- హెచ్‌డీఎఫ్‌సీతో జతకట్టిన వాల్‌మార్ట్
హైదరాబాద్, డిసెంబర్ 2: అమెరికాకు చెందిన రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ఇండియా.. బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో జతకట్టింది. ఈ ఒప్పందంలో భాగంగా హోల్‌సేల్ ‘బీ2బీ క్యాష్ అండ్ క్వారీ’ సేవలు అందిస్తున్న బెస్ట్ ప్రైస్ వినియోగదారులకు క్రెడిట్ కార్డును అందించనున్నది.ఈ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వస్తువులపై 18 రోజుల నుంచి 50 రోజుల వరకు ఎప్పుడైనా చెల్లింపులు జరుపవచ్చునని వాల్‌మార్ట్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో క్రిశ్ అయర్ తెలిపారు. హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 26 హోల్‌సేల్ స్టోర్లలో ఒకేసారి ఈ కార్డును విడుదల చేసినట్లు చెప్పారు. బెస్ట్ ప్రైస్ ఖాతాదారులకు ఆర్థికంగా ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు, ఈ కార్డు తీసుకున్న వారు ఎంతైన షాపింగ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు.
మరోవైపు వ్యాపార విస్తరణలో భాగంగా ఏపీలోని కర్నూల్లో ఏర్పాటు చేసిన హోల్‌సేల్ స్టోర్‌ను వచ్చే వారంలో ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆర్థిక మందగమన పరిస్థితులు ఉన్నప్పటికీ దేశీయ రిటైల్ రంగం అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకుంటున్నదని, ప్రపంచ మార్కెట్లో భారత్ అన్ని విభాగాల్లో దూసుకుపోతున్నదన్నారు. ఈ కో-బ్రాండెడ్ కార్డుపై రివార్డులు, క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభించనున్నదని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రతినిధి పరాగ్ రావు తెలిపారు. రెండు రకాల్లో లభించనున్న ఈ కార్డుపై ఏడాదికి రూ.1,000 వరకు ఫీజును వసూలు చేస్తున్నట్లు చెప్పారు.