మేఘాకు ప్రతిష్ఠాత్మక ఐసీఐ అవార్డు

Sun,September 8, 2019 03:01 AM

Distinguished ICI Award for Kaleshwaram Project

-కాళేశ్వరం ప్రాజెక్టుకుగాను ప్రదానం
హైదరాబాద్, సెప్టెంబర్ 7: ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్)కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ కాంక్రీట్ ఇనిస్టిట్యూట్ (ఐసీఐ) నుంచి ఉత్తమ కాంక్రీట్ నిర్మాణ అవార్డు అందుకున్నది. కాంక్రీట్ డే సందర్భంగా శనివారం ఇక్కడి మారియట్ హోటల్‌లో కాంక్రీట్ ఎక్స్‌లెన్స్ అవార్డులను ఐసీఐ ప్రదానం చేసింది. దీంతో ప్రపంచ స్థాయి కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణానికిగాను మేఘాకు ఐసీఐ అవార్డు వచ్చింది. రికార్డు సమయంలో ఈ భారీ ప్రాజెక్టును మేఘా పూర్తి చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ అవార్డును ఐసీఐ అధ్యక్షుడు వినయ్ గుప్తా చేతుల మీదుగా ఎంఈఐఎల్ డైరెక్టర్ బీ శ్రీనివాస్‌రెడ్డి అందుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌తోపాటు ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన ఇతర కంపెనీల ప్రతినిధులూ అవార్డులను తీసుకున్నారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఈ అవార్డు అందుకోవడం గర్వంగా ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని ఈ అవార్డు మరోసారి రుజువు చేసింది. ఇంతటి గొప్ప ప్రాజెక్టులో ఎంఈఐఎల్ భాగమైనందుకు ఆనందంగా ఉంది అన్నారు. లింక్-1లోని మూడు పంప్ హౌజ్‌లలో 45 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను ఉపయోగించామని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం మూడు షిఫ్టుల్లో 1,500 మంది ఇంజనీర్లు, సిబ్బంది పనిచేశారన్న ఆయన వారందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహాయ, సహకారాలతోనే ఈ ప్రాజెక్టును ఇంత త్వరగా పూర్తి చేయగలిగాం అన్నారు. కాగా, హైదరాబాద్‌లోని అమెజాన్ భవనం, ఖాజాగూడ నుంచి నానక్‌రామ్ గూడ వరకు ఉన్న వైట్ ట్యాపింగ్ రోడ్‌లతోపాటు వివిధ జిల్లాల్లోని ఉత్తమ కాంక్రీట్ నిర్మాణాలకూ అవార్డులు లభించాయి. ఇదిలావుంటే ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురైన ఇంజనీరింగ్ సవాళ్లపై కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ఎస్ వెంకటేశ్వర్లు ఉపన్యాసం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐసీఐ తెలంగాణ సెంటర్ చైర్మన్ పీ శ్రీనివాస్‌రెడ్డి, ప్రముఖ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

246
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles