మా అబ్బాయిని స్టార్‌హీరోగా చూడాలనుకున్నా!


Tue,August 13, 2019 11:46 PM

Bellamkonda Sai Srinivas and Bellamkonda Suresh Press Meet Rakshasudu Movie Collections

శ్రీనివాస్‌ను స్టార్ హీరో చేయాలనే ఆలోచనతో అతడితో భారీ బడ్జెట్ సినిమాల్ని చేశాను. అంతేకానీ అతడితో చిన్న సినిమాలు చేసే ఉద్దేశం నాకు లేదు. పెద్ద సినిమాల వల్లే అతడికంటూ మంచి మార్కెట్ ఏర్పడింది. హిందీ అనువాద మార్కెట్‌లో దక్షిణాది హీరోల్లో నంబర్‌వన్ కథానాయకుడిగా నిలిచాడు అని అన్నారు బెల్లంకొండ సురేష్. ఆయన తనయుడు శ్రీనివాస్ హీరోగా నటించిన చిత్రం రాక్షసుడు. రమేష్‌వర్మ దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో బెల్లంకొండ సురేష్, శ్రీనివాస్ పాత్రికేయులతో ముచ్చటించారు.

బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ రాక్షసుడు సినిమాలో పాటలు, పోరాట ఘట్టాలు పెట్టి చెడగొట్టకూడదనే పరిమిత బడ్జెట్‌లో రూపొందించాం. కథ కోసమే అలా చేశాం. అందువల్లే లాభాలు వస్తున్నాయి. ఇదివరకు శ్రీనివాస్‌ను నిర్మాత కొడుకుగానే చూసేవారు. ఈ సినిమాతో నటుడిగా అతడికి మంచి పేరొచ్చింది. రాక్షసుడు సినిమాకు 22 కోట్ల నిర్మాణ వ్యయం అయ్యింది. విడుదలకుముందే నైజాం, ఆంధ్రా, సీడెడ్ పంపిణీ హక్కుల రూపంలో 12 కోట్లు, హిందీ శాటిలైట్ 12 కోట్లు, తెలుగు శాటిలైట్ ఆరు కోట్లు మొత్తం ముప్ఫై కోట్ల బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికట్ రైట్స్ పన్నెండు కోట్లకు అమ్ముడయ్యాయి. వర్షం వల్ల సినిమాకు తొలివారంలో వసూళ్లు తగ్గాయి. రెండో వారం కలెక్షన్స్ బాగున్నాయి. తొలిరోజు వైజాగ్ షేర్ రెండు లక్షలు ఉంటే పదో రోజు ఇరవై లక్షల షేర్ వచ్చింది.

మల్టీప్లెక్స్‌లో ఈ సినిమా చక్కటి ఆదరణ లభిస్తున్నది. శ్రీనివాస్ నటించిన గత చిత్రాలు రెండు పరాజయం పాలయ్యాయి. ఇలాంటి టైమ్‌లో మా అబ్బాయికి రమేష్‌వర్మ మంచి సినిమా ఇచ్చాడు. రీమేక్ సినిమా చేయడం చాలా కష్టం. చాలా మంది చూసిన సినిమాను మళ్లీ తీసి ప్రేక్షకుల్ని మెప్పించడం సులభం కాదు. అద్భుతంగా సినిమా తీయడంలో చిత్రబృందం విజయవంతమయ్యారు. మధ్యతరగతి కుర్రాడి పాత్రలో శ్రీనివాస్ ఒదిగిపోయాడు. శ్రీనివాస్‌కు ఈ సినిమా మంచి పేరుతెచ్చిపెట్టడం ఆనందంగా ఉంది. అల్లుడుశీను తరహాలో ఎంటర్‌టైన్‌మెంట్, పాటలతో కూడిన పక్కా కమర్షియల్ కథ దొరికితే మా సంస్థలో శ్రీనివాస్‌తో సినిమా చేస్తాను. మా చిన్న అబ్బాయి గణేష్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాను. కథ సిద్ధం అవుతోంది. రాక్షసుడు తర్వాత విజయం వచ్చింది అనే భయం మొదలైంది. అందుకే విరామం తీసుకొని మంచికథతో శ్రీనివాస్ తదుపరి సినిమా చేయబోతున్నాం. తండ్రిగా శ్రీనివాస్ పెళ్లి చేసే బాధ్యత నాపై ఉంది. అతడి కోసం మంచి అమ్మాయిని వెతుకుతున్నాం అన్నారు.

ఈరోజు కోసం ఎదురుచూశా - శ్రీనివాస్

వ్యక్తిగతంగా నేను బాగా నమ్మి చేసిన సినిమా ఇది. పదో రోజున పంపిణీదారులు సేఫ్‌జోన్‌కు చేరుకోవడం నటుడిగా సంతోషాన్నిచ్చింది. ఇలాంటి క్షణాల కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను. కవచంలో కమర్షియల్ పోలీస్ పాత్ర చేశాను. దానితో పోలిస్తే ఇందులో చేసిన అరుణ్ అనే పోలీస్ పాత్ర ఛాలెజింగ్‌గా అనిపించింది. ఫైట్స్, డ్యాన్సులు లేకుండా కేవలం నటనతోనే మెప్పించడానికి కష్టపడాల్సివచ్చింది. కమర్షియల్ సినిమాల స్థాయిలో పెద్ద మొత్తంలో వసూళ్లను సాధిస్తున్నది. అభిమానుల్ని, తెలుగు ప్రేక్షకుల్ని ఈ సినిమాతో మెప్పించడం అచీవ్‌మెంట్‌గా భావిస్తున్నాను. నటించడం సులభమని అందరూ అనుకుంటారు. కానీ ఈజీ జాబ్ కాదు. హీరోగా ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. నటుడిగా మంచి పేరు తెచ్చుకొని పది మంది మెప్పిస్తే నాన్న ఎక్కువ సంతోషపడతారు. అది సినిమాతో అది సాధ్యమైంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్‌వర్మ, మల్టీడైమెన్షన్ వాసు పాల్గొన్నారు. రాక్షసుడు విజయోత్సవాన్ని పురస్కరించుకొని ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్, ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్‌లకు ఐదు లక్షల చొప్పున మొత్తం 10లక్షల చెక్కును బెల్లంకొండ సురేష్, శ్రీనివాస్ అందజేశారు.

987

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles