పెట్టుబడులను ఆకట్టుకోవడానికే కార్పొరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించాం..

Tue,December 3, 2019 12:42 AM

- లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌


న్యూఢిల్లీ, డిసెంబర్‌ 2: పెట్టుబడులను ఆకట్టుకోవడానికి, భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కార్పొరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభకు వెల్లడించారు. అంతర్జాతీయ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో తప్పనిపరిస్థితుల్లో ఈ కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, అమెరికా-చైనా దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధంలో అక్కడి కంపెనీలు తమ ప్లాంట్లను ఇతర దేశాలకు తరలించేయోచనలో ఉన్న ప్రస్తుత తరుణంలో కార్పొరేట్‌ ట్యాక్స్‌ను పది శాతం వరకు తగ్గించినట్లు మంత్రి చెప్పారు. పన్ను చట్టాల సవరణ బిల్లుకు సోమవారం పార్లమెంట్‌ ఆమోదం పొందిన నేపథ్యంలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. కార్పొరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించిన కేంద్ర ప్రభుత్వం..నూతన తయారీ కంపెనీలపై విధించే పన్నును 15 శాతానికి పరిమితం చేసింది. పొరుగు దేశాల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడంతోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాలు కార్పొరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడంతో భారత ప్రభుత్వం కూడా 34.94 శాతంగా ఉన్న పన్నును 25.17 శాతానికి తగ్గించినట్లు చెప్పారు.

5 శాతం పెరిగిన పన్ను వసూళ్లు

కార్పొరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించినప్పటికీ గత నెల చివరినాటికి దేశీయ స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 5 శాతం వృద్ధి నమోదైందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ట్యాక్స్‌ను తగ్గించడం వల్ల ఆదాయం కోల్పోనున్నట్లు వచ్చిన భయాలను మంత్రి తోసిపుచ్చారు. పన్ను వసూళ్లు తగ్గలేదు కానీ, ఐదు శాతం చొప్పున పెరిగాయని, గత త్రైమాసికంలోనే అత్యధికంగా వసూలైనట్లు సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఇంధనాలపై పన్నులను తగ్గించం..

పెట్రోల్‌, డీజిల్‌లపై సుంకాలను తగ్గించే ప్రతిపాదనేది ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టంచేశారు. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు క్రమంగా పెరుగుతుండటం వల్లనే దేశీయంగా అధికమవుతున్నాయని లోక్‌సభలో మంత్రి వెల్లడించారు. పెట్రోల్‌, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకోస్తారా అని అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ..దీనిపై చర్చలు జరుగుతున్నాయని, ఈ రెండు ఇంధనాలపై ఎలాంటి జీఎస్టీని విధించడం లేదని, రేట్లను మాత్రం జీఎస్టీ కౌన్సిల్‌ తుది నిర్ణయం తీసుకోనున్నదని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కౌన్సిల్‌లో అన్ని రాష్ర్టాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉన్నారు. ఈ రెండు ఇంధనాలపై కేంద్రం సెంట్రల్‌ ఎక్సైజ్‌, కస్టమ్స్‌ పన్నులను వసూలు చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వాలు లెవీ ట్యాక్స్‌ను విధిస్తున్నాయి.

259
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles