గూఢచారి కథ ‘చాణక్య’

Sat,September 14, 2019 11:28 PM

‘రెండేళ్ల క్రితం దర్శకుడు తిరు ఈ కథ చెప్పాడు. బాగా నచ్చింది. అవసరమైన కొన్ని మార్పులు సూచించాను. అనుకున్న విధంగా స్క్రిప్ట్‌ అద్భుతంగా కుదిరింది. కథకు కావాల్సిన అన్ని హంగులతో నిర్మాతలు ఈ సినిమాను తెరకెక్కించారు’ అన్నారు గోపీచంద్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘చాణక్య’. తిరు దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. దసరా కానుకగా ప్రేక్షకులముందుకురానుంది. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో గోపీచంద్‌ మాట్లాడుతూ ‘స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. అత్యుత్తమ సాంకేతికతతో తెరకెక్కించాం. తెలుగు ప్రేక్షకులకు నవ్యానుభూతిని అందిస్తుంది’ అన్నారు. ‘ఇందులో గోపీచంద్‌ ఇండియన్‌ గూఢచారి ఏజెంట్‌గా కనిపిస్తాడు. ‘ప్రతి మనిషిలో ఇద్దరుంటారు. ఒకరు నిజం. మరొకరు అబద్ధం’ అని ట్రైలర్‌లో చెప్పిన డైలాగ్‌ మాదిరిగానే సినిమా ఆద్యంతం థ్రిల్లింగ్‌ అంశాలతో సాగుతుంది. దాదాపు ఏడేళ్లు ఈ కథపై శ్రమించాను.


ఈ సినిమా షూటింగ్‌ సందర్భంగా గోపీచంద్‌ గాయపడ్డారు. చికిత్సకోసం ఐసీయూలో జాయిన్‌ చేశారు. అయినా తొందరలోనే కోలుకొని అంకితభావంతో సినిమాను పూర్తిచేశారు. గూఢచారి థ్రిల్లర్‌ చిత్రాల్లో ప్రేక్షకులకు కొత్త ఫీల్‌ను అందించే చిత్రమిది’ అని దర్శకుడు తిరు చెప్పారు. అనిల్‌ సుంకర మాట్లాడుతూ ‘ఈ చిత్ర టీజర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. గోపీచంద్‌కు కొత్త ఇమేజ్‌ను తీసుకొస్తుంది’ అన్నారు. ఎత్తుకుపై ఎత్తులతో ఆద్యంతం రొమాంచితంగా సాగే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇదని మాటల రచయిత అబ్బూరి రవి చెప్పారు. సునీల్‌, నాజర్‌, జయప్రకాష్‌, రఘుబాబు, అలీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి, సంగీతం: విశాల్‌చంద్రశేఖర్‌, మాటలు: అబ్బూరి రవి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరు.

515

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles