.

ఈ చిత్ర కథలో మీకు నచ్చిన అంశాలేమిటి?

స్వతహాగా నాకు గ్యాంగ్‌స్టర్ సినిమాలంటే ఇష్టం. జీవితం కంటే అవి విస్త్రత పరిధిలో ఉంటూ చక్కటి డ్రామాతో ఆకట్టుకుంటాయి. రణరంగం చిత్రంలో నా పాత్ర చిన్నదే అయినా కథాగమనంలో చాలా కీలకంగా ఉంటుంది. శర్వానంద్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చింది. దర్శకుడు సుధీర్‌వర్మ చాలా టాలెంటెడ్. సృజనాత్మక ఆలోచనలతో చిత్రాన్ని తెరకెక్కించాడు.

సీత చిత్ర పరాజయం మిమ్మల్ని నిరాశకు గురిచేసిందా?

అలాంటిదేమి లేదు. సినిమా అనేది సమిష్టి కృషి. వైఫల్యంలో కథానాయిక పాత్ర పెద్దగా ఉండదు. అయితే వ్యక్తిగతంగా సీత పాత్ర నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఆ పాత్ర చేయడం గర్వంగా భావించాను. నా నటనకు మంచి ప్రశంసలు లభించాయి. అవకాశం వస్తే దర్శకుడు తేజతో మళ్లీ పనిచేయడానికి సిద్ధమే. సీత పాత్రలోని భావోద్వేగాల నుంచి బయటకు రావడానికి చాలా సమయం పట్టింది. నాపై బలమైన ముద్ర వేసిన పాత్ర అది.

క్వీన్ తమిళ రీమేక్ విషయంలో సెన్సార్ సమస్యలు తలెత్తాయని చెబుతున్నారు?

క్వీన్ నాలుగు దక్షిణాది భాషల్లో రీమేక్ అవుతున్నది. తమిళంలో నేను కథానాయికగా నటించాను. ఒక్క తమిళంలో తప్ప ఎక్కడా సెన్సార్ సమస్యలు రాలేదు. చిత్ర బృందం ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

ఈ మధ్య నిర్మాణ సంస్థను మొదలుపెట్టారు. ఎలాంటి సినిమాలు చేయబోతున్నారు?

ప్రస్తుతం చిత్ర నిర్మాణానికి దూరంగా ఉందామనుకుంటున్నాను. నేను అంగీకరించినా ప్రాజెక్ట్‌ల మీదనే దృష్టిపెడుతున్నాను. కథలు బాగా నచ్చితే సినిమాల్లో నిర్మాణ భాగస్వామ్యం గురించి ఆలోచిస్తాను.

దక్షిణాదిలో అగ్ర కథానాయికల్లో ఒకరిగా స్టార్‌డమ్‌ను ఆస్వాదించడం ఎలా అనిపిస్తున్నది?

నేను స్టార్‌హీరోయిన్ అని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పటికి తొలి అడుగులు వేస్తున్నాననే అనుకుంటున్నాను. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా వుంది. ఒకవేళ నన్ను ఎవరైనా సూపర్‌స్టార్ అంటే ఆనందపడతాను. ఈ ప్రయాణంలో నటిగా మరింత పరిణితి సాధించాను. కథల ఎంపికలో తెలివిగా ఆలోచించగలుగుతున్నాను. ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నా. నటిగా కంటే సంస్కారవంతమైన మహిళగా గొప్పగా ఎదిగాననుకుంటున్నాను.

కొన్ని నెలల క్రితం మేకప్‌లేకుండా సోషల్‌మీడియాలో ఫొటోలు పెట్టారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది?

సోషల్‌మీడియాలో అనేక ఫిల్టర్స్, ఎఫెక్ట్స్‌తో ఫేక్ ఫొటోల్ని ప్రచారం చేయడం ఎక్కువైపోయింది. మహిళలకు అందంపై ఉన్న భ్రమలు తొలగిపోవాలి. అందుకే అలా మేకప్ లేకుండా ఫొటోలు పెట్టాను. నా దృష్టిలో స్వచ్ఛమైన వ్యక్తిత్వంలోనే నిజమైన అందం ఇమిడి ఉంటుంది. విజయం వైపు నిజాయితీగా చేసే ప్రయత్నంలో అందంఉంటుంది. మహిళలకు అందం ఒక్కటే కొలమానం కాదు. అందాన్ని, వ్యక్తిత్వాన్ని బ్యాలెన్స్ చేస్తూ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలనే సందేశాన్నిస్తూ ఆ ఫొటోలు పెట్టాను.

భారతీయుడు-2 చిత్రం నుంచి మీరు తప్పుకున్నారని వార్తలొస్తున్నాయి?

అలాంటిదేమి లేదు. కమల్‌హాసన్, శంకర్ వంటి లెజెండ్స్ సినిమా లో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. నవంబర్‌లో చిత్రీకరణ మొదలవుతుంది. భారతీయుడు-2 చిత్రం కోసం శారీరకంగా కూడాఫిట్‌గా తయారవుతున్నాను. ఇక కాల్ సెంటర్ పేరుతో తెలుగు, హాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తున్నాను. అందులో ఛాలెజింగ్ పాత్ర చేస్తున్నాను.

కశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దుపై మీ అభిప్రాయమేమిటి?

దేశ ప్రజలందరూ కోరుకున్నదే అది. ఆర్టికల్ 370 రద్దు వల్ల కశ్మీర్ అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాను. భూతలస్వర్గమైన కశ్మీర్‌లో టూరిజం వంటివి ఇంకా వృద్ధిలోకి వస్తాయి. అక్కడ శాంతి నెలకొల్పడానికి ప్రభుత్వ చర్యలు ఉపకరిస్తాయని అనుకుంటున్నాను.

748

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles