ఆఖరులో ఆగమాగం

Tue,October 8, 2019 01:52 AM

-లాభాల స్వీకరణలో మదుపరులు
-అమ్మకాల ఒత్తిడిలో ఫార్మా, ఐటీ, ఆటో షేర్లు

ముంబై, అక్టోబర్ 7: దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య సోమవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 141.33 పాయింట్లు కోల్పోయి 37,531.98 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 48.35 పాయింట్లు పడిపోయి 11,126.40 వద్ద నిలిచింది. ట్రేడింగ్ సెషన్ ఆఖరి గంటలో ఐటీ, ఔషధ, ఎఫ్‌ఎంసీజీ, ఆర్థిక, చమురు రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనైయ్యాయి. మదుపరులు లాభాల స్వీకరణకు దిగడం.. మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని ట్రేడింగ్ సరళిని నిపుణులు విశ్లేషిస్తున్నారు. క్యాపిటల్ గూడ్స్, మెటల్, రియల్టీ, పవర్, ఎనర్జీ, ఆటో రంగాల షేర్లూ నష్టాలకే పరిమితమైయ్యాయి. 2.43 శాతం వరకు ఈ రంగాల షేర్లన్నీ క్షీణించాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, టెలికం, బ్యాంకింగ్ రంగాల షేర్లు 1.06 శాతం పెరిగినా ఫలితం లేకపోయింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు 0.75 శాతం వరకు దిగజారాయి. ఓఎన్జీసీ, ఐటీసీ, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్, ఎల్‌అండ్‌టీ, టీసీఎస్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు 2.97 శాతం మేర నష్టపోయాయి.

గ్లెన్‌మార్క్ షేర్ విలువ ఏకంగా 9 శాతానికిపైగా పతనమైంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని తయారీ కేంద్రానికి అమెరికా హెల్త్ రెగ్యులేటర్ (యూఎస్‌ఎఫ్‌డీఏ) హెచ్చరికలు రావడంతో షేర్ విలువ ప్రభావితమైంది. యూఎస్‌ఎఫ్‌డీఏ పరిశీలన నోటీసులతో అరబిందో ఫార్మా షేర్ కూడా 19 శాతానికిపైగా పడిపోయింది. ఈ క్రమంలో లుపిన్ (2.69 శాతం), సిప్లా (2.35 శాతం), సన్ ఫార్మా (1.57 శాతం) చొప్పున నష్టపోయాయి. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ బీపీసీఎల్ షేర్ విలువ 4 శాతానికిపైగా పడిపోగా, మార్కెట్ విలువ రూ.5,300 కోట్లకుపైగా ఆవిరైపోయింది. ఇక అంతర్జాతీయంగా ఆసియా, ఐరోపా మార్కెట్లూ నష్టాలకే పరిమితమయ్యాయి.

మెరిసిన బ్యాంకింగ్ షేర్లు

బ్యాంకింగ్ షేర్లకు మదుపరులు బ్రహ్మరథం పట్టారు. యెస్ బ్యాంక్ షేర్ విలువ 8 శాతానికిపైగా పుంజుకున్నది. రూ.45.60 వద్దకు చేరింది. బ్యాంక్‌లోకి కొత్త పెట్టుబడులు రానున్నాయన్న అంచనాలు మదుపరులను మెప్పించాయి. యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఫైనాన్స్ షేర్ల విలువ కూడా 2.53 శాతం పెరిగింది. అయితే డిపాజిటరీ సీడీఎస్‌ఎల్ దెబ్బకు డీహెచ్‌ఎఫ్‌ఎల్ షేర్ విలువ 7.52 శాతం దిగజారింది. ఆర్థిక ఫలితాల ప్రకటన ఆలస్యం కావడంతో ప్రమోటర్ల వాటాలను స్తంభింపజేసింది.

రీట్‌లపై విదేశీ మదుపరుల ఆసక్తి

రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్ (ఆర్‌ఈఐటీ లేదా రీట్), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్‌లపై విదేశీ మదుపరులు ఆసక్తిని చూపిస్తున్నారని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్మన్ అజయ్ త్యాగీ తెలిపారు. అమెరికాలో గత వారం చాలామంది విదేశీ మదుపరులను కలిశామని, సెబీ నిర్ణయాలను వారు స్వాగతించారని చెప్పారు. గత నెల 30 నుంచి ఈ నెల 4 వరకు న్యూయార్క్, బోస్టన్, వాషింగ్టన్ డీసీల్లో అక్కడి పరిశ్రమ, పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించినట్లు ఓ ప్రకటనలో త్యాగీ తెలియజేశారు. రీట్, ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్‌ల్లో 10 బిలియన్ డాలర్లకుపైగా ఆస్తులున్నాయి.

currency

6 రోజుల్లో రూ.6.21 లక్షల కోట్లు మటాష్

భారతీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల్లో కొట్టుమిట్టాడుతుండటంతో మదుపరుల సంపద లక్షల కోట్ల రూపాయల్లో ఆవిరైపోతున్నది. గడిచిన ఆరు సెషన్లలో సూచీలు నష్టాలకే పరిమితమవగా, బీఎస్‌ఈలోని మదుపరుల సంపద ఈ ఆరు రోజుల్లో రూ.6.21 లక్షల కోట్లు హరించుకుపోయింది. సెప్టెంబర్ 26న రూ.1,48,45,854.70 కోట్లుగా ఉన్న బీఎస్‌ఈలోని సంస్థల విలువ.. అక్టోబర్ 7 (సోమవారం)న రూ.1,42,24,897.46 కోట్లకు తగ్గింది. అంతర్జాతీయ ఆర్థిక ప్రతికూల సంకేతాలు, దేశీయ ఆర్థిక మందగమనం ప్రభావం స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తున్నదని నిపుణులు అంటున్నారు.
ForSensex2

386
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles