అలా కుదరదు

Tue,December 3, 2019 12:44 AM

-క్లయింట్ల పవర్ ఆఫ్ అటార్నీ వినియోగంపై కార్వీకి తేల్చిచెప్పిన సెబీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: తమ క్లయింట్ల పవర్ ఆఫ్ అటార్నీని వినియోగించుకుంటామన్న కార్వీ అభ్యర్థనను మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ ఖండించింది. సొంత అవసరాల కోసం క్లయింట్ల సెక్యూరిటీలను తాకట్టు పెట్టిందన్న ఆరోపణల్ని కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్) ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ హైదరాబాద్ ఆధారిత సంస్థను స్టాక్ బ్రోకింగ్ కార్యకలాపాల నుంచి సెబీ బహిష్కరించిన సంగతీ విదితమే. అయితే క్లయింట్లు జరిపిన లావాదేవీల సెటిల్మెంట్ల కోసం పవర్ ఆఫ్ అటార్నీ వాడుకుంటామంటూ సెక్యూరిటీస్ అప్పీలెట్ ట్రిబ్యునల్ (శాట్)ను కార్వీ ఆశ్రయించింది. అంతకుముందు కూడా ఈ విషయమై సెబీని కార్వీ సంప్రదించింది. ఈ క్రమంలో దీనిపై స్పష్టత ఇవ్వాలని సెబీకి శాట్ సూచించగా, పవర్ ఆఫ్ అటార్నీలను వాడుకోవడం కుదరదని స్పష్టం చేసింది. అంతేగాక కేసు పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత 95 వేలకుపైగా క్లయింట్లకు చెందిన రూ.2,300 కోట్ల విలువైన సెక్యూరిటీలను కార్వీ అక్రమంగా బదిలీ చేసిందని గుర్తించినట్లు తెలిపింది.

రహస్య ఖాతా

బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్‌ఈ)పై తన పేరున ఉన్న ఓ డీమ్యాట్ ఎకౌంట్‌లోకి క్లయింట్ల సెక్యూరిటీలను కార్వీ బదిలీ చేసిందని సెబీ వివరించింది. ఈ ఖాతా వివరాలను ఎప్పుడూ కార్వీ బయటపెట్టలేదని కూడా అన్నది. ఈ సెక్యూరిటీలను తమవిగా చూపి రూ.600 కోట్ల రుణాలను పొందినట్లు చెప్పింది. పూర్తిగా చెల్లించిన క్లయింట్ల సెక్యూరిటీలనూ తమ సొంత/గ్రూప్ సంస్థల కోసం వాడుకోవడానికి నిధుల సమీకరణార్థం తాకట్టు పెట్టారని వివరించింది. ఈ నేపథ్యంలో కార్వీని నమ్మలేమని సెబీ గత శుక్రవారం రాత్రి పొద్దుపోయాక విడుదల చేసిన ఓ ఆదేశంలో తేల్చిచెప్పింది.

డీఐఎస్‌ల ద్వారా..

ఇదిలావుంటే తమ సెక్యూరిటీలను బ్రోకర్ ద్వారా అమ్ముకోవాలని భావించే కార్వీ క్లయింట్లు.. ఎలక్ట్రానిక్ లేదా భౌతిక డెలివరీ ఇన్‌స్ట్రక్షన్ స్లిప్ (డీఐఎస్)లను మాత్రం వినియోగించుకునే వీలుందని సెబీ ఈ సందర్భంగా తెలియజేసింది. కాగా, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ).. కార్వీపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ జరుపుతున్నదని సెబీ ప్రకటించింది. క్లయింట్ల నిధులను దుర్వినియోగం చేయడమేగాక, తమ ఆదేశాల అనంతరం కూడా సంస్థ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిందని సెబీ మండిపడింది.

లైసెన్స్ నిలుపుదల

కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ట్రేడింగ్ లైసెన్స్‌ను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు సోమవారం సస్పెండ్ చేశాయి. నిబంధనల అతిక్రమణకుగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టాక్ ఎక్సేంజీలు ప్రకటించాయి. ఎక్సేంజీల నిబంధనలను పాటించనందుకుగాను డిసెంబర్ 2, 2019 నుంచి కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌పై నిషేధం విధిస్తున్నాం అని వేర్వేరు ప్రకటనల్లో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు తెలియజేశాయి. మరోవైపు కార్వీపై సెబీ తీసుకున్న చర్యలతో 90 శాతం క్లయింట్ల సెక్యూరిటీలు సురక్షితంగా ఉన్నాయి. దాదాపు 83 వేల మంది ఇన్వెస్టర్లు తమ సెక్యూరిటీలను తిరిగి పొందగలిగారు.

416
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles