నేనంటే.. నేనే!

Thu,July 11, 2019 03:19 AM

IndiGo promoters spat Rahul Bhatia counters Rakesh Gangwal

రాహుల్ భాటియా వర్సెస్ రాకేష్ గంగ్వాల్
ఇండిగో ప్రమోటర్ల మధ్య ముదిరిన వివాదం


న్యూఢిల్లీ, జూలై 10:ఏమైందీ విమానయాన రంగానికి. ఓ వైపు సంక్షోభాలు.. మరోవైపు విభేదాలు. దేశీయ విమానయాన రంగం గురించి ఆందోళన చెందాల్సిన పరిస్థితులే ఉన్నాయి మరి. ప్రపంచ విమానయాన రంగంలో వేగంగా వృద్ధి చెందుతున్న భారత్‌ను సంక్షోభాలు, విభేదాలు, అప్పులు వేధిస్తున్నాయిప్పుడు. భారతీయ ప్రైవేట్ రంగ విమానయాన దిగ్గజంగా వెలుగొందిన జెట్ ఎయిర్‌వేస్ రుణ సంక్షోభం దెబ్బ మానకముందే.. మరో దిగ్గజ సంస్థ ఇండిగోలో విభేదాలు భగ్గుమన్నాయి. ప్రమోటర్ల మధ్య గొడవలు తారాస్థాయికి చేరి.. సెబీదాకా వెళ్లాయి. సంస్థ వ్యవస్థాపకులు రాహుల్ భాటియా, రాకేశ్ గంగ్వాల్‌ల నడుమ దాదాపు పదిహేనేండ్ల భాగస్వామ్యానికి బీటలు పడ్డాయి.

2005నుంచి కలిసి..

ఇండిగోలో భాటియాకు చెందిన ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్‌కు మెజారిటీ వాటా ఉన్నది. భాటియా, ఆయన కుటుంబానికి ప్రస్తుతం 38 శాతానికిపైగా వాటా ఉండగా, ఎన్నారై గంగ్వాల్, ఆయన బంధువర్గానికి 37 శాతం లోపే ఉన్నది. 2005లో భాటియా, గంగ్వాల్ కలిసి ఇండిగోను స్థాపించగా, నాడు ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్‌కు 51.12 శాతం, గంగ్వాల్‌కు చెందిన వర్జీనియా ఆధారిత సెల్యూమ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు 47.88 శాతం వాటా ఉంది. అయితే స్టాక్ మార్కెట్లలోకి సంస్థ రావడంతో ఈ ఇరువురి వాటాలు తగ్గిపోయాయి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, జెట్ ఎయిర్‌వేస్‌ల పోటీని తట్టుకుని, ఎయిర్ ఇండియాను వెనక్కి నెట్టి ప్రస్తుతం భారతీయ విమానయాన రంగంలో అతిపెద్ద సంస్థగా ఉన్న ఇండిగోను ప్రమోటర్ల గొడవలు రచ్చకీడుస్తున్నాయి.

అసలేం జరిగింది?..

సంస్థలో మెజారిటీ వాటా ఉండటంతో ప్రతీ విషయంలోనూ భాటియా పెత్తనమే కొనసాగుతూ వస్తున్నది. సీనియర్ మేనేజ్‌మెంట్ నియామకాల్లోనూ ఇంటర్‌గ్లోబ్‌దే తుది నిర్ణయం. ఇది గంగ్వాల్ ఈగోను హర్ట్ చేస్తూ వచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో అమెరికాకు చెందిన సీఎఫ్‌ఎం ఇంటర్నేషనల్‌తో ఎల్‌ఈఏపీ-1ఏ ఇంజిన్ల కోసం జూన్‌లో ఇండిగో 20 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నది. భవిష్యత్తులో సంస్థ సమకూర్చుకోబోయే 280 ఎయిర్‌బస్ 320, 321 విమానాల కోసమే ఈ ఇంజిన్లు. ఇప్పటిదాకా ఇండిగో విమానాల్లో ప్రాట్ అండ్ విట్నీ (పీఅండ్‌డబ్ల్యూ) ఇంజిన్లనే వాడుతున్నారు. అయితే ఇటీవలికాలంలో వీటి పనితీరు బాగా లేనందున మరో సంస్థతో ఇండిగో డీల్ చేసుకున్నది. ఈ క్రమంలో సంస్థ అసాధారణ సాధారణ సమావేశం (ఈజీఎం)లో కార్పొరేట్ గవర్నెన్స్‌పై గంగ్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై గత నెల 12న భాటియా ఓ లేఖ ద్వారా స్పందించడం, ఆపై గంగ్వాల్-భాటియా మధ్య మాటల యుద్ధం రాజుకున్నది. ఇంటర్‌గ్లోబ్ ప్రయోజనాల కోసమే భాటియా నిర్ణయాలు తీసుకుంటున్నారని గంగ్వాల్ ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ జోక్యం చేసుకోవాలని గంగ్వాల్ లేఖ రాయడంతో ఇండిగో విభేదాలు బయటపడ్డాయి. పాన్ షాప్ కంటే అధ్వానంగా ఇండిగో నిర్వహణ ఉందంటూ విమర్శించారు.


ఇండిగోలోని విభేదాలు.. బుధవారం స్టాక్ మార్కెట్లలోని ఆ సంస్థ షేర్లను ప్రభావితం చేశాయి. మదుపరులు అమ్మకాలకు దిగడంతో 11 శాతానికిపైగా నష్టపోయాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో 10.73 శాతం పడిపోయి రూ.1,397.75 వద్ద స్థిరపడిన ఇండిగో షేర్ విలువ.. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో 11.12 శాతం క్షీణించి రూ.1,392 వద్ద నిలిచింది. దీంతో ఈ ఒక్కరోజే బీఎస్‌ఈలో సంస్థ మార్కెట్ విలువ రూ.6,423 కోట్లు హరించుకుపోయి రూ.53,765.40 కోట్లకు పరిమితమైంది.

సమస్యల్లో పరిశ్రమ

దేశీయ విమానయాన రంగంలో ఒక సంస్థ తర్వాత మరో సంస్థ ఏదో ఒక రకంగా సమస్యల వలయంలో చిక్కుకోవడం ఇప్పుడు భయాందోళనకు గురిచేస్తున్నది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్‌వేస్.. ఇప్పుడు ఇండిగో. ఇలా ప్రధాన సంస్థలన్నీ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండటం పరిశ్రమను ఆందోళనకు లోనుచేస్తున్నది. సామాన్యులకూ విమాన సేవలను అందించాలని కేంద్ర ప్రభుత్వం కొత్తకొత్త లక్ష్యాలతో ముందుకొస్తున్న వేళ.. తాజా పరిస్థితులు మొత్తం పరిశ్రమ అభివృద్ధినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. రూ.9,000 కోట్ల రుణ భారంతో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూతపడగా, రూ.18,000 కోట్ల రుణ సంక్షోభంతో జెట్ ఎయిర్‌వేస్ ఆగిపోయింది. ఇక ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా గురించైతే చెప్పనక్కర్లేదు. పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఈ సంస్థను ప్రైవేటీకరణ దిశగా మోదీ సర్కారు నడిపిస్తున్నది. ఈ నేపథ్యంలో అంతా బాగుందనిపించిన ఇండిగోలో విభేదాలు.. ఇప్పుడు ఈ సంస్థ భవిష్యత్తుపై ఆలోచింపజేస్తున్నాయి.

భయం అక్కర్లేదు: ఇండిగో సీఈవో

ప్రమోటర్ల మధ్య నెలకొన్న విభేదాలు.. సంస్థ పనితీరును, నిర్వహణను ఏవిధంగానూ ఆటంకపర్చబోవని ఇండిగో సీఈవో రోంజాయ్ దత్తా విశ్వాసం వ్యక్తం చేశారు. ఉద్యోగుల్లో ఏర్పడుతున్న భయాందోళనల్ని పోగొట్టేందుకు వారిని ఉద్దేశిస్తూ బుధవారం ఓ లేఖ రాశారు. సంస్థ లక్ష్యాలు, వ్యూహాల్లో ఎలాంటి మార్పూ ఉండబోదని స్పష్టం చేశారు. మరోవైపు ఇంటర్‌గ్లోబ్ కూడా ఎలాంటి అవకతవకలు జరగలేదని ఓ ప్రకటనలో పేర్కొన్నది.

2632
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles