ఆ పరాజయం పాఠాన్ని నేర్పింది!

Thu,August 15, 2019 12:17 AM

క్షణం తరువాత 55 కథలు విన్నాను. అందులో ఏ కథ నన్ను సంతృప్తిపరచలేదు. ఓ సగటు ప్రేక్షకుడిగా నాకు నచ్చిన చిత్రాలు చేస్తున్నాను. థియేటర్‌లో పాప్‌కార్న్ తింటూ సినిమాను ఎంజాయ్ చేయాలన్నదే నా ప్రధాన ఉద్దేశం అన్నారు అడివి శేష్. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఎవరు. వెంకట్ రాంజీ దర్శకుడు. పీవీపీ నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా యువ హీరో అడివి శేష్ బుధవారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు.


ఎవరు ఎలాంటి సినిమా?

-ట్రైలర్ చూసిన వాళ్లకి ఇదొక క్రైమ్ థ్రిల్లర్ అనిపిస్తుంది. ఓ క్రైమ్ జరుగుతుంది. అది ఎవరు చేశారు?. ఎందుకు చేశారు అనే నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది.

సినిమాపై మంచి నమ్మకంతో వున్నట్టున్నారు?

-ఎవరు ఓ డీసెంట్ ఫిల్మ్. సినిమా నాణ్యత పరంగా ఉన్నతంగా వుంటుంది. అలా అని సినిమాలో ఎలాంటి అసభ్యకరమైన సన్నివేశాలు లేవు. 70 శాతం చిత్రీకరణ పూర్తయిన దగ్గరి నుంచి మళ్లీ మళ్లీ చూసుకుంటూ రీషూట్‌లు చేస్తూ వచ్చాం. ఈ విధానాన్ని క్షణం, గూఢచారి చిత్రాలకు అనుసరించాం. మంచి ఫలితాల్ని సాధించాం. అందుకే ఈ చిత్రానికి కూడా అదే పంథాను అనుసరించి సినిమా సంతృప్తికరంగా వచ్చే వరకు రీషూట్‌లు చేశాం.

వరుసగా థ్రిల్లర్స్‌నే ఎంచుకుంటున్నట్టున్నారు?

-క్షణం ఓ థ్రిల్లర్. అమీ-తుమీ కామెడీ ఎంటర్‌టైనర్. గూఢచారి ఓ మిషన్ ఇంపాజిబుల్ తరహా చిత్రం. కానీ అది థ్రిల్లర్ కాదు. క్షణం ఓ ఎమోషనల్ థ్రిల్లర్. నేను నటించిన ఏ చిత్రాన్ని రెండవసారి మా అమ్మ చూడలేదు. కానీ క్షణంలోని భావోద్వేగాలు ఆకట్టుకోవడంతో ఐదు సార్లు చూశారు. సినిమా చూసిన తరువాత ఏడిపించేశావురా అన్నారు. మన డియన్స్‌కి భావోద్వేగాలు ముఖ్యం. నేనూ అదే నమ్మాను. నా సినిమాల్ని ఓ వర్గం ప్రేక్షకులు మాత్రమే కాకుండా అందరి అభిమానులు చూడాలనుకుంటాను.

ఒక సినిమా ఎలా వుండాలి? ఎలా వుండకూడదో తెలుసుకున్నాను అన్నారు. ఆ మార్పుకి కారణం?

-ప్రతి మనిషిలో ప్లస్, మైనస్ అనేవి వుంటాయి. కిస్ సినిమాకు ముందు చాలా మంది హీరో అంటే ఇలా వుండాలి. కమర్షియల్‌గా ఆలోచించాలి. అని నా మైండ్‌లో విషాన్ని నింపారు. అయితే ఆ తరువాత అదంతా అబద్ధమని తెలుసుకున్నాను. మన మనసుకు నచ్చింది చెయ్యాలని. ఈర్ష్యతో కాకుండా మంచి మనసుతో ఆలోచిస్తే మంచి జరుగుతుంది. మంచి కథలొస్తాయి. థియేటర్‌లో కూర్చుని పాప్‌కార్న్ తింటూ సినిమాని ఎంజాయ్ చేసే సాధారణ ప్రేక్షకుడిని నేను. ఏ సినిమాని కూడా విమర్శనాత్మ ధోరణితో చూడను. అదే నా బలం అని నమ్ముతాను. సినిమా నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని చెప్పేస్తాను. ఎవరు నా దృష్టిలో డీసెంట్ సినిమా. ఈ చిత్రాన్ని దాదాపు వెయ్యి మందికి చూపించాం. అందులో వెన్నెల కిషోర్ కూడా సినిమా చూశాడు. తెరమీద ఎంత ఫన్నీగా వుంటాడో తెరవెనుక అంత ఇంటలీజెంట్. అంతర్జాతీయ సినిమాల పట్ల కిషోర్‌కు మంచి నాలెడ్జ్ వుంది. తను సినిమా చూసి భలే కథ పట్టావ్ నెక్స్ లెవెల్ సినిమా ఇది అని నన్ను ఆత్మీయంగా కౌగిలించుకున్నాడు. అతనే నా తొలి విమర్శకుడు.

-సపోర్ట్ లేకుండా పైకి రావడం ఎవరికైనా అసాధ్యమే. కొంత మందికి తల్లిదండ్రులు సపోర్ట్‌గా నిలవొచ్చు. మరి కొంత మందికి పెద్ద నిర్మాతని కలిపించిన వాచ్‌మెన్ కావచ్చు. మీడియాతో పాటు నన్ను చిత్ర పరిశ్రమలోని చాలా మంది సపోర్ట్ చేశారు. మనం ఎలాంటి ఈగోలకు పోకుండా నిజాయితీగా వుంటే మనకు మంచే జరుగుతుంది.

మీలో ఈ ఆలోచనా ధోరణి ఎప్పటి నుంచి మొదలైంది?

-కిస్ నా కెరీర్‌లో అతిపెద్ద డిజాస్టర్. ఈ సినిమా పరాజయంతో పాటు నాకో విలువైన పాఠాన్ని నేర్పింది. ఈ సినిమా పోస్టర్లకు వాడిన మైదాపిండి ఖర్చుకూడా రాలేదు. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన నేను కిస్ సినిమాతో రెండు కోట్లు గొట్టుకున్నాను. ఆ సినిమా ఇచ్చిన షాక్‌తో హడలిపోయాను. ఆ సమయంలో నేను ఉంటున్న ఫ్లాట్‌కి పదివేలు అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. ఆ సమయంలో షేక్‌పేట్ నుంచి మెహదీపట్నం నడుచుకుంటూ వెళ్లాను. ఓ కార్ల షోరూమ్ దగ్గర ఆగాను. నాకు ఆ షోరూమ్‌లోని ఓ కారు నచ్చింది. నన్ను గమనించిన షోరూమ్ మేనేజర్ మీరు పంజాలో నటించారు కదా రండిసార్ లోపలికి అన్నాడు. కానీ నా దగ్గర ఆ కార్ బుక్ చేయడానికి అడ్వాన్స్ డబ్బులు లేవు. అయినా ఈ కార్‌ని బుక్ చేయోచ్చా అన్నాను. తను ఓకే అనగానే అప్పుడు అనిపించింది. నాలో ఏదో వుంది దాన్ని కరెక్ట్‌గా బయటికి తీయాలి అనుకున్నాను. అలా సినిమాల విషయంలో నా ఆలోచనా విధానాన్ని మార్చుకున్నాను.

మహేష్‌బాబు నిర్మాణంలో నటిస్తున్న మేజర్ ఎలా వుంటుంది?

-సెప్టెంబర్ 11 ముంబాయి దాడిలో మరణించిన ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. శశి కిరణ్ తిక్క దర్శకుడు. మహేష్‌బాబుతో కలిసి సోనీ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సెస్టెంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ఆ తరువాత గూఢచారి-2 వుంటుంది.

టూ స్టేట్స్ రీమేక్ అపేయడానికి కారణం?

-కథ అనుకున్న స్థాయిలో లేదు. కొంత షూటింగ్ చేసిన తరువాత బాగా రావడం లేదని ఆపేశాం. నేను కమిట్ అయిన చిత్రాలు పూర్త్తయిన తరువాత ఇదే టీమ్‌తో శివాత్మికతో కలిసి ఓ సినిమా చేయబోతున్నాను.

764

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles