ధరల నియంత్రణకు దిగుమతులు

Sat,November 9, 2019 11:52 PM

- కేంద్ర ఆహార శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్
న్యూఢిల్లీ, నవంబర్ 9: మార్కెట్‌లో ఉల్లి ధరలు ఠారెత్తిస్తున్న నేపథ్యంలో దిగుమతులపై దృష్టి సారించింది మోదీ సర్కారు. ఈ క్రమంలోనే లక్ష టన్నుల ఉల్లిగడ్డను దిగుమతి చేసుకోనున్నట్లు శనివారం కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ తెలిపారు. కార్యదర్శుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో కిలో ఉల్లిగడ్డ ధర దాదాపు రూ.100 పలుకుతుండగా, ఇతర నగరాలు, పట్టణాల్లో రూ.60-80 శ్రేణిలో కదలాడుతున్నది. దాదాపు రూ.100 పలుకుతున్నది. దీంతో ధరల నియంత్రణ కోసం మార్కెట్‌కు ఉల్లి సరఫరాను పెంచాలని యోచిస్తున్న కేంద్రం.. దిగుమతులపై దృష్టి పెట్టింది. ప్రభుత్వ రంగ ట్రేడింగ్ సంస్థ ఎంఎంటీసీ.. ఉల్లిని దిగుమతి చేసుకోనుండగా, సహకార సంస్థ నాఫెడ్.. దేశవ్యాప్తంగా మార్కెటింగ్ చేయనున్నది. ధరలను అదుపు చేయడానికి లక్ష టన్నుల ఉల్లిగడ్డను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది అని పాశ్వాన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు మార్కెట్‌లో ఉల్లిగడ్డ సరఫరా పెరిగేలా దిగుమతులకు సిద్ధం కావాలని ఎంఎంటీసీని ప్రభుత్వం ఆదేశించింది. ఈజిప్టు, ఇరాన్, టర్కీ, అఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి ప్రైవేట్ టెండర్ల ద్వారా ఉల్లిగడ్డను దిగుమతి చేసుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తున్నది. ఈ ఖరీఫ్ సీజన్‌లో ఉల్లి ఉత్పత్తి 30 నుంచి 40 శాతం పడిపోవడంతో దేశంలో ధరలు భగ్గుమన్నాయి. మహారాష్ట్ర, కర్నాటకల్లో కురిసిన భారీ వర్షాలు కూడా ఉల్లి పంటను దెబ్బతీశాయి.

261
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles