మరో నాలుగు పట్టణాల్లో ఎల్‌ఆర్‌ఎస్!

Sat,November 9, 2019 12:53 AM

-కాకతీయ, సిద్దిపేట, శాతవాహన, స్తంభాద్రి పరిధిలో క్రమబద్ధీకరణ
-రెండురోజుల్లో జీవో విడుదలయ్యే అవకాశం

హైదరాబాద్/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని నాలుగు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్)ను అమల్లోకి తెచ్చేందుకు పురపాలకశాఖ నిర్ణయించినట్టు సమాచారం. కాకతీయ, సిద్దిపేట, శాతవాహన, స్తంభాద్రి పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్‌కు అనుమతి ఇవ్వనున్నట్టు తెలిసింది. వరంగల్, సిద్దిపేట, కరీంనగర్, ఖమ్మం జిల్లాల పరిధిలో ఉన్న ఈ నాలుగు పట్టణాభివృద్ధి సంస్థల్లో 2018 మార్చి 30 కంటే ముందు కొనుగోలుచేసిన ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని వర్తింపజేస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి రెండురోజుల్లో జీవో విడుదలయ్యే అవకాశమున్నది. ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తుకు తొంభై రోజుల గడువు ఇవ్వనున్నట్టు సమాచారం. కోర్టు కేసులు పరిష్కారమైన వెంచర్లలో ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లోనూ ఈ అవకాశం కల్పించనున్నట్టు సమాచారం. వివాదాల్లో ఉన్న వెంచర్లలో ప్లాటు ్ల కొనుగోలు చేసినవారు ఇల్లు కట్టుకుందామంటే స్థానిక సంస్థలు అనుమతి ఇవ్వడం లేదు. బ్యాంకుల నుంచీ రుణం మంజూరు కావడం లేదు. ఇలాంటి వెంచర్లు రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో ఉన్నాయని గుర్తించిన పురపాలకశాఖ కేసులు పరిష్కారమైన లే అవుట్లలో ప్లాట్లకు క్రమబద్ధీకరణ అవకాశం కల్పించాలని నిర్ణయించినట్టు సమాచారం.

11 నుంచి పెండింగ్ దరఖాస్తుల పరిశీలన

హెచ్‌ఎండీఏ పరిధిలో పెండింగ్‌లో ఉన్న దాదాపు 36 వేల ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను డిసెంబర్ 31 వరకు పరిష్కరించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. సంస్థ పరిధిలో 1,75,973 మంది ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తులు చేసుకోగా దాదాపు లక్ష దరఖాస్తులకు హెచ్‌ఎండీఏ అనుమతులు ఇచ్చింది. వివిధ కారణాలతో మిగిలిన వాటిని తిరస్కరించారు. ఈ పథకం ద్వారా సంస్థ రూ.1,050 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నది. అయితే, పరిశీలించని దరఖాస్తులు 18వేలు ఉండగా, వివిధ కారణాలతో షార్ట్‌ఫాల్‌లో 17 వేలు, పేమెంట్ చేసి ఫైనల్ ప్రొసీడింగ్స్ జారీచేయాల్సిన దరఖాస్తులు వెయ్యి వరకు ఉన్నాయి. వీటిని ఈనెల 11 నుంచి పరిశీలించాలని శుక్రవారం తార్నాకలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్లానింగ్ విభాగం అధికారుల సమావేశంలో నిర్ణయించారు. ఈ దరఖాస్తులను పరిష్కరించడం ద్వారా సంస్థ ఖజానాలోకి ఎల్‌ఆర్‌ఎస్ రూపంలో మరో రూ. 50 కోట్ల మేర రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, నిర్ణీత గడువులోగా రూ.10వేల ఫీజు చెల్లించని వారి దరఖాస్తుల విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

173
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles