ఎన్టీపీసీకి జోష్

Sat,November 9, 2019 11:55 PM

-జూలై-సెప్టెంబర్‌లో రూ.3,409 కోట్ల లాభం
-గతంతో పోల్చితే 38% శాతం వృద్ధి

న్యూఢిల్లీ, నవంబర్ 9: ప్రభుత్వ రంగ విద్యుదుత్పాదక దిగ్గజం ఎన్టీపీసీ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో గతంతో పోల్చితే దాదాపు 38 శాతం ఎగిసింది. రూ.3,408.92 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) ఇదే వ్యవధిలో రూ.2,477.28 కోట్లుగా ఉన్నదని శనివారం సంస్థ ప్రకటించింది. ఆదాయం పెరుగడం వల్లే లాభాలు కూడా పెరిగాయని వివరించింది. ఈసారి ఆదాయం రూ.26,274.66 కోట్లుగా ఉంటే, పోయినసారి ఆదాయం రూ.23,566.65 కోట్లుగా ఉన్నదని బాంబే స్టాక్ ఎక్సేంజ్‌కు ఎన్టీపీసీ తెలిపింది.

అమర రాజా బ్యాటరీస్

అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో మునుపెన్నడూ లేనివిధంగా రూ.218.85 కోట్ల పన్ను అనంతర లాభాలను ప్రకటించింది. ఈసారి నికర ఆదాయం రూ.1,695.31 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. గతేడాది ఇదే వ్యవధిలో రూ.1,753.05 కోట్ల ఆదాయాన్ని పొందిన సంస్థ.. రూ.120.23 కోట్ల లాభాలకే పరిమితమైంది. కాగా, శనివారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ ఆర్థిక సంవత్సరానికిగాను రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేర్‌పై 6 రూపాయల మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వాలని నిర్ణయించారు.

ఆయిల్ ఇండియా

ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ నికర లాభం గతంతో పోల్చితే ఈ జూలై-సెప్టెంబర్ కాలంలో 27.2 శాతం క్షీణించింది. రూ.627.23 కోట్లుగా నమోదైంది. నిరుడు ఇదే సమయంలో రూ.862.01 కోట్ల లాభాన్ని అందుకున్నది. ఆదాయం ఈసారి రూ.3,481.52 కోట్లుగా ఉంటే, క్రిందటిసారి రూ.4,031.41 కోట్లుగా ఉన్నదని శనివారం కంపెనీ ప్రకటించింది.

ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్

ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ లిమిటెడ్ ఏకీకృత నికర లాభం ఏకంగా నాలుగింతలైంది. ఈ సెప్టెంబర్ 30తో ముగిసిన మూడు నెలల్లో రూ.301.16 కోట్లను పొందింది. నిరుడు రూ.75.91 కోట్లుగానే ఉన్నది. ఆదాయం ఈసారి రూ.1,101.9 కోట్లుగా ఉండగా, పోయినసారి రూ.1,059.71 కోట్లుగా ఉన్నదని శనివారం సంస్థ తెలిపింది.

260
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles