టిక్కెట్లు అమ్ముకునే టైప్ కాదు!


Thu,August 8, 2019 11:05 PM

Interview with Rahul Ravindran about Manmadhudu 2

మన్మథుడు చిత్రానికి ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం వుంది. ఒక ప్రేక్షకుడిగా నాకు నచ్చిన సినిమా అది. ఎప్పుడైనా ఒత్తిడికి గురైనప్పుడు ఆ సినిమానే చూస్తుంటాను. ఆ సినిమా తరహాలోనే ధియేటర్‌కి వచ్చిన ప్రేక్షకుడిని మన్మథుడు-2 ఆకట్టుకుంటుందన్న నమ్మకముంది అన్నారు రాహుల్ రవీంద్రన్. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం మన్మథుడు-2. నాగార్జున కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా రాహుల్ రవీంద్రన్ గురువారం పాత్రికేయులతో ముచ్చటించారు.

రీమేక్ అనగానే భయపడ్డారట ఎందుకని?

రీమేక్ అని నాగార్జునగారు చెప్పినప్పుడు ఇది అధికారిక రీమేకేనా? అని అడిగాను. సినిమా రీమేక్ హక్కులు తీసుకున్నాం. ఆ విషయంలో భయపడాల్సిన పనిలేదని నాగార్జున చెప్పడంతో నేను మరో ఆలోచన లేకుండా అంగీకరించాను.

మన్మథుడు టైటిల్‌నే ఈ చిత్రానికీ పెట్టడానికి ప్రత్యేకమైన కారణం ఏదైనా వుందా? ఈ టైటిల్ ఐడియా ఎవరిది?

ఈ ఐడియా మా టీమ్ నుంచి వచ్చిందే. అయితే అది ఎవరిచ్చారనేది మాత్రం కరెక్ట్‌గా గుర్తులేదు. ఈ కథకు మన్మథుడు-2ని మించిన టైటిల్ సెట్టవదు అని చెప్పారు. దీనికితోడు మన్మథుడు టైటిల్‌కు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వుంది. ఆ టైటిల్ అయితే సినిమాకు ప్లస్ అవుతుందని బలంగా నమ్మాం.

మన్మథుడు చిత్రాన్ని దృష్టిలో పెట్టుకుని వస్తే ఇబ్బందికదా?

ఖచ్చితంగా థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులు గతంలో వచ్చిన మన్మథుడుతో పోల్చిచూస్తారు. అయితే కథలో దమ్ముంటే ఖచ్చితంగా చూస్తారు. అలా అని మన్మథుడు చిత్రాన్ని మించి ఈ సినిమా వుంటుందని మాత్రం చెప్పను.

సమంతతో అతిథి పాత్ర చేయించడానికి కారణం?

ఓ కీలకమైన సన్నివేశంలో సమంత చిన్న అతిథి పాత్రలో కనిపిస్తుంది. ఆ పాత్ర అనుకున్నప్పుడు నాగార్జునకు చెప్పాను. ఆయన కూడా సమంత చేస్తే బాగుంటుంది కానీ చేస్తుందా? అని అడిగారు. వెంటనే ఆ విషయాన్ని సమంతకు చెప్పడం ఆమె ఓకే అనడం చకచకా జరిగిపోయాయి.

నాగార్జున చిత్రాల్లో వినిపించని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఈ చిత్రంలో వినిపిస్తున్నాయి?

కావాలని డబుల్ మీనింగ్ డైలాగ్‌లు రాయలేదు. సింగిల్ మీనింగ్‌తోనే రాశాం. కానీ అవి బయటికి వచ్చాక తెలిసింది. అవి డబుల్ మీనింగ్ డైలాగ్స్ అని. పిల్లలకు కోచింగ్ ఇవ్వాల్సిన వయసులో బ్యాటింగ్‌కి దిగుతావేంట్రా అంటూ సినిమాలో రావు రమేష్ చెప్పే డైలాగ్ వుంది. దానికి బయట వేరే అర్థాలు వున్నాయని నాకు తెలియదు. అయినా హాట్ సన్నివేశాలు చూపించి టిక్కెట్లు అమ్ముకునే టైప్ కాదు నేను.

డైరెక్టర్ అయ్యారు. నటుడిగా కొనసాగుతారా?

తప్పకుండా కొనసాగుతాను. నాకు నటన అంటే చాలా ఇష్టం. అయితే రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా వుండే కథల్లో మాత్రమే నటించాలనుకుంటున్నాను.

చిన్మయికి సోషల్ మీడియాలో సపోర్ట్‌గా నిలుస్తుంటారా?

కొన్ని విషయాలు నేను స్పందిస్తే కానీ ఎదుటివారు అర్థం చేసుకోలేరని నాకు అనిపించినప్పుడు మాత్రమే స్పందిస్తుంటాను. చిన్మయి స్వతంత్ర భావాలుగల అమ్మాయి. తనకు ఏం కావాలో తెలుసు. నేను ఎప్పుడైనా ఒత్తిడిగా ఫీలైనా ఇంటికి వెళ్లగానే చిన్మయి పాటతో అంతా మర్చిపోతుంటాను.

935

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles