భారత్‌కు మూడీస్ షాక్

Sat,November 9, 2019 02:34 AM

-రేటింగ్‌ను నిలకడ నుంచి ప్రతికూలానికి తగ్గింపు
-భవిష్యత్తులో మరింత పతనమయ్యే అవకాశం

న్యూఢిల్లీ, నవంబర్ 8: ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్.. భారత్‌కు గట్టి షాకిచ్చింది. ఇప్పటి వరకు దేశ ఆర్థిక వ్యవస్థ రేటింగ్‌ను నిలకడగా ఇచ్చిన మూడీస్.. దీనిని ప్రతికూలానికి తగ్గించింది. గతంలో పోలిస్తే ఆర్థిక వ్యవస్థ వృద్ధి మరింత క్షీణించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. విదేశీ కరెన్సీ రేటింగ్‌ను బీఏఏ2-కి తగ్గించింది. పెట్టుబడులకు సంబంధించిన మూడీస్ ఇచ్చే రేటింగ్‌లో ఇదే రెండో అత్యల్పం. వచ్చే మార్చినాటికి ద్రవ్యలోటు 3.7 శాతంగా ఉంటుందని అంచనావేసిన మూడీస్..ప్రభుత్వం నిర్దేశించుకున్న 3.3 శాతం లక్ష్యం కంటే అధికం. మందగమన పరిస్థితులకు తోడు కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు పడిపోవడంపై ఆందోళన వ్యక్తంచేసింది. ఆర్థిక, సంస్థాగత బలహీనతల్ని పరిష్కరించడంలో మూడీస్ అంచనావేసిన దానికంటే ప్రభుత్వం నెమ్మదిగా స్పందిస్తున్నదని అభిప్రాయపడింది.

ఇదిలాగే కొనసాగితే ఇప్పటికే తీవ్ర స్థాయిలో చేరుకున్న అప్పుల భారం మరింత పెరిగే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. ప్రస్తుతం నెలకొన్న చర్యలు వృద్ధిరేటు మందగమన సమస్యనుపరిష్కరించేలా ఉండాలని స్పష్టంచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత వృద్ధి ఆరేండ్ల కనిష్ఠ స్థాయి 5 శాతానికి పడిపోయిన విషయం తెలిసిదే. అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ఒడిదుడుకులు, మందగించిన ఉద్యోగ కల్పన బ్యాంకింగేతర రంగాల్లో నెలకొన్న సంక్షోభాన్ని అధిగమించేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించిన మూడీస్.. రిటైల్, వాహన పరిశ్రమ, గృహాలు, భారీ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సూచించింది. వాణిజ్య పెట్టుబడులు, పెంచే వృద్దిని మరింత వేగంగా పరుగులు పెట్టించే సంస్కరణలు అవకాశాలు తగ్గిపోయాయని మూడీస్ అభిప్రాయపడింది. అయినప్పటికీ మరో రెండు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలైన ఫిచ్, ఎస్ అండ్ పీలు మాత్రం భారత వృద్ధిని నిలకడగా ఉంచాయి.

విదేశీ పెట్టుబడులపై ప్రభావం..

విదేశీ పెట్టుబడులను ఆకట్టుకుంటున్న ప్రస్తుత తరుణంలో మూడీస్ ఇచ్చిన రేటింగ్ దెబ్బకు ఈ పెట్టుబడులు నిలిచిపోయే ప్రమాదం ఉన్నదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగా ఉన్నప్పటికీ..భవిష్యత్తుపై మూడీస్ ఆందోళన వ్యక్తంచేయడం పెట్టుబడిదారుల్లో ఆందోళనకు కారణంకానున్నది. భారత్‌లో పెట్టుబడులకు సరైన సమయం ఇదేనని ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ ఇన్వెస్టర్లను కోరుతున్న ప్రస్తుత తరుణంలో ఈ ప్రయత్నాలు బెడిసికొట్టే అవకాశాలున్నాయి.

మెరుగ్గానే ఉన్నాం: కేంద్రం

మూడీస్ రేటింగ్‌పై కేంద్ర ఆర్తిక మంత్రిత్వ శాఖ స్పందించింది. దేశ ఆర్థిక పునాదులు బలంగానే ఉన్నాయని మరోమారు స్పష్టంచేసింది. ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నదని, స్వల్ప, మధ్యకాలిక వృద్ధికి భారత్‌లో మెరుగైన అవకాశాలున్నాయని ఒక ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయంగా నెలకొన్న మందగమన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని భారత్ అనేక చర్యలు చేపట్టిందని తెలిపింది. దీంతో భారత్‌లో పెట్టుబడులు అవకాశాలు పెరిగాయని, ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ స్థితి మెరుగ్గానే ఉన్నదని వెల్లడించింది. ప్రస్తుత సంవత్సరంలో 6.1 శాతానికి, వచ్చే ఏడాది 7 శాతానికి పెరిగే అవకాశం ఉన్నదని ఇటీవల ఐఎంఎఫ్ విడుదల చేసిన నివేదికను ఇందుకు ఉదాహరించింది. పడిపోతున్న దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాన్ని ఆదుకోవడానికి ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించిన కేంద్రం..కార్పొరేట్ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే.

514
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles