మాంద్యంలో భారత్

Mon,December 9, 2019 12:04 AM

-దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనం
-ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్
-అధికార కేంద్రంగా ప్రధాని కార్యాలయం
-మంత్రులంతా డమ్మీలే

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్.. మరోసారి మోదీ సర్కారుపై నిప్పులు చెరిగారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా తయారైందని, వృద్ధి మాంద్యంలో భారత్ పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) అధికార కేంద్రంగా మారిందంటూ మండిపడ్డ ఆయన మంత్రుల చేతిలో అధికారం లేదని, అంతా డమ్మీలుగా మారారని విమర్శించారు. ఇండియా టుడే మ్యాగజైన్‌కు రాసిన వ్యాసంలో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పలు చర్యలను రాజన్ సిఫార్సు చేశారు. పెట్టుబడులు, భూమి, కార్మిక మార్కెట్లను సరళతరం చేసేందుకు సంస్కరణలు ప్రవేశపెట్టాలన్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలని, దీనివల్ల పోటీ వాతావరణం పెరిగి, దేశంలో ప్రభావవంతమైన మార్కెట్లు ఏర్పడుతాయని తెలిపారు. ప్రధాని కార్యాలయంలోనే నిర్ణయాలు, ఆలోచనలు, ప్రణాళికలు జరుగుతున్నాయి. ఈ విధానం ఎంతమాత్రం మంచిది కాదు అన్నారు. రాజకీయ, సామాజిక అజెండాలకు పీఎంవో తీరు సరిపోతుందేమోగాని, ఆర్థిక సంస్కరణలకు ఈ రకమైన విధానం పనికిరాదన్నారు. గత ప్రభుత్వాల్లో కూడా పొరబాట్లు జరిగి ఉండొచ్చన్న ఆయన అవి ఆర్థిక సరళీకరణకు పెద్దపీట వేశాయని, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మాత్రం దానిపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. మంత్రులకు దిశా-నిర్దేశం చేసేవారే లేరన్న ఆయన మోదీ ప్రభుత్వం సామాన్య ప్రభుత్వం-సుపరిపాలన నినాదంతో అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. కానీ అలా ఏమీ జరుగడం లేదన్నారు. నగదు బదిలీ వంటి కొన్ని విజయాలు సాధించినా.. ఎన్నో నిర్ణయాలు ప్రతికూల ఫలితాల్ని అందించాయన్నారు. ఆర్థిక మందగమనం నుంచి దేశాన్ని బయటపడేయడమే ఇప్పుడు మోదీ సర్కారు ముందున్న అతిపెద్ద సవాల్ అని చెప్పారు.

సంస్కరణలకు పదును పెట్టాలి

భూ సేకరణ, కార్మిక చట్టాలు, స్థిరమైన పన్నులు, ప్రభావవంతమైన నియంత్రణ వ్యవస్థ, వేగవంతమైన దివాలా పరిష్కారాలు, విద్యుత్ సంస్కరణలు అవసరమని రాజన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. దేశీయ నిర్మాణ, స్థిరాస్తి, మౌలిక రంగాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయన్న ఆయన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లు తమ రుణాలపట్ల అప్రమత్తంగా ఉండాలనీ సూచించారు. నిరుద్యోగం పెరిగిపోతున్నదని, దేశీయ వ్యాపారాల్లో పెట్టుబడులు సన్నగిల్లుతున్నాయని ఆందోళన కనబరిచారు. మంత్రులు స్వతంత్రంగా పనిచేసే పరిస్థితులను ఏర్పరుచాలన్న ఆయన రాష్ర్టాలతో కేంద్రానికి సత్సంబంధాలుండటం చాలా ముఖ్యమని నొక్కిచెప్పారు.

8-9 శాతం వృద్ధితోనే సాధ్యం

దేశ ఆర్థిక వ్యవస్థను 2024 నాటికి 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలన్న లక్ష్యంతో మోదీ సర్కారు ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. అయితే కనీసం 8-9 శాతం వృద్ధిరేటు ఉంటేనే అది సాధ్యమని రాజన్ అన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ స్థాయి జీడీపీ అంత సులువు కాదని వ్యాఖ్యానించారు. దీంతో 5 లక్షల కోట్ల డాలర్ల జీడీపీ లక్ష్యం నెరవేరడం కష్టమేనన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో దేశ జీడీపీ ఆరేండ్ల కనిష్ఠాన్ని తాకుతూ 4.5 శాతానికి పరిమితమైన విష యం తెలిసిందే. అంతకుముందు త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 5 శాతంగా ఉన్నది. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)సహా దేశ, విదేశీ రేటింగ్ ఏజెన్సీలు భారత వృద్ధిరేటు అంచనాలను తగ్గిస్తున్న సంగతీ విదితమే. ఆర్బీఐ సైతం ఈసారి జీడీపీ అంచనాను 5 శాతానికి కుదించడం.. దేశ ఆర్థిక పరిస్థితులకు అద్దం పడుతున్నది. అంతకుముందు 6.1 శాతంగా అంచనా వేసింది. దీంతో అప్రమత్తంగా ఉండకపోతే అనర్థాలు తప్పవని రాజన్ హెచ్చరిస్తున్నారు.

282
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles