వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి భారత్ సాధించగలదు

Tue,July 23, 2019 03:24 AM

India will achieve 8Percentage plus growth from FY 2020-2021 onwards NITI Aayog Vice Chairman

నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్
న్యూయార్క్, జూలై 22: వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21) నుంచి 8 శాతాన్ని దాటి భారత్ వృద్ధిరేటు నమోదు కాగలదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వంటి నిర్మాణాత్మక సంస్కరణల ఫలాలు అందడం మొదలవుతుందన్నారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలుపై ఉన్నతస్థాయి రాజకీయ మంత్రి మండలి సమావేశానికి ఆయన హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఇక్కడి కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వద్ద ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ సెమినార్‌నుద్దేశించి కీలకోపన్యాసం చేశారు. రాబోయే ఐదేండ్లలో భారత ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నట్లు గుర్తుచేశారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం దాదాపు 7 శాతంగా ఉన్న జీడీపీని 8 శాతాన్ని మించి నమోదు చేయాలని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అప్పుడే 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ కల సాకారం కాగలదన్నారు. 2020-21 నుంచి దేశ జీడీపీ 8 శాతాన్ని దాటగలదని నేను అనుకుంటున్నాను అని కుమార్ పీటీఐకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. జీఎస్టీ, దివాలా చట్టం తదితర సంస్కరణల ఫలాలు మొదలవుతాయని, వాటి సాయంతో భారత వృద్ధిరేటు పరుగందుకోగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రెండంకెల వృద్ధిరేటును సాధిస్తామన్న ధీమాను కనబరిచారు.

బడ్జెట్ బాగుంది

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ బాగుందని కుమార్ అన్నారు. ఈ నెల 5న లోక్‌సభలో సీతారామన్ బడ్జెట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలో సులభతర వ్యాపార నిర్వహణకున్న పరిస్థితులను మరింత మెరుగు పరిచేలా ఈ బడ్జెట్ ఉందని కుమార్ ప్రశంసించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) రాక కోసం నిబంధనల సరళీకరణ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఎంతగానో కలిసి వస్తుందని అంచనా వేశారు. మోదీ సర్కారు అమలు చేస్తున్న మరిన్ని పథకాలు, తీసుకోనున్న నిర్ణయాలపైనా ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ పీటీఐతో వివరంగా మాట్లాడారు.

భారీగా ఉద్యోగాలిచ్చాం..

గడిచిన ఐదేండ్లలో దేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు వచ్చాయని రాజీవ్ కుమార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దేశం సాధిస్తున్నది ఉద్యోగాల్లేని వృద్ధిరేటే అయితే సామాజిక కలహాలు, ఆందోళనలు చెలరేగేవి. అసలు మళ్లీ మోదీ సర్కారు అధికారంలోకి వచ్చేదే కాదు అని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడున్న ఉద్యోగావకాశాలపై యువత అంతగా ఆసక్తి చూపడం లేదన్న ఆయన వారు నచ్చే.. మెచ్చే ఉద్యోగాలనే అందుకునేలా ప్రభుత్వం శ్రమిస్తుందని ప్రకటించారు. అన్ని రంగాల ప్రగతికి బాటలు వేసే నిర్ణయాలను తీసుకుంటున్నామని చెప్పారు. తద్వారా యువత కోరుకున్న ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వారికి దక్కుతాయన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు.

291
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles