భాగ్యనగరవీధుల్లో వినోదం

Mon,December 2, 2019 10:51 PM

శ్రీనివాసరెడ్డి, సత్య, షకలకశంకర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు’. ఈ సినిమా ద్వారా హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా పరిచయవుతున్నాడు. డిసెంబర్‌ 6న విడుదలకానుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక ఆదివారం జరిగింది. చిత్ర బ్యానర్‌ లోగోను దర్శకుడు అనిల్‌ రావిపూడి, టైటిల్‌ యానిమేషన్‌ను తమన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాత శ్రీనివాసరెడ్డి చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘రెండుగంటల పాటు సంపూర్ణ వినోదాన్ని అందించే చిత్రమిది. సినిమా చూసిన దిల్‌రాజు, శిరీష్‌..మరికొంతమంది చిన్న మార్పుల్ని సూచించారు. అవన్నీ మా సినిమాకు ఉపయోగపడ్డాయి.


చిన్న దొంగతనాలు చేసే ముగ్గురు వ్యక్తుల జీవితంలో ఎదురైన సంఘటనల నేపథ్యంలో ఆద్యంతం సరదాగా సాగిపోయే సినిమా ఇది’ అన్నారు. ‘రెండు తెలుగు రాష్ర్టాల్లో ఈ సినిమా గమ్మత్తు చేస్తుంది. చక్కటి కామెడీతో శ్రీనివాసరెడ్డి ఈ సినిమాను తెరకెక్కించాడు. వినోదంతో పాటు ప్రేమకథ కూడా ఉంటుంది. శ్రీనివాస్‌రెడ్డి, సత్య, షకలకశంకర్‌ కలయికలో వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని నిర్మాత పద్మనాభరెడ్డి చెప్పారు. దర్శకుడిగా శ్రీనివాసరెడ్డి తొలి ప్రయత్నం విజయవంతమవ్వాలని తమన్‌, అనిల్‌ రావిపూడి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

213

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles