మార్కెట్లను కమ్మేసిన నష్టాలు

Tue,July 23, 2019 03:41 AM

Sensex falls 306 points to close at 38031 Nifty down 82 points HDFC

-సెన్సెక్స్ 306, నిఫ్టీ 82 పాయింట్లు పతనం
-మూడు రోజుల్లో 1,184, 350 చొప్పున క్షీణత
-లాభాల స్వీకరణలో మదుపరులు, అమ్మకాల ఒత్తిడిలో షేర్లు

ముంబై, జూలై 22: దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. వరుసగా మూడో రోజూ సూచీలు నష్టాలకే పరిమితమైయ్యాయి. సోమవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 306 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 82 పాయింట్ల మేర కోల్పోయాయి. అంతర్జాతీయ బలహీన సంకేతాల మధ్య హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లతోపాటు ఎఫ్‌ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనైయ్యాయి. దీంతో సెన్సెక్స్ 305.88 పాయింట్లు లేదా 0.80 శాతం పతనమై 38,031.13 వద్ద ముగిసింది. ఫలితంగా రెండు నెలలకుపైగా కనిష్ఠాన్ని తాకినైట్లెంది. ఈ ఏడాది మే 17 దగ్గర్నుంచి ఈ స్థాయికి సెన్సెక్స్ దిగజారిన దాఖలాలు లేవు. ఇక నిఫ్టీ కూడా 82.10 పాయింట్లు లేదా 0.72 శాతం క్షీణించి 11,337.15 వద్ద స్థిరపడింది. యెస్ బ్యాంక్ షేర్ విలువ ఏకంగా 9.49 శాతం, వేదాంత, ఆర్‌ఐఎల్, ఏషియన్ పెయింట్స్, మారుతి సుజుకీ, సన్ ఫార్మా షేర్ల విలువ 3.85 శాతం మేర పెరిగినా ఫలితం లేకపోయింది.

ఇక గత మూడు రోజుల (గురు, శుక్ర, సోమవారం) నుంచి సెన్సెక్స్ 1,184.15 పాయింట్లు లేదా 3.05 శాతం, నిఫ్టీ 350 పాయింట్లు లేదా 3.03 శాతం మేర నష్టపోయాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపరులు (ఎఫ్‌పీఐ) పెట్టుబడులను వెనుకకు తీసుకుంటుండటం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పడిపోతుండటంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిన్నదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్, దక్షిణ కొరియా, జపాన్ సూచీలూ నష్టాల్లోనే ముగిశాయి. రాబోయే ద్రవ్యసమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు లేకపోవడం మార్కెట్లను పతనం వైపునకు నడిపించింది.

ఆకట్టుకోని హెచ్‌డీఎఫ్‌సీ

మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ) ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పెరిగినట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రకటించడంతో దాని షేర్ విలువ 3.32 శాతం పడిపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ షేర్ విలువ కూడా 5.09 శాతం ఆవిరైంది. లాభాలు పెరిగినా.. ఎన్‌పీఏలు పెరిగాయన్న వార్తతో మదుపరులు షేర్ల అమ్మకాలకు తెగబడ్డారు. హెచ్‌డీఎఫ్‌సీ సెగ కొటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్‌లకూ తాకింది. వీటి షేర్ల విలువా 3.08 శాతం, 2.21 శాతం మేర దిగజారాయి. అలాగే హెచ్‌యూఎల్, ఐటీసీ, పవర్‌గ్రిడ్, ఎల్‌అండ్‌టీ, టెక్ మహీంద్రా షేర్లు సైతం 2.67 శాతం నుంచి 1.15 శాతం వరకు విలువను నష్టపోయాయి.


3 రోజుల్లో రూ.4 లక్షల కోట్లకుపైగా మదుపరుల సంపద ఆవిరి

స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలు.. మదుపరుల సంపదను రూ.లక్షల కోట్లలో ఆవిరి చేస్తున్నది. గత మూడు రోజుల్లో సెన్సెక్స్ 1,184 పాయింట్లు కోల్పోగా, బీఎస్‌ఈ మదుపరుల సంపద రూ.4 లక్షల కోట్లకుపైగా హరించుకుపోయింది. గురువారం నుంచి రూ.4,37,602.4 కోట్లు క్షీణించి రూ.1,44,76,204.02 కోట్లకు పరిమితమైంది. మరోవైపు కేంద్ర బడ్జెట్ ప్రకటన దగ్గర్నుంచి మార్కెట్ విలువ రూ.6.01 లక్షల కోట్లు తరిగిపోయింది. విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపరులు అమ్మకాలకు దిగుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. బడ్జెట్‌లో మోదీ సర్కారు సూపర్ రిచ్ ట్యాక్స్ (అపర కుబేరుల పన్ను)ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 5న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను లోక్‌సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి విదితమే.

286
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles